V-Hub: వీ-హబ్ నగి‘షీ’లు
ABN, Publish Date - Mar 08 , 2025 | 04:22 AM
వ్యాపారం అన్నాక సవాళ్లు ఎదురవుతాయి. మహిళలకైతే మరింతగా కానీ ఆ మహిళలు వెనుకడుగు వేయలేదు. అవమానాలనే ఆభరణాలుగా.. సందేహాలను సందేశాలుగా తీసుకున్నారు.
మహిళలకు వెన్నుదన్నుగా విమిన్ ఆంట్రప్రెనర్ హబ్
ఎంచుకున్న వ్యాపారాల్లో రాణిస్తున్న మహిళామణులు
ఆలయాల్లోని పూలతో అగర్‌బత్తీల తయారీలో లాభాలు
ఆన్‌లైన్‌లో చేనేత వస్త్రాలు పెట్టడంతో పెరిగిన విక్రయాలు
అధునాతన యంత్రాలతో స్వచ్ఛమైన వంట నూనెల తయారీ
కుట్టులో నైపుణ్యం ఉన్న మహిళలతో ఆరు గార్మెంట్స్ ప్రారంభం
హైదరాబాద్, మార్చి 7(ఆంధ్రజ్యోతి): వ్యాపారం అన్నాక సవాళ్లు ఎదురవుతాయి. మహిళలకైతే మరింతగా! కానీ ఆ మహిళలు వెనుకడుగు వేయలేదు. అవమానాలనే ఆభరణాలుగా.. సందేహాలను సందేశాలుగా తీసుకున్నారు. ముళ్ల మార్గమే అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకే వెళుతూ ఒక్కరుగానే సాగి.. అనుకున్నది సాధించేసి.. అందరిచేతా ఔరా అనిపించుకుంటున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలన్న లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘విమిన్ ఆంట్రప్రెనర్ హబ్’ (వీ-హబ్) నెలకొల్పింది. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం రాష్ట్రంలోని ఎంతోమంది ఔత్సాహిక మహిళలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ‘ఐడియా’ ఉందంటూ ఆత్మవిశ్వాసంతో వస్తేచాలు వారిని విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అన్ని విధాలుగా సహకరిస్తోంది. ఇటీవల.. వ్యాపారంలో గొప్పగా రాణిస్తున్న ఆరుగురు మహిళలను సక్సె్‌సఫుల్ ఆంట్రప్రెనర్స్‌గా వీ-హబ్ ఎంపికచేసింది. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వీరిలో నలుగురుని ‘ఆంధ్రజ్యోతి’ పలకరించింది. వ్యాపారంలో తాము ఎదురైన సవాళ్లు, సమస్యలు.. వాటిని తాము అధిగమించిన తీరును ఆ మహిళామణులు చెప్పుకొచ్చారు.
వాట్సాప్, ఇన్‌స్టాతో ఇంటివద్దే ఆదాయం
చేనేత వస్త్రాలు ధరించి చేనేత కార్మికులను ఆదుకోవాలని అందరూ అంటుంటారు కానీ ఉత్పత్తులు కొనేందుకు మాత్రం వెనకడుగు వేస్తారు. కారణం ధరలు ఎక్కువగా ఉండటమే! ‘వీవర్స్ టు కస్టమర్’ ఈ సమస్యలకు పరిష్కారం అని భావించాను. దానికోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు, ఇన్‌స్టాగ్రామ్ పేజీలు ప్రారంభించి విజయం సాధించాను. బీఎస్సీ చదివాక పోచంపల్లిలోని ఓ చేనేత కుటుంబంలోకి కోడలిగా వెళ్లాను. అత్తామామలు, భర్తకు అద్భుతమైన కళా నైపుణ్యం ఉన్నా వ్యాపారం మాత్రం అంతంత మాత్రంగానే ఉండేది. మా కుటుంబానికే కాదు.. పోచంపల్లిలో చేనేతపై ఆధారపడ్డ 4వేల కుటుంబాలదీ ఇదే దుస్థితి. మావద్ద పట్టుచీరను వ్యాపారులు రూ. 8వేలకు కొని హైదరాబాద్‌లో రూ.20వేలకు అమ్ముకుంటున్నారు. దళారులు లేకుండా నేరుగా కస్టమర్లకు అందిస్తే వారికీ లాభమవుతుందని భావించి.. మూడేళ్ల క్రితం వాట్సాప్ గ్రూప్ ప్రారంభించి ఉత్పత్తులు అందుబాటులో ఉంచాం. అనేకమంది నేరుగా మా వద్దకు వస్తున్నారు. కొందరు ఆన్‌లైన్లో ఆర్డర్ ఇస్తున్నారు. ఫలితంగా ఉత్పత్తులను వెంటనే అమ్ముకునే వీలు కలిగింది. దీంతో ఎంతో మంది కార్మికులు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభించి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఉత్పత్తులు విక్రయించాలన్నదే మా లక్ష్యం.
