ODI World Cup 2023: మెగా టోర్నీకి దూరమవుతున్న స్టార్ ఆటగాళ్లు వీళ్లే..!!
ABN, First Publish Date - 2023-09-28T16:27:37+05:30
వన్డే ప్రపంచకప్ ట్రోఫీ నెగ్గడమే లక్ష్యంగా అన్ని జట్లు బరిలోకి దిగుతున్నాయి. కానీ ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాలను మార్చగల పలువురు స్టార్ ఆటగాళ్లు గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి మిస్ అవుతున్నారు.
నాలుగేళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ మళ్లీ జరుగుతోంది. గత మెగా టోర్నీ క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్‌లో జరగ్గా.. ఈసారి క్రికెట్ మెట్టినిల్లు ఇండియాలో నిర్వహిస్తున్నారు. దీంతో స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీమిండియా మరోసారి విజేతగా నిలవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు ట్రోఫీ నెగ్గడమే లక్ష్యంగా అన్ని జట్లు బరిలోకి దిగుతున్నాయి. స్టార్ ఆటగాళ్లు తమ బ్యాటింగ్ విన్యాసాలు, అదరగొట్టేలా బౌలింగ్, కళ్లు చెదిరేలా ఫీల్డింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాలను మార్చగల పలువురు స్టార్ ఆటగాళ్లు గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి మిస్ అవుతున్నారు. దాదాపు అన్ని ప్రధాన జట్లు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇంతకీ ఆ స్టార్ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూసేద్దాం.
మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియానే హాట్ ఫేవరెట్ అని అందరికీ తెలిసిందే. అయితే రిషబ్ పంత్ లాంటి యువ వికెట్ కీపర్, స్టార్ ఆటగాడు లేకుండానే భారత్ ఈ టోర్నీ ఆడుతోంది. గత ఏడాది డిసెంబరులో ఢిల్లీ సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో రిషబ్ పంత్ గాయపడి ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా.. ఒంటి చేత్తో జట్టును గెలిపించగల సత్తా ఉన్న రిషబ్ పంత్ ప్రపంచకప్ ఆడకపోవడం టీమిండియాకు పెద్ద లోటే అని చెప్పాలి.
ఇంగ్లండ్ విషయానికి వస్తే స్టార్ బౌలర్, డెత్ ఓవర్ స్పెషలిస్ట్ జోఫ్రా ఆర్చర్ లేకుండానే ప్రపంచకప్ ఆడేందుకు సిద్ధమైంది. గత వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఛాంపియన్‌గా నిలవడంలో ఆర్చర్ కీలకపాత్ర పోషించాడు. ఫైనల్లో సూపర్ ఓవర్‌లో కూడా ఒత్తిడిని అధిగమించి తన జట్టును గెలిపించాడు. అయితే ఈ ఏడాది అతడు గాయం కారణంగా ఆటకు దూరమయ్యాడు. దీంతో మెగా టోర్నీలోనూ ఆడలేని పరిస్థితి నెలకొంది. అటు స్టార్ ఓపెనర్ జాసన్ రాయ్ కూడా గాయంతో మెగా టోర్నీకి దూరం అయ్యాడు. ఐపీఎల్ 16వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున అదరగొట్టిన అతడు ప్రపంచకప్‌లో ఆడకపోవడం ఇంగ్లండ్‌కు పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు.
ఇప్పటివరకు ఐసీసీ టైటిల్ గెలవలేని దక్షిణాఫ్రికా ఈసారి అన్ని అస్త్రాలతో వన్డే ప్రపంచకప్‌కు సిద్ధమైంది. అయితే ఆ జట్టుకు కూడా స్టార్ ఆటగాడు దూరం కావడంతో కోలుకోలేని దెబ్బపడింది. ప్రధాన పేసర్ అన్రిచ్ నోకియా గాయం కారణంగా మెగా టోర్నీకి దూరమయ్యాడు. ఐపీఎల్ ద్వారా భారత్‌లోని పిచ్‌లపై అతడికి మంచి అవగాహన ఉంది. కానీ అతడు లేకపోవడంతో దక్షిణాఫ్రికా ఫెలుక్వాయోను జట్టులోకి తీసుకుంది. మరో ఫాస్ట్ బౌలర్ మగాల కూడా గాయంతో ప్రపంచకప్‌కు దూరం కావడం దక్షిణాఫ్రికాకు మరో దెబ్బ.
ఇది కూడా చదవండి: Asian Games: చైనాకు బయల్దేరిన టీమిండియా.. గోల్డ్ మెడల్ తెస్తుందా?..
అటు పాకిస్థాన్ కూడా స్టార్ ఆటగాడిని కోల్పోయింది. పేస్ త్రయంలో ఒకడైన నసీమ్ షా గాయం కారణంగా వన్డే ప్రపంచకప్ ఆడటం లేదు. ఆసియా కప్‌లో టీమిండియాతో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో నసీమ్ షా గాయపడ్డాడు. దీంతో అతడి స్థానంలో పాకిస్థాన్ సెలక్టర్లు హసన్ అలీని ఎంపిక చేశారు. శ్రీలంక కూడా స్టార్ ఆల్‌రౌండర్ సేవలను కోల్పోయింది. గాయం కారణంగా వనిందు హసరంగ వన్డే ప్రపంచకప్ ఆడటం లేదు. వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో రాణించిన అతడు మెగా టోర్నీకి దూరం కావడం శ్రీలంక అవకాశాలను దెబ్బతీస్తుందని చెప్పవచ్చు. న్యూజిలాండ్ కూడా పేస్ ఆల్‌రౌండర్ మిచెల్ బ్రేస్‌వెల్ సేవలను కోల్పోయింది. అంతేకాకుండా 2020 డబ్ల్యూటీసీ ఫైనల్ హీరో, ఆల్‌రౌండర్ కైల్ జేమీసన్, ఆడమ్ మిల్నే కూడా మెగా ఈవెంట్‌కు దూరమయ్యారు.
Updated Date - 2023-09-28T16:44:19+05:30 IST