Bandi Sanjay: కవితపై మరోసారి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-03-16T16:07:22+05:30
ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)పై బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు...
హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)పై బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఢిల్లీలో నీ బిడ్డకు రెడీ అయింది’ అని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీకి ఐటీ శాఖ విఫలమే కారణమని విమర్శించారు. పేపర్ లీకేజీకి బాధ్యత వహించి మంత్రి కేటీఆర్ (Minister KTR) రాజీనామా చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. కొడుకును కాపాడేందుకు కేసీఆర్ పాట్లు పడుతున్నారని దుయ్యబట్టారు. టీఎస్‌పీఎస్సీ ఏఈ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ (TSPSC Paper Leak) ఘటనలో కీలక నిందితురాలు రాథోడ్ రేణుక (Renuka Rathod) కుటుంబం కోసమే పేపర్ లీకేజీ చేశారని ఆరోపించారు. రేణుకకు గురుకుల పాఠశాలలో అక్రమంగా ఉద్యోగం ఇచ్చారని తెలిపారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తప్పించుకోవడానికే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందని బండి సంజయ్ ఆరోపించారు.
పేపర్ లీక్ పాపం ‘బండి’దే
తెలంగాణలో బీజేపీ కుట్రలు పరాకాష్టకు చేరుకున్నాయని.. ఆ పార్టీ నేత బండి సంజయ్ నేతృత్వంలోనే టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకయిందని బీఆర్‌ఎస్ పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బొంతు రామ్మోహన్ ఆరోపించారు. గడిచిన తొమ్మిదేళ్లుగా లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టినా టీఎస్‌పీఎస్సీలో ఎటువంటి అక్రమాలు చోటు చేసుకోలేదని.. ఇప్పుడు కేవలం బీజేపీ నేతలు (BJP leaders) కుట్రపూరితంగా పేపర్‌లీక్ చేయించి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలనుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో బండి సంజయ్ పాత్రకు సంబంధించి తమ వద్ద ఆధారాలున్నాయని పేర్కొన్నారు. ఈ అంశంపై మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. పేపర్ లీక్ కేసులో ఏ2గా ఉన్న నిందితుడు రాజశేఖర్ రెడ్డి బండి సంజయ్‌కి, కిషన్‌రెడ్డికి సన్నిహితుడంటూ బీఆర్‌ఎస్ నేత ఒకరు ఫొటోలతో సహా చేసిన ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు.
మరోవైపు రాథోడ్ రేణుక గురించి ఆరా తీసే కొద్దీ ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె తల్లి లక్ష్మీభాయి మన్సూర్‌పల్లి బీఆర్‌ఎస్ సర్పంచ్ కావడంతో కలిసొచ్చిన రాజకీయ బలం, గురుకుల ఉపాధ్యాయురాలిగా తనకు, టెక్నికల్ అసిస్టెంట్‌గా తన భర్త ఢాక్యానాయక్‌కు ఉన్నతస్థాయి అధికారులతో ఉన్న పరిచయాలను ఉపయోగించి ఆమె లీకేజీకి పూనుకున్నట్లు చర్చ సాగుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా గంఢీడ్ మండలానికి చెందిన రేణుక వనపర్తి ఎస్సీ గురుకుల విద్యాలయంలో హిందీ పండిట్‌గా, ఆమె భర్త వికారాబాద్ జిల్లా పరిగిలోని డీఆర్‌డీఏలో పనిచేస్తున్నారు. రేణుక తన సోదరుడు రాజేశ్‌నాయక్‌తో పాటు మన్సూర్‌పల్లి తండాకే చెందిన నీలేశ్, శ్రీను, వికారాబాద్ జిల్లా లగిచర్లకు చెందిన గోపాల్‌కు కూడా ప్రశ్నపత్రం ఇప్పిస్తానని చెప్పింది. ప్రశ్నపత్రం కోసం భర్త సహకారంతో టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ప్రవీణ్‌ను (Praveen) సంప్రదించినట్లు చెబుతున్నారు.
Updated Date - 2023-03-16T16:07:22+05:30 IST