- గుండేటి నవనీత, వీవర్స్ హబ్ హ్యాండ్లూమ్స్, పోచంపల్లి
రుణం కోసం వెళితే తండ్రితోనో.. భర్తతోనో రావాలన్నారు
ఓవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ మరోవైపు వ్యాపారం చూసుకోవడం మహిళలకు పెద్దసవాల్. మహిళలు చిన్నపాటి రుణం కోసం బ్యాంకుకు వెళితే తండ్రినో, భర్తనో వెంటబెట్టుకొని రావాలని చెబుతారు. వ్యాపారం మొదలు పెట్టాలనే ఆలోచన వచ్చాక రుణం కోసం నేను ఏ బ్యాంకుకు వెళ్లినా ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. నాకు బ్యాంకులు రుణం ఇవ్వలేదు. కుటుంబసభ్యుల సహకారంతోనే వ్యాపారం మొదలుపెట్టి.. క్రమక్రమంగా ఉత్పత్తి పెంచుకున్నా. నేను జేఎన్‌టీయూ నుంచి కెమిస్ట్రీలో పీహెచ్‌డీ పూర్తి చేశాను. నాలుగేళ్ల క్రితం బాసరకు వెళ్లాను. అక్కడ గోదావరిలో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త చూశాక.. వ్యర్థాల నుంచి సంపద సృష్టించాలన్న ఆలోచనొచ్చింది. తొలుత పూల వ్యర్థాల నుంచి అగరొత్తులు, అత్తర్లు తయారు చేయాలనుకున్నాను. హైదరాబాద్ యూసు్‌ఫగూడలోని నిమ్స్‌మీ, రాజేంద్రనగర్‌లోని ఖాదీ విలేజ్‌లో శిక్షణ పొందాను. కూకట్‌పల్లి పరిసరాల్లోని ఆలయాల నుంచి నిత్యం పువ్వులను సేకరించి వాటితో అగరొత్తులు తయారు చేస్తున్నాను. ఆలయాల నుంచి సేకరించిన పూలు కావడంతో చాలా మంది ఆదరిస్తున్నారు. వ్యాపారాన్ని మరింత విస్తరించాలని లక్ష్యంతో ఇటీవల వీ-హబ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్నాను. ఉత్పత్తులను హైదరాబాద్ అంతా మార్కెట్ చేసేందుకు ఉత్పత్తిని పెంచుతున్నాం. పేపర్ వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ నుంచి ఉత్పత్తులు చేయాలన్న ఆలోచనలున్నాయి.
- డాక్టర్ శైలజ మద్దిపట్ల, సమృద్ధి వేస్ట్ 2వెల్త్, కూకట్‌పల్లి, హైదరాబాద్
ఒత్తిడి తట్టుకోలేక ఏడిస్తే.. వ్యాపారం వదిలేయమన్నారు
వ్యాపారం తొలినాళ్లలో నష్టాలు రావడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డా. ఒత్తిడితో మానసికంగా కుంగిపోయాను. ఇంట్లోవాళ్లు వ్యాపారాన్ని వదిలెయ్ అన్నారు. నేను వెనక్కి తగ్గలేదు. కంప్యూటర్ సైన్స్‌లో ఎమ్మెస్సీ పూర్తిచేశాను. ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నాను. నా భర్తకు పూజా స్టోర్ ఉంది. అక్కడే స్వచ్ఛమైన వంట నూనెలు తయారు చేసి విక్రయించాలని ఆలోచన వచ్చింది. రెండేళ్ల క్రితం రూ.28వేలతో చిన్నపాటి ఆయిల్ మిషన్ కొనుక్కొని కరీంనగర్‌లో వ్యాపారం ప్రారంభించాను. నష్టాలొచ్చాయి. వ్యాపారం పెద్ద స్థాయిలో చేస్తేనే లాభాలొస్తాయని అనిపించింది. పెద్ద యంత్రాల కొనుగోలుకు బ్యాంకు నుంచి రూ.10లక్షల అప్పు తీసుకున్నాను. కోయంబత్తూర్ నుంచి అధునాతన యంంత్రాలు కొనుగోలు చేశాను. పల్లి, కొబ్బరి, ఆవాలు, నువ్వుల నూనెలు తయారు చేస్తున్నాను. ఆర్గానిక్ హెయిర్ ఆయిల్ ఉత్పత్తీ ప్రారంభమైంది. ప్రస్తుతం ఆర్డర్లు పెద్దఎత్తున వస్తున్నాయి. త్వరలో రాష్ట్ర స్థాయిలో వ్యాపారాన్ని విస్తరించాలన్నదే లక్ష్యం. ఈ ప్రయాణంలో వీ -హబ్ సహకారం ఎంతో ఉంది.
