Teacher MLC Elections: నల్లగొండలో పీఆర్‌టీయూ కరీంనగర్‌లో బీజేపీ
ABN, Publish Date - Mar 04 , 2025 | 04:03 AM
కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ గెలుచుకోగా, నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానాన్ని పీఆర్‌టీయూ దక్కించుకుంది. కరీంనగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మల్క కొమురయ్య మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ఘనవిజయం సాధించారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జయకేతనం
కరీంనగర్ స్థానంలో మొదటి ప్రాధాన్య ఓట్లతోనే
గెలుపొందిన బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య
2వ స్థానంలో పీఆర్‌టీయూ అభ్యర్థి మహేందర్‌రెడ్డి
నల్లగొండ స్థానంలో పింగిళి శ్రీపాల్‌రెడ్డి విజయం
రెండో ప్రాధాన్య ఓట్లతో గెలిచిన పీఆర్‌టీయూ నేత
చివరిదాకా పోటీనిచ్చిన యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి
19వ రౌండ్‌లో నర్సిరెడ్డి ఎలిమినేషన్‌తో ఫలితం
బీసీలు బలపరిచిన పూల రవీందర్‌కు 4వ స్థానం
ఇంకా కట్టలు కట్టే దశలోనే ‘పట్టభద్రుల’ కౌంటింగ్
నేటి మధ్యాహ్నం తర్వాత లెక్కింపు షురూ!
కరీంనగర్/నల్లగొండ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో పీఆర్‌టీయూ, బీజేపీ సత్తా చాటాయి. కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ గెలుచుకోగా, నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానాన్ని పీఆర్‌టీయూ దక్కించుకుంది. కరీంనగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మల్క కొమురయ్య మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, పీఆర్‌టీయూ బలపరిచిన అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డిపై కొమురయ్య 5,777 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మరోవైపు నల్లగొండ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన హోరాహోరీ పోరులో పీఆర్‌టీయూ అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి ద్వితీయ ప్రాధాన్య ఓట్లతో విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, సిటింగ్ ఎమ్మెల్సీ అయిన టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డిపై గెలుపొందారు. మొదటి ప్రాధాన్య ఓట్లలో ఎవరికీ కోటా ఓట్లు రాకపోవడంతో.. ద్వితీయ ప్రాధాన్య ఓట్లను లెక్కించారు.
అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు చివరికి.. రెండో స్థానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డిని ఎలిమినేట్ చేసేదాకా కొనసాగింది. చివరి, 19వ రౌండ్ పూర్తయ్యాక శ్రీపాల్‌రెడ్డికి 13,969 ఓట్లు వచ్చాయి. కోటా ఓటు 11,821 దాటడంతో శ్రీపాల్‌రెడ్డి గెలుపొందినట్లు ప్రకటించారు.
ఆద్యంతం ఇద్దరి మధ్యే పోటీ..
కౌంటింగ్ ప్రారంభమైనప్పటినుంచి ముగిసేంతవరకు శ్రీపాల్‌రెడ్డి, నర్సిరెడ్డి మధ్యనే పోటీ నడిచింది. ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఫిబ్రవరి 27న ఎన్నిక నిర్వహించగా మొత్తం 25,197 ఓట్లకుగాను 24,135 ఓట్లు పోలయ్యాయి. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్టేట్ వేర్‌హౌసింగ్ గోదాము వద్ద ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో 494 ఓట్లు చెల్లకుండా పోగా, 23,641 ఓట్లను లెక్కించారు. అభ్యర్థి గెలవడానికి 11,821 ఓట్లను కోటా ఓటుగా నిర్ధారించారు. సాయంత్రం 3.40కు మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తికాగా.. ఇందులో పీఆర్‌టీయూటీఎస్ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి 6,035 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి 4,820 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలవగా, పీసీసీ అధికార ప్రతినిధి, టీపీఆర్‌టీయూ అభ్యర్థి గాల్‌రెడ్డి హర్షవర్థన్‌రెడ్డి 4,437 ఓట్లు సాధించి మూడో స్థానం పొందారు. ఇక బీసీ, బహుజన జేఏసీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌కు 3,115 ఓట్లు, బీజేపీ అభ్యర్థి పులి సర్వోత్తంరెడ్డికి 2289 ఓట్లు, బీసీ నినాదంతోనే బరిలో నిలిచిన మరో అభ్యర్థి ఎస్.