RK Kothapaluku: ‘కొత్త పలుకు’ పేరిట వైరల్ అయిన ఈ పోస్ట్ ఫేక్..
ABN, First Publish Date - 2023-07-17T21:48:00+05:30
‘కొత్త పలుకు‘ లోగుట్టు రహస్యాలు, చాటుమాటు రాజకీయాలను జనాల ముందుంచేలా వెలువడిన ఎన్నో కథనాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు, పార్టీలకు ముచ్చెమటలు పట్టించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే.. అంతటి బ్రాండ్ ఇమేజ్ కలిగిన ‘కొత్తపలుకు’ని ఉపయోగించుకొని కొందరు అసత్య ప్రచారాలకు తెగబడుతున్నారు. దురుద్దేశాలతో ‘కొత్తపలుకు’ను కుట్రపూరిత చర్యలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy) సంస్థల ఎండీ, తెలుగువారికి సుపరిచితులైన ప్రముఖ జర్నలిస్ట్ వేమూరి రాధాకృష్ణ (Vemuri Radhakrishna) సమకాలీన రాజకీయ విశ్లేషణలకు మారుపేరు. మీడియా రంగంలో నిఖార్సైన జర్నలిస్ట్‌గా విశేష గుర్తింపు ఆయన సొంతం. ఏబీఎన్‌లో ప్రతి ఆదివారం ఆయన స్వయంగా నిర్వహిస్తున్న ‘ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే’ (Open Heart with RK), ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమయ్యే ‘కొత్త పలుకు’కు (Kothapaluku) తెలుగునాట విశేష ఆదరణ ఉంది.
మరీ ముఖ్యంగా ‘కొత్త పలుకు’ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక సంచలనమనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఎన్నో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. సృష్టిస్తూనే ఉంది. లోగుట్టు రహస్యాలు, చాటుమాటు రాజకీయాలను జనాల ముందుంచేలా వెలువడిన ఎన్నో కథనాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు, పార్టీలకు ముచ్చెమటలు పట్టించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే.. అంతటి బ్రాండ్ ఇమేజ్ కలిగిన ‘కొత్తపలుకు’ని ఉపయోగించుకొని కొందరు అసత్య ప్రచారాలకు తెగబడుతున్నారు. దురుద్దేశాలతో ‘కొత్తపలుకు’ను కుట్రపూరిత చర్యలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కొత్త పలుకు పేరిట రాజకీయ ప్రయోజనాల కోసం సృష్టించిన ఫేక్ ఆర్టికల్ ఒకటి ఈ మధ్య వైరల్‌గా మారడం తమ దృష్టికి వచ్చింది. పవన్ కళ్యాణే కాబోయే సీఎం అని కొత్త పలుకులో వేమూరి రాధాకృష్ణ విశ్లేషించినట్టుగా ఈ పోస్ట్ ద్వారా ప్రచారానికి తెరదీశారు. కొత్త పలుకుని పోలి ఉండేలా ఈ ఫేక్ పోస్ట్ ద్వారా కుయుక్తి పన్నారు. బీజేపీ - జనసేన ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ వైపు బీజేపీ అధిష్టానం సుముఖంగా ఉందని ఆర్కే చెప్పినట్టుగా జనాల్లో అభిప్రాయం కలిగించేందుకు వెర్రి వేశాలు వేశారు. కానీ ఇది ఫేక్ ఆర్టికల్. రాజకీయ దురుద్దేశంతో, కుట్రపూరితంగా సృష్టించిన పోస్ట్ ఇది. కొత్త పలుకులో ఈ తరహా రాజకీయ విశ్లేషణ ఇంతవరకు ప్రచురితమవ్వలేదని స్పష్టంగా తెలియజేస్తున్నాం.
రాజకీయ ప్రయోజనాల కోసం కుట్రపూరితంగా ఇలాంటి ఫేక్ ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తప్పవని ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థల యాజమాన్యం తెలియజేస్తోంది. ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థల విశ్వసనీయత, జనాల్లో ఆదరణను వాడుకొని ప్రయోజనం పొందే కుటిల ప్రయత్నాలను ఆపకుంటే చట్టపరమైన పర్యావసనాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని యాజమాన్యం గట్టిగా హెచ్చరిస్తోంది.
Updated Date - 2023-07-17T21:54:29+05:30 IST