- చిత్ర, శ్రీరామ ఆర్గానిక్ ఆయిల్స్, కరీంనగర్
కుటుంబ పొదుపంతా పెట్టుబడికే
నా డబ్బు కొంత.. అమ్మ, నాన్న చేసిన పొదుపు చేసింది కొంత పోగేసి రూ.25 లక్షల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాను. ‘మీరు తయారు చేసేవి.. ఎంతోమంది తయారు చేస్తున్నారు.. ఎంతోమంది విక్రయిస్తున్నారు.. మీ వద్దే ఎందుకు కొనాలి?’ అని మొదట్లో ప్రశ్నించినవారంతా ఇప్పుడు మా ఉత్పత్తులను ఇష్టపడి కొంటున్నారు. నా ప్రయాణం వెనక మూడేళ్ల శ్రమ ఉంది. ఏడేళ్ల పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాను. మహిళలకు స్వయం ఉపాధిలో శిక్షణ అందించాలన్న లక్ష్యంతో జాబ్ వదిలేసి స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేశా. కుట్టు, కంప్యూటర్ రంగంలో 1500 మంది మహిళలకు శిక్షణ ఇచ్చాను. నైపుణ్యం ఉన్న ఆ మహిళలతో కలిసి ఒక పరిశ్రమ ఏర్పాటుచేయాలనుకొని మూడేళ్ల క్రితం భువనగిరిలో ఆరు గార్మెంట్స్ ప్రారంభించాను. కాటన్ వస్ట్రాలకు రాష్ట్రంలో భారీ డిమాండ్ ఉంది. జైపూర్ నుంచి ముడిసరుకు తెప్పించి ఇక్కడ చీరలు, బ్లౌజులు, నైటీలు, ఫ్రాక్స్, కుర్తీలు, దుపట్టాలు తయారు చేస్తున్నాం. మా ఉత్పత్తుల కనీస ధర రూ.300 ఉండటంతో విశేష ఆదరణ లభిస్తోంది. త్వరలో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో రిటైల్ ఔట్‌లెట్లను ఏర్పాటు చేసే పనిలో ఉన్నాం.
- ప్రవీణ, ఆరు గార్మెంట్స్, భువనగిరి
‘ఆమె’ నిర్వహణలో ఓ విద్యుత్తు ప్లాంట్
పూర్తిగా మహిళల నిర్వహణలో వెల్టూర్ సౌర విద్యుత్తు ప్లాంట్
హైదరాబాద్, మార్చి7(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఒక సౌర విద్యుత్తు ప్లాంట్ పూర్తి నిర్వహణను మహిళలే చూసుకుంటున్నారు. వనపర్తి జిల్లా పెద్ద మందడి మండలం వెల్టూర్ సౌర విద్యుత్తు ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన అప్రావ సంస్థ దాని నిర్వహణను పూర్తిగా మహిళలకు అప్పగించింది. మహిళా ఇంజినీర్ల బృందం పర్యవేక్షణలో ఈ ప్లాంట్ నడుస్తోంది. ఆ బృందంలో ఎలక్ట్రికల్, ఎలకా్ట్రనిక్స్ ఇంజినీరింగ్‌లో ఉన్నత విద్య అభ్యసించిన దూదిమెట్ల తేజస్విని, అనూష రుద్రముని, ఇందుశ్రీ రుద్రముని, కొరెత సుగుణ ఉన్నారు. అప్రావ నుంచిపి.ఝస్విని కుమారి, మేడ మణి దీప్తి ప్లాంట్ కార్యకలాపాల పర్యవేక్షణలో ఆ బృం దానికి చేయూత అందిస్తున్నారు. ఈ రంగంలో పని చేయడానికి మహిళా ఇంజినీర్లు వెనకంజ వేసే పరిస్థితి ఉండగా సౌరవిద్యుత్తు ప్లాంట్ నిర్వహణ చేపట్టిన ఈ మహిళా బృందం మహిళా దినోత్సవాన ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిందని అప్రావ ఎనర్జీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హెచ్‌ఆర్ దీపా సెబాస్టియన్ అన్నారు. తమ సంస్థ మహిళా సాధికారతకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ ప్లాంట్ ఇంజనీర్ల బృందంలో ఒకరైన ఇందుశ్రీ రుద్రముని మాట్లాడుతూ సోలార్ ప్లాంట్‌లో పనిచేయడం తనకు మొదటిసారి అని, ఈ అనుభవం తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని తెలిపారు.
Updated Date - Mar 08 , 2025 | 05:31 AM