సుందర్‌రాజ్‌కు 2,040 ఓట్లు వచ్చాయి. దీంతో మొదటి ప్రాధాన్య ఓట్లలో ఎవరికీ కోటా ఓటు రాకపోవడంతో ఎలిమినేషన్ పద్ధతిలో ద్వితీయ ప్రాధాన్య ఓట్లను లెక్కింపు చేపట్టారు. అవరోహణ క్రమంలో ఒక్కో అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ.. వారి బ్యాలెట్లలో ద్వితీయ ప్రాధాన్య ఓట్లను పోటీలో ఉన్న మిగిలిన అభ్యర్థులకు కలుపుతూ లెక్కింపు చేపట్టారు. అన్ని రౌండ్లలోనూ పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి ఆధిక్యం కొనసాగుతూ వచ్చింది. 16వ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి పులి సర్వోత్తమ్‌రెడ్డి ఎలిమినేట్ కాగా, 17వ రౌండ్‌లో పూల రవీందర్, 18వ రౌండ్‌లో హర్షవర్థన్‌రెడ్డి ఎలిమినేట్ అయ్యారు. అప్పటికి శ్రీపాల్‌రెడ్డి 11,099 ఓట్లకు చేరగా, నర్సిరెడ్డి 8,448 ఓట్లకు చేరారు. శ్రీపాల్‌రెడ్డి గెలవడానికి ఇంకా 722ఓట్లు రావాల్సి ఉండడంతో రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డిని కూడా ఎలిమినేట్ చేసి లెక్కించారు.
కరీంనగర్ స్థానంలో బీజేపీ హవా..
కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ స్థానం నుంచి రాజకీయ పార్టీల్లో బీజేపీ మాత్రమే అభ్యర్థిని పోటీలో నిలపగా.. మిగతా పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 27,088 మంది ఓటర్లు ఉండగా, 25,041 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 73 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం పోలైన ఓట్లలో 897 ఓట్లు చెల్లకుండా పోయాయి. 24,144 ఓట్లు చెల్లుబాటు కాగా, అభ్యర్థి గెలుపొందడానికి 12,081 ఓట్లను కోటా ఓటుగా నిర్ధారించారు. కాగా, బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులోనే కోటా ఓటుకు మించి ఓట్లు సాధించి గెలుపొందారు. కొమురయ్యకు 12,959 ఓట్లు రాగా ఆయన సమీప పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డికి 7182 ఓట్లు వచ్చాయి. అశోక్‌కుమార్‌కు 2,621 ఓట్లతో మూడో స్థానంలో, సిటింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి 428ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. కాగా, కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు ఎక్కువగా పోలవడానికి కారణం ఓటింగ్‌పై అవగాహన కల్పించక పోవడమేనని పలువురు స్వతంత్ర అభ్యర్థులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టిన అంబేద్కర్ స్టేడియంలో వారు ఆందోళనకు దిగారు. ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికలను రద్దు చేసి తిరిగి పోలింగ్ నిర్వహించాలని కోరారు.
కొనసాగుతున్న పట్టభద్రుల ఓట్ల లెక్కింపు
కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఓట్లను లెక్కించేందుకు 21టేబుళ్లను ఏర్పాటు చేశారు. పట్టభద్రుల స్థానంలో 56 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. మొత్తం 2,50,106ఓట్లు పోలయ్యాయి. వీటి నుంచి చెల్లిన, చెల్లని ఓట్లను వేరు చేసే ప్రక్రియ సోమవారం రాత్రి వరకూ పూర్తికాలేదు. 25 ఓట్లకు ఒకటి చొప్పున కట్టలు కట్టి, ఆ తర్వాత ఓట్లను లెక్కిస్తారు. కట్టలు కట్టే ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం వరకు పూర్తయ్యే అవకాశముందని, ఆ తర్వాత నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నారు. చెల్లని ఓట్లు పెద్దసంఖ్యలో కనిపిస్తుండడంతో వాటితో ఫలితాలు తారుమారయ్యే అవకాశముంటుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
Also Read: హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. జస్ట్ 5 నిమిషాలు ఇలా చేయండి..
Also Read: ఏపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు
Also Read: రంగంలోకి మీనాక్షి నటరాజన్
For Telangana News And Telugu News..
Updated Date - Mar 04 , 2025 | 04:03 AM