CM Jagan: జగనన్న సురక్ష కార్యక్రమం వల్ల చాలా పాజిటివ్ వచ్చింది: సీఎం జగన్
ABN, First Publish Date - 2023-09-26T20:12:14+05:30
జగనన్న సురక్ష కార్యక్రమం వల్ల చాలా పాజిటివ్ వచ్చిందని సీఎం జగన్ అన్నారు. దాదాపు 98 లక్షల సర్టిఫికెట్లు ఇచ్చామని, అర్హులకు అవసరమైన సర్టిఫికెట్లను జారీ చేశామన్నారు. ఇప్పుడు ఆరోగ్య సురక్ష చేపడుతున్నామని, ఆరోగ్యపరంగా ప్రతి ఇంటిని జల్లెడ పడతామన్నారు.
తాడేపల్లి : జగనన్న సురక్ష కార్యక్రమం వల్ల చాలా పాజిటివ్ వచ్చిందని సీఎం జగన్ అన్నారు. దాదాపు 98 లక్షల సర్టిఫికెట్లు ఇచ్చామని, అర్హులకు అవసరమైన సర్టిఫికెట్లను జారీ చేశామన్నారు. ఇప్పుడు ఆరోగ్య సురక్ష చేపడుతున్నామని, ఆరోగ్యపరంగా ప్రతి ఇంటిని జల్లెడ పడతామన్నారు. ఉచితంగా మందులు, పరీక్షలు చేస్తామని ఆయన చెప్పారు. గుర్తించిన వారికి మెరుగైన చికిత్సలు అందిస్తామని తెలిపారు. విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో చేయూతనిస్తామన్నారు. ఇందులో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులను మమేకం చేస్తామని జగన్ చెప్పారు. మొత్తం 5 దశల్లో జగనన్న సురక్ష కార్యక్రమం చేపడతామన్నారు. తొలి దశలో వాలంటీర్లు, గృహ సారథులు ప్రతి ఇంటికెళ్లి ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి వివరిస్తారని సీఎం జగన్ వివరించారు.
ఇక రెండో దశలో ఏఎన్ఎంలు, సీహెచ్ఓలు, ఆశావర్కర్లు ప్రతి ఇంటికి పరీక్షలు చేయడానికి వెళ్తారని వివరించారు. ఆరోగ్యశ్రీ పై అవగాహన కల్పిస్తారని జగన్ వివరించారు. మూడో దశలో వాలంటీర్లు, గృహసారథులు, ప్రజాప్రతినిధులు క్యాంపు వివరాలు తెలియజేస్తారని చెప్పారు. నాలుగో దశలో క్యాంపులను ఏర్పాటు చేస్తారని వివరించారు. ఐదో దశలో అనారోగ్యంతో ఉన్నవారిని గుర్తించి వారికి నయం అయ్యే వరకూ చేయూతనిస్తారని తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్షలో ఆయన ఈ విధంగా స్పందించారు.
Updated Date - 2023-09-26T20:12:14+05:30 IST