Delhi ordinance : ఢిల్లీ ఆర్డినెన్స్‌పై కేజ్రీవాల్‌కు కాంగ్రెస్ మద్దతు
ABN, First Publish Date - 2023-07-16T15:38:45+05:30
దేశ రాజధాని నగరం ఢిల్లీ రాష్ట్రంలో గ్రూప్-ఏ అధికారుల నియామకాలు, బదిలీల కోసం ప్రత్యేకంగా ఓ అథారిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు మద్దతివ్వబోమని కాంగ్రెస్ ప్రకటించింది. సోమవారం బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం జరగబోతున్న తరుణంలో కాంగ్రెస్ ఈ ప్రకటన చేసింది.
న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీ రాష్ట్రంలో గ్రూప్-ఏ అధికారుల నియామకాలు, బదిలీల కోసం ప్రత్యేకంగా ఓ అథారిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు మద్దతివ్వబోమని కాంగ్రెస్ ప్రకటించింది. సోమవారం బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం జరగబోతున్న తరుణంలో కాంగ్రెస్ ఈ ప్రకటన చేసింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీకి, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి గొప్ప చేయూత లభించినట్లయింది.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారం బెంగళూరులో జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశానికి హాజరవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలో సర్వీసుల నియంత్రణకు సంబంధించిన ఆర్డినెన్స్ విషయంలో తమ వైఖరి స్పష్టంగా ఉందన్నారు. దానిని కాంగ్రెస్ సమర్థించబోదన్నారు.
కాంగ్రెస్ నిర్ణయాన్ని ఆప్ నేత, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ ఛద్దా స్వాగతించారు. ఢిల్లీ ఆర్డినెన్స్‌ను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించిందన్నారు. అంతకుముందు కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ, బెంగళూరులో సోమవారం జరిగే ప్రతిపక్షాల సమావేశానికి తమ పార్టీ హాజరయ్యేదీ, లేనిదీ ఇప్పుడే చెప్పలేనని, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం తర్వాత మాత్రమే దీని గురించి చెప్పగలనని చెప్పారు.
ఇదిలావుండగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధంగా లభించిన హక్కులు, బాధ్యతలపై మోదీ ప్రభుత్వం దాడి చేస్తోందని, దీనికి వ్యతిరేకంగా తాము నిరంతరం పోరాడుతున్నామని కాంగ్రెస్ శనివారం ప్రకటించింది. ఇటువంటి ప్రయత్నాలను పార్లమెంటు లోపల, వెలుపల తాము వ్యతిరేకిస్తామని తెలిపింది.
ప్రతిపక్షాల సమావేశాలకు తాము హాజరుకావాలంటే ఢిల్లీ ఆర్డినెన్స్‌పై ముందుగా కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయవలసి ఉంటుందని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఏమిటి ఈ ఆర్డినెన్స్?
ఢిల్లీలో గ్రూప్-ఏ అధికారుల నియామకాలు, బదిలీల కోసం ఓ అథారిటీని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మే 19న ఆర్డినెన్స్ జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంత ప్రభుత్వ సవరణ ఆర్డినెన్స్, 2023 పేరుతో జారీ అయిన ఈ ఆర్డినెన్స్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకిస్తోంది. తమకు మద్దతివ్వాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దేశంలోని అనేక రాజకీయ పార్టీలను, ముఖ్యమంత్రులను కోరారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, తనకు తెలిసినంత వరకు బెంగళూరులో సోమవారం జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశంలో పాల్గొనే 24 పార్టీల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉందన్నారు. బెంగళూరులో ఈ సమావేశాలు సోమ, మంగళవారాల్లో జరుగుతాయి. బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో గత నెలలో పాట్నాలో జరిగిన మొదటి సమావేశంలో 15 పార్టీలు పాల్గొన్న సంగతి తెలిసిందే. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే తమ లక్ష్యమని ఈ పార్టీలు చెప్తున్నాయి.
ఇవి కూడా చదవండి :
S Jaishankar : ఉత్తమ దౌత్యవేత్త హనుమంతుడు : ఎస్ జైశంకర్
Yamuna Floods : ఢిల్లీలో మళ్లీ కురుస్తున్న వర్షాలు.. యమునా నదిలో ప్రమాద స్థాయి దాటిన నీటి మట్టం..
Updated Date - 2023-07-16T15:38:45+05:30 IST