S Jaishankar : ఉత్తమ దౌత్యవేత్త హనుమంతుడు : ఎస్ జైశంకర్

ABN , First Publish Date - 2023-07-16T10:01:09+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి చాలా అంశాల నాడి తెలుసునని, వాటిని ఆయన విధానాలు, పథకాలుగా మార్చుతారని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ చెప్పారు.

S Jaishankar : ఉత్తమ దౌత్యవేత్త హనుమంతుడు : ఎస్ జైశంకర్

బ్యాంకాక్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి చాలా అంశాల నాడి తెలుసునని, వాటిని ఆయన విధానాలు, పథకాలుగా మార్చుతారని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar) చెప్పారు. దౌత్యవేత్తగా తాను చాలా మంది రాజకీయ నాయకులతో కలిసి పని చేశానని, ఇప్పుడు 24x7 రాజకీయ లోకంలోకి వచ్చానని, అవిశ్రాంతంగా, వారాంతపు సెలవులు కూడా లేకుండా పని చేస్తున్నాని, ఇది చాలా ప్రత్యేకమైనదని చెప్పారు. థాయ్‌లాండ్ రాజధాని నగరం బ్యాంకాక్‌లో భారతీయ మూలాలుగలవారితో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సమయంలో నరేంద్ర మోదీ వంటి ప్రధాన మంత్రి ఉండటం దేశానికి గొప్ప అదృష్టమని తాను భావిస్తున్నానని తెలిపారు. తాను ఈ విధంగా చెప్పడానికి కారణం ఆయన ఇప్పుడు ప్రధాన మంత్రిగా ఉండటం, తాను ఆయన మంత్రివర్గంలో సభ్యునిగా ఉండటం కాదన్నారు. శతాబ్దంలో ఒకసారి వచ్చే ఆరోగ్యపరమైన సవాలు (కోవిడ్-19 మహమ్మారి) వచ్చినపుడు, సరే, ఆరోగ్యపరమైన సవాలు ఉంది అని క్షేత్ర స్థాయిలో అన్ని విషయాలు బాగా తెలిసినవారు, మంచి నిర్ణయాలను తీసుకోగలిగేవారు మాత్రమే చెప్పగలరన్నారు. అయితే ఇంటికి వెళ్లిపోయేవారి కోసం ఏం చేయాలి? వారికి ఆహారం పెట్టడానికి ఏం చేయాలి? వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బును ఏ విధంగా వేయాలి? మహిళలు డబ్బును మెరుగైన రీతిలో నిర్వహించగలరనే ఆలోచన చాలా మందికి రాదన్నారు. (మంచి నిర్ణయాలు తీసుకోగలిగే మోదీ ఈ సవాలును స్వీకరించి, విజయం సాధించారని పరోక్షంగా చెప్పారు). జరుగుతున్నదాని గురించి మంచి అవగాహనతో మంచి నిర్ణయాలు తీసుకోగలిగేవారు, ఎంతో అనుభవం కలవారు గొప్ప నేతలు అవుతారని చెప్పారు. అటువంటివారికి దేశాన్ని ప్రత్యేక స్థాయికి తీసుకళ్లాలనే తపన, దార్శనికత ఉంటాయన్నారు.

ఉత్తమ దౌత్యవేత్త హనుమంతుడు

అన్ని కాలాలకూ అత్యుత్తమ దౌత్యవేత్త హనుమంతుడు అని ఎస్ జైశంకర్ అభిప్రాయపడ్డారు. దౌత్యవేత్తగా పదవీ విరమణ చేసిన తర్వాత, రాజకీయాల్లోకి రావడానికి ముందు ఒక ఏడాదిపాటు తాను ఖాళీగా ఉన్నానని చెప్పారు. ఈ సంవత్సర కాలంలో తాను ఓ పుస్తకాన్ని రాశానని చెప్పారు. అంతర్జాతీయ రాజకీయాలతో వ్యవహరించడానికి మహాభారతం ఏ విధంగా మార్గదర్శకంగా నిలుస్తుందో తాను ఈ పుస్తకంలో వివరించానని తెలిపారు. రాజ్య వ్యవహారాలను నైపుణ్యంతో నిర్వహించడం గురించి మహాభారతం వివరిస్తుందన్నారు. రామాయణాన్ని పరిశీలించినపుడు, ‘‘ఉత్తమ దౌత్యవేత్త ఎవరు? అని మీరు అడిగితే, కచ్చితంగా హనుమంతుడు అని నేను సమాధానం చెబుతాను’’ అని చెప్పారు. శ్రీరాముని తరపున హనుమంతుడు దౌత్యవేత్తగా వ్యవహరించాడని, శ్రీరాముడిని మనం ఓ దేశంగా భావిద్దామని అన్నారు. ఓ వ్యక్తి గురించి అంతగా సమాచారం తెలియకుండానే హనుమంతుడు లంకా నగరానికి వెళ్లవలసి వచ్చిందన్నారు. అక్కడి సమాచారాన్ని నిఘా పెట్టి రాబట్టి, సీతా దేవి జాడను గుర్తించాడన్నారు. ఆమెతో రహస్యంగా సంబంధాలు ఏర్పరచుకున్నాడని తెలిపారు. అంతేకాకుండా ఆమెతో మాట్లాడి, ఆమె ఆత్మస్థయిర్యాన్ని బలోపేతం చేశారని చెప్పారు. అక్కడితో ఆగకుండా లంకా దహనం చేశారని, అయితే ఇలా తగులబెట్టాలని తాను దౌత్యవేత్తలకు సలహా ఇవ్వడం లేదని అన్నారు. మొత్తం మీద చూసినపుడు హనుమంతుడు విజయవంతంగా తిరిగి వచ్చాడన్నారు.

ఇవి కూడా చదవండి :

Uniform Civil Code : ఉమ్మడి పౌర స్మృతిపై కాంగ్రెస్ రహస్య సమావేశం

Ration cards: రేషన్‌కార్డులను విభజించొద్దు

Updated Date - 2023-07-16T10:46:11+05:30 IST