Success Story: బీటెక్ చేసి ఇదేం పని అన్నోళ్లే.. ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు.. ఈ కుర్రాడి ఆదాయం ఎంతంటే..!
ABN, First Publish Date - 2023-12-11T16:15:07+05:30
అన్షుల్ మిశ్రా అనే ఈ కుర్రాడు నాలుగేళ్ల క్రితమే బీటెక్ పూర్తి చేసినా.. తన విద్యార్హతకు తగిన ఉద్యోగాలు మాత్రం దొరకలేదు. దీంతో తండ్రితో కలిసి వ్యవసాయం వైపు అడుగులు వేశాడు. అందరిలా కాకుండా వెరైటీగా ఆలోచించి ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నాడు.
డిగ్రీలు చేసినా సర్టిఫికెట్లు వస్తున్నాయి కానీ.. జాబులు మాత్రం రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసే నిరుద్యోగుల సంఖ్య లక్షల్లో కాదు.. దేశ వ్యాప్తంగా కొన్ని కోట్లలో ఉంటుంది. కానీ ఉద్యోగం లేదని నిరాశ పడకుండా తమకు ఉన్న తెలివి తేటలనే పెట్టుబడిగా పెట్టి లక్షలు సంపాదించే వారు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. అన్షుల్ మిశ్రా అనే ఈ కుర్రాడు రెండో వర్గానికి చెందిన వాడు. నాలుగేళ్ల క్రితమే బీటెక్ పూర్తి చేసినా.. తన విద్యార్హతకు తగిన ఉద్యోగాలు మాత్రం అతడికి దొరకలేదు. దీంతో తండ్రితో కలిసి వ్యవసాయం వైపు అడుగులు వేశాడు. అందరిలా కాకుండా వెరైటీగా ఆలోచించి ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నాడు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్‌పూర్‍లోని జలాలాబాద్ పరిధిలో చిలోవా అనే గ్రామానికి చెందిన అన్షుల్ మిశ్రా 2019వ సంవత్సరంలోనే బీటెక్ పూర్తి చేశాడు. యూపీ నుంచి తమిళనాడులోని చెన్నైకి వచ్చి మరీ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివినా.. ఉద్యోగాన్వేషణలో అతడికి అడుగడుగునా నిరాశే మిగిలింది. అర్హతకు తగిన ఉద్యోగాలు దొరక్క విసిగి వేసారిపోయాడు. చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో సొంతూరికి వెళ్లిపోయాడు. అయితే తండ్రికి అయిదెకరాల పొలం ఉంది. వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించే తండ్రిని చూసి.. అన్షుల్ కు ఓ ఐడియా తళుక్కున తట్టింది.
మామూలు పంటలను కాకుండా డ్రాగన్ ఫ్రూట్స్ ను కనుక పండించగలిగితే లక్షల్లో లాభం ఉంటుందని యూట్యూబ్ వీడియోల్లోనూ, సోషల్ మీడియాలోనూ చదివి తెలుసుకున్న అన్షుల్.. ఆ దిశగా ఆలోచించాడు. తండ్రితో మాట్లాడి ఒప్పించాడు. ఇంజనీరింగ్ చదివిన కొడుకు ఇంతగా చెబుతున్నాడు కదా అని ఓసారి ప్రయత్నించి చూద్దామని తండ్రి కూడా అంగీకారం తెలిపాడు. తనకు ఉన్న అయిదెకరాల పొలాన్ని డ్రాగన్ ఫ్రూట్స్ పంట పండించడానికి అనువైనదిగా మార్చేందుకు అన్షుల్ చాలా కష్టపడ్డాడు. అతడి ప్రయత్నాలను చూసి మొదట్లో అంతా విమర్శించారు. బీటెక్ చదివిస్తే హాయిగా ఉద్యోగం చేసుకోక పొలం పనులెందుకంటూ హితవు పలికిన వారు కూడా ఉన్నారు. అయితే స్నేహితులు, బంధువుల నుంచి వచ్చిన విమర్శలను పట్టించుకోకుండా ముందుకెళ్లిన అన్షుల్.. అనుకున్నట్టుగానే డ్రాగన్ ఫ్రూట్స్ పంటను పండించాడు. మొదటిసారి మంచి ధరకే అమ్మేశాడు.
అయితే చుట్టు పక్కల గ్రామాల రైతులు ఈ డ్రాగన్ ఫ్రూట్ పంటను ఎలా పండించాలన్నది తెలుసుకునేందుకు చూపుతున్న ఉత్సాహాన్ని చూసి అన్షుల్ కు మరో ఐడియా వచ్చింది. డ్రాగన్ ఫ్రూట్స్ కు సంబంధించిన నర్సరీని మొదలు పెట్టి.. మొక్కలను కనుక అమ్మితే మరింత లాభం వస్తుందన్న ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా ఆ నిర్ణయాన్ని అమలు చేసేశాడు. సోషల్ మీడియా ద్వారా కూడా తన నర్సరీ గురించి ప్రచారం చేసుకున్నాడు. అది కూడా బాగా క్లిక్ అవడంతో యూపీలోని రైతుల నుంచే కాకుండా బీహార్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి కూడా రైతుల అన్షుల్ వద్ద నుంచి డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలను తీసుకెళ్తుంటారు. అయితే రైతులకు మొక్కలను అమ్మడంతోనే సరిపెట్టకుండా.. ఆ పంట పెంపకంలో వారికి సలహాలు సూచనలు కూడా అన్షుల్ ఇస్తుంటాడట. అన్షుల్ లోనే ఆ మంచితనం వల్లే అతడికి రైతులు కనెక్ట్ అయ్యారు. అతడి గురించి వాళ్లే ఫ్రీ పబ్లిసిటీ చేయడం మొదలు పెట్టారు. దీంతో అన్షుల్ వ్యాపారం మరింత పెరిగింది.
ఇలా నర్సరీలో డ్రాగన్ మొక్కలను అమ్ముతూ ఇప్పుడు ఏడాదికి అక్షరాలా 10 లక్షల రూపాయలను సంపాదిస్తున్నట్టు అన్షుల్ చెబుతున్నాడు. ఐటీ ఉద్యోగం చేసినా కూడా అదే స్థాయిలో వేతనం ఉంటుందనీ.. తాను మాత్రం ఇంటి వద్ద ఉండే నచ్చిన పని చేసుకుంటూ సంపాదిస్తున్నానంటూ అన్షుల్ ఆనందంగా చెబుతున్నాడు. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేసినట్టు.. అన్షుల్ కు వచ్చిన ఆలోచన అక్కడి రైతుల తలరాతలను కూడా మార్చేస్తోంది. అన్షుల్ సలహాలు, సూచనలను పాటిస్తూ ఆ రైతులు కూడా భారీగానే సంపాదిస్తుండటం కొసమెరుపు.
Updated Date - 2023-12-11T16:15:09+05:30 IST