Avinash Vs CBI : ఉదయం నుంచి ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. అవినాష్‌పై సీబీఐ సీరియస్.. హెడ్‌క్వార్టర్స్ నుంచి క్లియర్ కట్‌గా ఆదేశాలు.. ఏ క్షణమైనా..!?
ABN, First Publish Date - 2023-05-19T15:24:33+05:30
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్యకేసులో (YS Viveka Murder Case) సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) మళ్లీ సీబీఐ విచారణకు (CBI Enquiry) డుమ్మా కొట్టారు...
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్యకేసులో (YS Viveka Murder Case) సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) మళ్లీ సీబీఐ విచారణకు (CBI Enquiry) డుమ్మా కొట్టారు. ఇప్పటికే ఆరుసార్లు అవినాష్ రెడ్డిని విచారించగా.. మరో రెండుసార్లు విచారణకు చివరి నిమిషంలో డుమ్మా కొట్టారు. ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్ వేదికగా అవినాష్ విషయం పెద్ద హైడ్రామానే నడిచింది. విచారణకు వస్తున్నట్లు సీబీఐకు సమాచారం ఇవ్వడం.. అధికారులంతా వేచి చూస్తుండటం.. మార్గమధ్యలోనే మళ్లీ హైదరాబాద్ నుంచి పులివెందులకు (Hyderabad-Pulivendula) పయనమవ్వడం.. తన తల్లికి (Avinash Mother) అనారోగ్యంగా ఉందని అత్యవసరంగా వెళ్తున్నట్లు సీబీఐకి లేఖ రాయడం.. రాతపూర్వకంగా లేఖ ఇవ్వాలని అవినాష్ తరఫు న్యాయవాదులు సీబీఐ కార్యాలయానికి వెళ్లడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. అవినాష్ కాన్వాయ్‌ను హైదరాబాద్ నుంచే సీబీఐ బృందం ఫాలో అవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అవినాష్‌ను సీబీఐ అధికారులు వెంబడిస్తున్న పరిస్థితి..!. దీంతో ఏ క్షణమైనా అవినాష్‌ను అరెస్ట్ చేయొచ్చని అటు పులివెందులలో.. ఇటు హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఇక అరెస్టే..!
సరిగ్గా ఈ పరిస్థితుల్లో సీబీఐ (CBI) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో అవినాష్‌ను విచారణకు పిలిచినప్పుడు ఏం జరిగింది..? ఇవాళ ఉదయం నుంచి ఏం జరిగింది..? ఏం జరుగుతోంది..? అనే విషయాలను ఇక్కడి అధికారులు పూసగుచ్చినట్లుగా ఎప్పటికప్పుడు సీబీఐ కేంద్ర కార్యాలయానికి సమాచారం అందజేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామాలన్నింటిని నిశితంగా పరిశీలిస్తున్న సీబీఐ.. అవినాష్ రెడ్డిని ఇక మీదట ఉపేక్షించే ప్రసక్తే లేదని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విచారణకు పిలిచిన ప్రతీసారి అవినాష్ డుమ్మా కొడుతుండటంతో ఇక విచారణ అనే మాటే లేకుండా నేరుగా అరెస్టే చేయాలని హెడ్ క్వార్టర్స్ నుంచి సీబీఐ అధికారులకు సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. అవినాష్ కాన్వాయ్‌ను ఫాలో అవుతున్న సీబీఐ బృందానికి కూడా క్లియర్‌కట్‌గా అరెస్ట్‌పై సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది. ఇల కీలక ఆదేశాలు వచ్చిన తర్వాతే అవినాష్‌ను మొదట్నుంచీ సీబీఐ బృందం ఫాలో అవుతున్నట్లుగా సమాచారం. సీబీఐ అధికారులు పదే పదే ఫోన్ చేసినా.. వెంబడిస్తున్నారని తెలుసుకున్న అవినాష్ కనీసం కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదట. అయితే అవినాష్ వర్గం మాత్రం తల్లి అనారోగ్యంగా ఉందని.. ఆమెను చూడాలనే ఆందోళనలో ఆయన ఉన్నారని అందుకే ఎవ్వరు ఫోన్ చేసినా తీయట్లేదని చెబుతోంది. అవినాష్ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని.. విచారణకు హాజరుకావాలనే హైదరాబాద్ వచ్చారని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు.. పులివెందులకు వెళ్లి అయినా సరే అవినాష్‌ను ఇవాళ అరెస్ట్ చేసి తీరాల్సిందేనని సీబీఐ అధికారులు నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇందుకే సీబీఐ సీరియస్..!
