Odisha Accident : కూతురి పెళ్లి చేసి సాగనంపి వస్తుండగా ఘోర ప్రమాదం.. చీకటిని సైతం భయపెట్టిన ఆర్తనాదాలు!
ABN, First Publish Date - 2023-06-26T11:31:37+05:30
ఒడిశాలోని గంజాం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి చెందారు.
బెర్హంపూర్: ఆ తల్లిదండ్రులు సంబరంగా బిడ్డకు పెండ్లి చేశారు. బంధువులు, స్నేహితులతో, పోరుగువారితో కలిసి నవ వధువును సాగనంపేందుకు వరుడికి ఇంటికి వెళ్లారు. బిడ్డను అత్తింటివారికి అప్పజెప్పి సంతోషంగా తిరుగు ప్రయాణం అయ్యారు. అంతా సవ్యంగా జరిగింది.. ఇక హాయిగా ఇంటికి వెళదాం అనుకున్న ఆ తల్లిదండ్రులకు ఊహించని ఘటన ఎదురైంది. ఎదురుగా వస్తున్న బస్సే వారి పాలిట మృత్యువుగా మారింది. కండ్లు మూసే తెరిచేలోపే అంతా జరిగిపోయింది.. అంతసేపు ముచ్చట్లతో గడిపిన వారంతా శవాలుగా.. క్షతగాత్రులుగా చెల్లాచెదరై రోడ్డుపై పడ్డారు.. వారి ఆర్తనాదాలు చీకటిని సైతం భయపెట్టాయి.. ఒడిశాలో జరిగిన రెండు బస్సులు ఢీకొన్న హృదయ విదారక ఘటనకు సంబంధించి ప్రమాద స్థలంలో పరిస్థితి ఇది.. వివరాల్లోకి వెళితే..
ఒడిశాలోని(Odisha) గంజాం జిల్లాలో(Ganjam District) ఘోర ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సును మరో బస్సు ఢీకొట్టింది.
ఆదివారం అర్థరాత్రి దాటాక.. దిగపహండి ప్రాంతానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో బెర్హంపూర్-తప్తహణి రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఖండదేవులి గ్రామం నుంచి 27 మంది పెళ్లి బృందంతో వెళ్తున్న మీని బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించగా..వారిలో ఇద్దరు చిన్నారులున్నారు. మృతుల్లో మిగతా ఐదుగురు వారి బంధువులు. అర్థరాత్రి ప్రమాదం జరగడంతో సహాయక చర్యలు అందక..క్షతగాత్రులు నరకం అనుభవించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని ఎమ్‌కేసీజీ మెడికల్ కాలేజీ, దిగపహండి ఆస్పత్రులకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. వారితో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంలో కటక్ తరలించారు. ప్రమాద ఘటనపై దిగ్భాంతి వ్యక్తం చేసిన ఒడిశా సీఎం క్షతగాత్రులకు తక్షణ సాయం ప్రకటించారు. చికిత్స కోసం రూ.30 వేల చొప్పున మంజూరు చేశారు.
Updated Date - 2023-06-26T11:52:05+05:30 IST