Opposition unity : ప్రతిపక్షాల ఐక్యతపై మోదీ వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-06-27T15:11:59+05:30 IST

రానున్న లోక్‌సభ ఎన్నికల (2024 Lok Sabha elections) కోసం ప్రతిపక్షాలు ఏకమయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు ఈసారి గతం కన్నా ఎక్కువ ఆందోళనతో ఉన్నాయని దుయ్యబట్టారు. 2014లో కానీ, 2019లో కానీ బీజేపీ వ్యతిరేక పార్టీలు ఇంత తీవ్ర స్థాయిలో ఆందోళన చెందలేదన్నారు. ఈసారి శత్రువులంతా కలిసికట్టుగా వస్తున్నారన్నారు.

Opposition unity : ప్రతిపక్షాల ఐక్యతపై మోదీ వ్యాఖ్యలు
Narendra Modi

భోపాల్ : రానున్న లోక్‌సభ ఎన్నికల (2024 Lok Sabha elections) కోసం ప్రతిపక్షాలు ఏకమయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు ఈసారి గతం కన్నా ఎక్కువ ఆందోళనతో ఉన్నాయని దుయ్యబట్టారు. 2014లో కానీ, 2019లో కానీ బీజేపీ వ్యతిరేక పార్టీలు ఇంత తీవ్ర స్థాయిలో ఆందోళన చెందలేదన్నారు. ఈసారి శత్రువులంతా కలిసికట్టుగా వస్తున్నారన్నారు. గతంలో ఒకరిని మరొకరు దూషించుకున్నవారు, ఇప్పుడు ఒకరికి మరొకరు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారన్నారు. వారి పట్ల కోపం ప్రదర్శించవద్దని, జాలిపడాలని కోరారు. భోపాల్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో బీజేపీ కార్యకర్త అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను ఓడించాలనే లక్ష్యంతో బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ గట్టి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎన్‌సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, శివసేన (యూబీటీ) తదితర పార్టీలతో ఈ నెల 23న పాట్నాలో సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాల ఐక్యత గురించి బీజేపీ కార్యకర్త ఒకరు అడిగిన ప్రశ్నకు మంగళవారం మోదీ ఘాటుగా స్పందించారు.

ఈ రోజుల్లో గ్యారంటీ అనే పదాన్ని ప్రతిపక్ష పార్టీలు బాగా ప్రచారం చేస్తున్నాయని మోదీ అన్నారు. (ఆ పార్టీలు అధికారంలోకి వస్తే) అవినీతికి గ్యారంటీ అని ప్రజలకు చెప్పవలసిన బాధ్యత బీజేపీ కార్యకర్తలకు ఉందన్నారు. లక్షల కోట్ల అవినీతికి గ్యారంటీ అని ప్రజలకు చెప్పాలని బీజేపీ కార్యకర్తలను కోరారు. కొద్ది రోజుల క్రితం ప్రతిపక్ష పార్టీలు ఫొటోలు తీసుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయన్నారు. ఈ ఫొటోను చూసినపుడు, దానిలోని ప్రతి ఒక్కరూ రూ.20 లక్షల కోట్ల అవినీతికి గ్యారంటీ అని అర్థమవుతుందన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీయే లక్షల కోట్ల అవినీతి కుంభకోణాలకు పాల్పడిందని దుయ్యబట్టారు.

కొందరు వ్యక్తులు కేవలం తమ పార్టీ కోసం మాత్రమే జీవిస్తారన్నారు. తమ పార్టీకి మాత్రమే లబ్ధి చేకూర్చాలని వారు కోరుకుంటారన్నారు. అవినీతి, కమిషన్లు, కట్ మనీ నుంచి తమకు వాటా లభిస్తుందనే కారణంతో వారు ఈ విధంగా చేస్తారన్నారు. శ్రమించి పని చేయాలని వారు కోరుకోరని, అందుకే ఈ మార్గాన్ని వారు ఎంచుకున్నారని చెప్పారు. కుంభకోణాలకు పాల్పడటంలోనే ఈ పార్టీలకు అనుభవం ఉందన్నారు. కుంభకోణాలకు పాల్పడటమే వారి దగ్గర ఉన్న గ్యారంటీ అని దుయ్యబట్టారు. ఈ గ్యారంటీని అంగీకరించాలా? వద్దా? అని దేశం నిర్ణయించాలన్నారు. అయితే మోదీ ఇచ్చే గ్యారంటీ ఒకటి ఉందన్నారు. అది ప్రతి అవినీతిపరుడిపైనా, కుంభకోణానికి పాల్పడే ప్రతి ఒక్కరిపైనా చర్య తీసుకోవడమే ఆ గ్యారంటీ అని తెలిపారు.

బిహార్ రాజధాని నగరం పాట్నాలో జూన్ 23న నితీశ్ ఆధ్వర్యంలో 15 ప్రతిపక్ష పార్టీలు సమావేశమైన సంగతి తెలిసిందే. కనీసం 450 లోక్‌సభ స్థానాల్లో బీజేపీపై ఉమ్మడి అభ్యర్థిని నిలపాలనే అంశంపై వీరు చర్చించేందుకు ఈ సమావేశం జరిగింది. ఈ స్థానాలను నితీశ్ గుర్తించారు. ఈ స్థానాల్లో బీజేపీని ఓడించవచ్చునని ఆయన అంచనా వేస్తున్నారు. ఈ పార్టీలు మరోసారి సమావేశమవాలని నిర్ణయించాయి.

ఇవి కూడా చదవండి :

Putin Offer: వాగ్నర్ గ్రూప్ సైనికులకు పుతిన్ ఇచ్చిన ఆఫర్ ఏమిటంటే...?

Pragati Maidan Tunnel Robbery: ఢిల్లీలో ముమ్మరంగా నైట్ పెట్రోలింగ్, 1,578 మంది కస్టడీ

Updated Date - 2023-06-27T15:18:55+05:30 IST