Kejriwal Residence Row : కేజ్రీవాల్‌కు కేంద్రం షాక్
ABN, First Publish Date - 2023-06-27T18:15:27+05:30
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గట్టి షాక్ ఇచ్చింది. ఆయన అధికారిక బంగళా ఆధునీకరణ, పునర్నిర్మాణ కార్యకలాపాల్లో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని CAGను కోరింది.
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Chief Minister Arvind Kejriwal)కు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గట్టి షాక్ ఇచ్చింది. ఆయన అధికారిక బంగళా ఆధునీకరణ, పునర్నిర్మాణ కార్యకలాపాల్లో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (CAG)ను కోరింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (Lieutenant Governor V K Saxena) సిఫారసు మేరకు కేంద్రం ఈ చర్యలు చేపట్టింది.
లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం అధికారులు మంగళవారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక బంగళా పునర్నిర్మాణంలో ఆర్థికపరమైన అక్రమాలు జరిగినట్లు స్థూలంగా, ప్రాథమికంగా వెల్లడైనట్లు లెఫ్టినెంట్ గవర్నర్ సచివాలయం గుర్తించింది. అనంతరం మే 24న కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఈ సమాచారాన్ని తెలియజేసింది. మార్పులు, చేర్పులు పేరుతో ఈ పునర్నిర్మాణం జరిగింది. ఎటువంటి అనుమతులు లేకుండానే పూర్తి స్థాయిలో ఓ కొత్త భవనాన్ని ప్రజా పనుల శాఖ (PWD) నిర్మించింది.
ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమర్పించిన నివేదిక ప్రకారం, కేజ్రీవాల్ అధికారిక బంగళా పునర్నిర్మాణం కోసం రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఖర్చవుతుందని మొదట్లో అంచనా వేశారు. కానీ దీనిని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతూ, రూ.53 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఈ నిర్మాణం కోసం పర్యావరణ చట్టాలతోపాటు వివిధ నిబంధనలను ఉల్లంఘించారు.
ఆప్ స్పందన
కేజ్రీవాల్ అధికారిక బంగళా పునర్నిర్మాణంపై కాగ్ చేత ప్రత్యేక ఆడిట్ జరిపించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది. కాగ్ చేత మరోసారి దర్యాప్తు జరిపించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం బీజేపీ ఫ్రస్ట్రేషన్‌ను సూచిస్తోందని దుయ్యబట్టింది. బీజేపీ అధికారవాద, నియంతృత్వ పోకడలు స్పష్టమవుతున్నాయని మండిపడింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో వరుస పరాజయాలతో బీజేపీ ఇబ్బందులుపడుతోందని ఎద్దేవా చేసింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేతృత్వంలోని నిజాయితీతో కూడిన ప్రభుత్వ పరువు, ప్రతిష్ఠలను దెబ్బతీయడం కోసమే బీజేపీ ప్రయత్నిస్తోందని, కల్పిత ఆరోపణలు చేస్తోందని మండిపడింది. అదానీ గ్రూప్ వంటి అనేక కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఈ నాటకాలు ఆడుతోందని ఆరోపించింది.
ఇవి కూడా చదవండి :
Putin Offer: వాగ్నర్ గ్రూప్ సైనికులకు పుతిన్ ఇచ్చిన ఆఫర్ ఏమిటంటే...?
Opposition unity : ప్రతిపక్షాల ఐక్యతపై మోదీ వ్యాఖ్యలు
Updated Date - 2023-06-27T18:15:27+05:30 IST