భార్య, అత్తమామలపై కత్తితో దాడి
ABN, Publish Date - Feb 21 , 2025 | 05:10 AM
పనిలేక ఖాళీగా తిరుగుతుండటమే కాకుండా నిత్యం వేధింపులకు పాల్పడుతున్న భర్తను వదిలేసిన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఇది జీర్ణించుకోలేక ఉన్మాదిగా మారిన ఆ భర్త, అత్తగారింటికి వెళ్లి కత్తితో భార్య మెడ భాగంలో నరికాడు. అడ్డుకోబోయిన అత్తామామలపైనా దాడికి పాల్పడ్డాడు.
తల్లిగారింట్లో ఉంటోందని భర్త ఘాతుకం
భార్య పరిస్థితి విషమం.. వరంగల్‌లో ఘటన
మట్టెవాడ, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): పనిలేక ఖాళీగా తిరుగుతుండటమే కాకుండా నిత్యం వేధింపులకు పాల్పడుతున్న భర్తను వదిలేసిన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఇది జీర్ణించుకోలేక ఉన్మాదిగా మారిన ఆ భర్త, అత్తగారింటికి వెళ్లి కత్తితో భార్య మెడ భాగంలో నరికాడు. అడ్డుకోబోయిన అత్తామామలపైనా దాడికి పాల్పడ్డాడు. వరంగల్‌లోని పోచవ్మ మైదాన్ ఎస్సీ కాలనీలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎస్సీ కాలనీకి చెందిన జన్ను వీరస్వామి అలియాస్ బాబు-అనిత దంపతుల కుమార్తె జన్ను పల్లవి కేఎంసీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తోంది. ఈమెకు రెండున్నరేళ్ల కిందట వరంగల్ ఉర్సు ప్రాంతానికి చెందిన కోట చంద్రశేఖర్‌తో ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఏడాదిన్నర వయస్సు ఉన్న కుమారుడు ఉన్నాడు.
చంద్రశేఖర్ పని చేయకుండా ఖాళీగా తిరుగుతుండటంతో కొంతకాలంగా చంద్రశేఖర్-పల్లవిల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భర్త ప్రవర్తనతో విసుగుచెందిన పల్లవి, తన కుమారుడితో కలిసి తల్లిగారింట్లోనే ఉంటూ ఉద్యోగం చేసుకుంటోంది. గురువారం అకస్మాత్తుగా చంద్రశేఖర్ వచ్చి ఇంట్లో ఉన్న పల్లవిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో పల్లవి తల, ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. అడ్డుకునేందుకు వెళ్లిన అత్తమామలు వీరస్వామి, అనితలపైనా చంద్రశేఖర్ దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి. స్థానికులు ముగ్గురిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పల్లవి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు.
Updated Date - Feb 21 , 2025 | 05:10 AM