సీబీఐ విచారణ మాటేమో కానీ.. ఆ విచారణకు హాజరు కావాల్సిన రోజు మాత్రం ఇలా ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. గత విచారణ నేపథ్యంలో జరిగిన పరిణామాలే ఇప్పుడు మళ్లీ రిపీటవుతుండటం గమనార్హం. విచారణకు రావాల్సిందేనని సీబీఐ నోటీసులు ఇచ్చిన ప్రతిసారి ఒక్కరోజు ముందే పులివెందుల నుంచి హైదరాబాద్‌కు రావడం.. చివరి నిమిషంలో ఏదో ఒకటి చెప్పి డుమ్మా కొట్టేయడం అవినాష్‌కు పరిపాటిగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. అంతేకాదు.. అలా హైదరాబాద్‌కు రావడం.. విచారణకు బయల్దేరినట్లే బయల్దేరి.. అది కూడా ఆఖరి నిమిషంలో ప్రతిసారీ ఇలా చేస్తుండటంతో ఈ పరిణామాలన్నింటినీ సీబీఐ సీరియస్‌గా తీసుకుందని తెలుస్తోంది. అందుకే ఇక మీదట విచారణ అనే మాట ఉండొద్దని.. మొదట ఎంపీని అరెస్ట్ చేసేసి ఆ తర్వాత ఏమున్నా విచారణ చేయాలని సీబీఐ భావిస్తున్నట్లుగా సమాచారం. ఇవన్నీ ఒక ఎత్తయితే మీడియా కవరేజ్‌కు వచ్చిన ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ వాహనం, రిపోర్టర్‌పై దాడి చేయడాన్ని కూడా సీబీఐ తీవ్ర పరిణామంగా భావించినట్లుగా తెలుస్తోంది.
అడ్డుకునేందుకు ప్లాన్..!
ఇదిలా ఉంటే.. అవినాష్‌ను కచ్చితంగా అరెస్ట్ చేస్తారని ముందుగానే పసిగట్టిన ఎంపీ అనుచరులు, అభిమానులు సీబీఐ బృందాలను అడ్డుకునేందుకు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. అవినాశ్‌ను ఫాలో అవుతున్న సీబీఐ వాహనాలను అడ్డుకోవాలని అనుచరులు స్కెచ్ గీసినట్లుగా సమాచారం. కర్నూలు, తాడిపత్రి రూట్‌లో పులివెందులకు అవినాశ్ రెడ్డి వెళ్తున్నారు. అయితే.. మార్గమధ్యలో సింహాద్రిపురం దగ్గర అవినాశ్ అనుచరులు భారీగా మోహరించారు. తనను వెంబడిస్తున్న సీబీఐ బృందాన్ని ఆపాలనేది అవినాశ్ వ్యూహం అన్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. అటు పులివెందులలో కూడా పెద్ద ఎత్తున అభిమానులు, అనుచరులు సీబీఐను అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం.
మొత్తానికి చూస్తే.. శుక్రవారం సాయంత్రాని కల్లా అవినాష్ విషయంలో అటు ఇటో తేల్చేయాలని గట్టిగానే నిర్ణయించుకున్నట్లు సమాచారం. తల్లికి అనారోగ్యం వల్లనే ఈసారి విచారణకు రాలేకపోతున్నానని అవినాష్ చెబుతున్నారు.. ఈ పరిస్థితుల్లో సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..? అవినాష్‌ను అరెస్ట్ చేస్తుందా లేకుంటే వెనక్కి తగ్గుతుందా..? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుందన్న మాట.
******************************
ఇవి కూడా చదవండి..
******************************
Avinash Vs CBI : ఎంపీ అవినాష్ తల్లికి ఏమైంది.. విచారణకు ఎందుకు డుమ్మా కొట్టారు..? అసలేం జరిగిందో పూసగుచ్చినట్లుగా చెప్పిన లాయర్లు..
******************************
Avinash Vs CBI : ఆఖరి నిమిషంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఎంపీ అవినాష్.. వెంటాడుతున్న సీబీఐ.. టెన్షన్.. టెన్షన్..!
******************************
Updated Date - 2023-05-19T15:33:35+05:30 IST