NH-65: హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ.. డీపీఆర్ కన్సల్టెంట్ ఖరారు
ABN, Publish Date - Mar 04 , 2025 | 04:09 AM
ఆ మార్గంలో ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్లను ఆరు లేన్లుగా విస్తరించేందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి కన్సల్టెంట్ సంస్థ ఖరారైంది.
పనులు దక్కించుకున్న భోపాల్ కంపెనీ
అధ్యయనానికి రూ.9.86 కోట్ల ఖర్చు
త్వరలో సంస్థతో కేంద్రం ఒప్పందం
ఆరు నెలల్లో కేంద్రానికి నివేదిక
దండు మల్కాపూర్ నుంచి ఏపీలోని
గొల్లపూడి వరకు 6 లేన్లుగా విస్తరణ
హైదరాబాద్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-65) ఆరు లేన్ల విస్తరణ ప్రక్రియలో కీలక అడుగు పడింది. ఆ మార్గంలో ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్లను ఆరు లేన్లుగా విస్తరించేందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి కన్సల్టెంట్ సంస్థ ఖరారైంది. ఎన్‌హెచ్-65ను ఆరు లేన్లుగా విస్తరించే అంశంపై అధ్యయనం చేసి సమగ్ర నివే దిక ఇచ్చేందుకు కేంద్ర రవాణా, రహదారుల శాఖ గత ఏడాది టెండర్లను ఆహ్వానించింది. టెండర్ల ప్రక్రియలో సాంకేతిక బిడ్‌లను 2025 జనవరి 20న తెరవగా, అందులో అర్హత సాధించిన ఫైనల్ టెండర్లను జనవరి 30న తెరిచారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఓ కంపెనీ ఈ పనిని దక్కించుకుంది. ఈ సంస్థతో ఈ నెలాఖరు వరకు కేంద్రం ఒప్పందం కుదుర్చుకోనుంది. రహదారి అధ్యయనం, రోడ్డు భద్రత అంశాలు కలిపి డీపీఆర్ తయారీకి రూ.9.86 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ఒప్పందం జరిగిన తరువాత ఆరు నెలల్లో సమగ్ర నివేదికను సదరు సంస్థ కేంద్రానికి అందించాల్సి ఉంటుంది. ఒప్పందంలో ఇదే విషయాన్ని పొందుపరచనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఎన్‌హెచ్-65 రోడ్డును హైదరాబాద్ అవతల.. అంటే దండు మల్కాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని గొల్లపూడి వరకు దాదాపు 265 కిలోమీటర్ల మేర ఆరు లేన్లుగా విస్తరించనున్నారు. ఈ రోడ్డును మంజూరు చేసి, నిర్మించే సమయంలోనే ఆరు లేన్లకు సరిపడా భూమిని సేకరించడంతో మళ్లీ ఇప్పుడు కొత్తగా భూ సేకరణ చేయాల్సిన అవసరంలేదు. అయితే సాంకేతికంగా కొన్ని అంశాల పరిశీలన, అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మార్గంలో వాహనాల రద్దీ ఎలా ఉంది, ఏ సమయంలో ఎన్ని వాహనాలు తిరుగుతున్నాయి, రెండు వైపులా ట్రాఫిక్ ఏ సమయాల్లో అధికంగా ఉంటోందనే దానిపై ప్రధానంగా వివరాలు సేకరిస్తారు. అదే సమయంలో భద్రతపరంగా ఆ రోడ్డు ఎలా ఉందన్నదీ పరిశీలిస్తారు.
కొత్తగా మరో రెండు రోడ్లు..
గతంలో విజయవాడకు ఎన్‌హెచ్-65 మార్గమే ప్రధానంగా ఉండేది. ఇప్పుడు సూర్యాపేటకు 10 కిలోమీటర్ల ముందు.. ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారి అందుబాటులోకి వచ్చింది. మరోవైపు ఖమ్మం నుంచి దేవరపల్లి, రాజమండ్రికి మరో హైవే నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. దాంతో రాజమండ్రి, భీమవరం, గోదావరి జిల్లాలకు వెళ్లేవారంతా ఈ రహదారులనే అధికంగా వినియోగించే అవకాశాలున్నాయి. కాగా, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నట్లుగా చౌటుప్పల్ నుంచి అమరావతి వరకు మరో గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ రోడ్డును మంజూరు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే కేంద్రాన్ని కోరారు. దానిపై కేంద్రం సమాలోచనలు చేస్తోంది. దీనికితోడు బందరు పోర్టుకు వెళ్లేవిధంగా ఒక హైస్పీడ్ కారిడార్‌ను మంజూరు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కూడా కేంద్రాన్ని కోరుతున్నారు. ఈ రెండు రోడ్లు మంజూరైతే హైదరాబాద్-విజయవాడ రహదారి ట్రాఫిక్‌పై ఎంత ప్రభావం ఉంటుందనే వివరాలనూ డీపీఆర్‌లో పొందుపరిచి కేంద్రానికి సమర్పించనున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఈ రోడ్డుపై ఉన్న టోల్‌ప్లాజాల వద్ద కూడా ప్రత్యేక సర్వే చేపడతారు. ఏ సమయంలో ఎన్ని వాహనాలు తిరుగుతున్నాయి, రోజు మొత్తంలో తిరిగే వాహనాలెన్ని అనేది పరిశీలిస్తారు. ప్రస్తుతం ఈ రహదారిపై ప్రతిరోజూ 50 వేలకు పైగా వాహనాలు తిరుగుతున్నట్టు ప్రాథమిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే డీపీఆర్ అనేది సాంకేతిక అంశాలపై స్పష్టత ఇవ్వడానికి మాత్రమేనని, విస్తరణ చేయడం ఖాయమైందని ప్రభుత్వం పేర్కొంటోంది. డీపీఆర్ అందిన తరువాత విస్తరణ పనులు ముందుకు కదలనున్నాయి.
Also Read: హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. జస్ట్ 5 నిమిషాలు ఇలా చేయండి..
Also Read: ఏపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు
Also Read: రంగంలోకి మీనాక్షి నటరాజన్
For Telangana News And Telugu News..
Updated Date - Mar 04 , 2025 | 04:09 AM