Rare fish: తలరాత మార్చిన చేప.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిన వ్యక్తి
ABN, First Publish Date - 2023-11-10T18:13:44+05:30
అదృష్టం తలుపు తడితే తలరాతలు ఏవిధంగా మారిపోతాయో చాటిచెప్పే ఘటన ఒకటి పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో వెలుగుచూసింది. ఓ మత్స్యకారుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇందుకు ఒక చేప కారణమైంది.
అదృష్టం తలుపు తడితే తలరాతలు ఏవిధంగా మారిపోతాయో చాటిచెప్పే ఘటన ఒకటి పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో వెలుగుచూసింది. ఓ మత్స్యకారుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇందుకు ఒక చేప కారణమైంది. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన అరుదైన ఓ చేప అతడి వలకు చిక్కింది. దీనిని వేలంపాట వేసి విక్రయించగా రాత్రికి రాత్రే అతడు కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఆ అదృష్టవంతుడి పేరు ‘హాజీ బలోచ్’. సాధారణ కుటుంబానికి చెందిన అతడు ‘ఇబ్రహీం హైదరీ’ మత్స్యకార గ్రామంలో నివసిస్తున్నాడు. అతడి చేతికింద పనిచేసే కార్మికులు సోమవారం అరేబియా సముద్రంలో ‘గోల్డెన్ ఫిష్’ లేదా ‘సోవా’ అని పిలిచే చేపను పట్టారు.
శుక్రవారం ఉదయం కరాచీ నౌకాశ్రయంలో ఈ చేపను వేలం వేయగా దాదాపు 70 మిలియన్ పాకిస్థాన్ రూపాయలకు అమ్ముడుపోయింది. ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.2 కోట్లకుపైగా పలికింది. సోవా చేపకు విపరీతమైన డిమాండ్ ఉంది. సాంప్రదాయ ఔషధాలు, స్థానిక వంటకాల్లో దీనిని ఉపయోగిస్తుంటారు. బంగారు బాతుగుడ్డు లాంటి ఈ చేప దొరకడం తమకెంతో సంతోషంగా ఉందని హాజీ బలోచ్ చెప్పాడు. ఆ డబ్బును తన ఏడుగురు సిబ్బందితో పంచుకుంటానని హాజీ తెలిపాడు. కాగా సంతానోత్పత్తి కాలంలో మాత్రమే ఈ చేపలు తీరానికి చేరుకుంటాయి.
సోవా చేప మార్కెట్‌లో చాలా విలువ పలుకుతుంది. అరుదైనది కావడంతో దీనిని కొనేందుకు పోటీపడతారు. ఈ చేప బొడ్డు భాగంలో లభించే పదార్థానికి గొప్ప వైద్య, ఔషధ గుణాలు ఉన్నాయి. చేపల నుంచి దారం లాంటి పదార్థాన్ని సేకరించి శస్త్రచికిత్స విధానాలలో కూడా ఉపయోగిస్తారు. 20 - 40 కేజీల బరువు, 1.5 మీటర్ల పొడవు పెరిగే ఈ చేప తూర్పు ఆసియా దేశాలలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది.
Updated Date - 2023-11-10T18:13:45+05:30 IST