Nalgonda: పాలేరు ఏరులో చచ్చిన కోళ్లు
ABN, Publish Date - Feb 22 , 2025 | 04:14 AM
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధి పైనంపల్లి వద్ద పాలేరు ఏరులో కోళ్ల కళేబరాలు కలకలం రేపాయి. శుక్రవారం ఏటి వైపు ఉన్న తమ పొలాలకు వెళ్లిన రైతులకు ఏరు నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్న కోళ్లు కనిపించడంతో బెంబేలెత్తిపోయారు.
నల్లగొండ జిల్లా పెద్దకాపర్తిలో 231 నాటు కోళ్లు మృతి
నేలకొండపల్లి, చిట్యాలరూరల్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధి పైనంపల్లి వద్ద పాలేరు ఏరులో కోళ్ల కళేబరాలు కలకలం రేపాయి. శుక్రవారం ఏటి వైపు ఉన్న తమ పొలాలకు వెళ్లిన రైతులకు ఏరు నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్న కోళ్లు కనిపించడంతో బెంబేలెత్తిపోయారు. బర్డ్‌ఫ్లూతో కోళ్లు మృత్యువాత పడుతున్న తరుణంలో కోళ్ల కళేబరాలు దర్శనమివ్వడం గ్రామస్థులను ఆందోళనకు గురిచేసింది. పైనంపల్లిలో కోళ్లఫారాలు లేవు. మండల పరిధిలోనూ ఎక్కడా పెద్దగా కోళ్ల ఫారాలు లేకపోవడంతో పాలేరు ఏరుపైనున్న గ్రామాల్లో పౌలీ్ట్ర ఫారాలున్న వారు చ నిపోయిన కోళ్లను ఏరులో పారేసి ఉంటారని, అవే నీటిలో కొట్టుకొచ్చి ఉంటాయని ప్రజలు భావిస్తున్నారు. మరోవైపు నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలో ఐదు రోజుల వ్యవధిలో 231 నాటుకోళ్లు మృతిచెందాయి.
గ్రామానికి చెందిన నీలకంఠం లింగస్వామి పెంచుతున్న కోళ్లలో శుక్రవారం ఐదు మృతిచెందడంతో విషయం వెలుగుచూసింది. ఐదు రోజుల్లో ఈయన పెంచుతున్న 15 కోళ్లు మృతి చెందాయి. కోళ్ల ముక్కు నుంచి రక్తం కారినట్లు గుర్తించటంతో బర్డ్‌ఫ్లూ ఏమోనని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. గ్రామానికి చెందిన తోటకూరి లక్ష్మమ్మ, ఆమె కోడలు 210 నాటుకోళ్లను పెంచుతున్నారు. కొద్ది రోజులుగా కోళ్లు నీరసంగా ఉండగా దాణా, మందులు ఇచ్చినా ఫలితంలేక క్రమంగా అన్ని కోళ్లు మృతిచెందాయి. స్థానికంగా ఓ మహిళ పెంచుతున్న ఆరు కోళ్లు మృత్యువాతపడ్డాయి. ఈ విషయమై చిట్యాల పశువైద్యాధికారి అభినవ్ మాట్లాడుతూ కోళ్లకు వ్యాధులు సోకినట్లు అనుమానాలుంటే వాటి నమూనాలను సేకరిస్తామని, కోళ్లను పెంచే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Updated Date - Feb 22 , 2025 | 04:14 AM