MLC Elections: ఉపాధ్యాయుల ఓటుకు రేటు!
ABN, Publish Date - Feb 27 , 2025 | 05:15 AM
మరికొద్ది గంటల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుండగా కొందరు అభ్యర్థులు బుధవారం రాత్రి ఓటర్లకు గప్‌చు్‌పగా డబ్బు పంపీణీ చేశారు. నల్లగొండలో ఓ అభ్యర్థి తరఫున అనుయాయులు ఒక్కో ఓటరు ఇంటికి వెళ్లి రూ.2 వేలు అందజేయగా, మరో ఇద్దరు అభ్యర్థులు రూ.1,000 నుంచి రూ.1,200, రూ.2500 ఇచ్చారని సమాచారం.
వెయ్యి నుంచి 3 వేల చొప్పున పంపిణీ!
వరంగల్ ఎడ్యుకేషన్/ఖమ్మం/నల్లగొండ, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మరికొద్ది గంటల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుండగా కొందరు అభ్యర్థులు బుధవారం రాత్రి ఓటర్లకు గప్‌చు్‌పగా డబ్బు పంపీణీ చేశారు. నల్లగొండలో ఓ అభ్యర్థి తరఫున అనుయాయులు ఒక్కో ఓటరు ఇంటికి వెళ్లి రూ.2 వేలు అందజేయగా, మరో ఇద్దరు అభ్యర్థులు రూ.1,000 నుంచి రూ.1,200, రూ.2500 ఇచ్చారని సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సామాజిక సంఘాల మద్దతు ఉన్న ఓ అభ్యర్థి ఓటుకు రూ.2 వేలు, ఉపాధ్యాయ సంఘాల్లో కీలంకంగా చెప్పుకుంటున్న మరో అభ్యర్థి రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు పంపిణీ చేశారని తెలిసింది. మరో పార్టీ మద్దతుతో బరిలో ఉన్న అభ్యర్థి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి అధికార పార్టీ మద్దతు ఉందని చెప్పుకుంటున్న అభ్యర్థి కూడా ఓటుకు రూ.1,000 నుంచి రూ.1,500 పంపిణీ చేశారని సమాచారం. కొందరు సంఘాల నాయకులు, మరికొందరు పార్టీల నాయకుల ద్వారా డబ్బు పంపిణీ చేస్తే, మరికొందరు ఫోన్‌పే వంటి మాధ్యమాల ద్వారా నగదు బదిలీ చేసినట్లు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఉపాధ్యాయులకు దావత్‌లతో పాటు డబ్బులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. నలుగురు ప్రధాన అభ్యర్థులు ఇప్పటికే ఉపాధ్యాయులు, అధ్యాపకులకు సెలవు దినమైన ఆదివారం పార్టీలు ఇచ్చారు. ఇందుకు వరంగల్, హనుమకొండ తదితర ప్రాంతాల్లోని ఫంక్షన్ హాళ్లు వేదికయ్యాయి. సంఘాలు, సామాజిక వర్గాల వారీగా ఈ పార్టీలు ఏర్పాటు చేశారు.
ఖాతాలోకి కాదు.. చేతికే డబ్బులు!
‘ఓటుకు నోటు తీసుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త!’, ‘ఓటును నమ్ముకోవాలి.. అమ్ముకోవద్దు’ అంటూ ఉపాధ్యాయుల వాట్సాప్ గ్రూపుల్లో మంగళవారం సాయంత్రం నుంచి మెసేజ్‌లు చక్కర్లు కొడుతున్నాయి. అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకుని పంపిణీ చేసినా, ఓటుకు డబ్బులు తీసుకున్నా చర్యలు తప్పవని ఆ మెసేజ్‌లు హెచ్చరిస్తున్నాయి. ఉపాధ్యాయుల ఖాతాల్లో జమవుతున్న డబ్బులపై నిఘా ఉందని పేర్కొంటున్నాయి. ఫిర్యాదులు రావడంతో కేసులు నమోదవుతున్న ఘటనలు ఉన్నాయని పలువురు చెబుతున్నారు. దీంతో కొందరు ఆన్‌లైన్‌లో నగదు బదిలీలు చేయకుండా నేరుగా చేతికి డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది.
Updated Date - Feb 27 , 2025 | 05:15 AM