BioAsia-2025: 20 రోజుల్లోగా లైఫ్ సైన్సెస్ పాలసీ
ABN, Publish Date - Feb 27 , 2025 | 04:19 AM
బయో ఏషియా-2025 సదస్సుకు ప్రభుత్వం ఊహించిన దాని కంటే అధిక స్పందన వచ్చిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బయో ఏషియా చరిత్రలో ఈ ఏడాది సదస్సు ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు.
అన్ని వర్సిటీల్లో లైఫ్‌సైన్సెస్ కొత్త కోర్సులు
దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో
లైఫ్‌సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు
ముగిసిన బయో ఏషియా-2025 సదస్సు
44 దేశాల నుంచి 4 వేల మంది ప్రతినిధుల హాజరు
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): బయో ఏషియా-2025 సదస్సుకు ప్రభుత్వం ఊహించిన దాని కంటే అధిక స్పందన వచ్చిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బయో ఏషియా చరిత్రలో ఈ ఏడాది సదస్సు ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 44 దేశాల నుంచి 4 వేల మంది ఫార్మా, హెల్త్‌కేర్ పరిశ్రమ లీడర్లు, విధానకర్తలు, ఆవిష్కర్తలు హాజరయ్యారని తెలిపారు. హెచ్‌ఐసీసీలో బుధవారం బయో ఏషియా-2025 ముగింపు సదస్సులో, అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. దేశంలోనే తొలిసారి లైఫ్ సైన్సెస్ పాలసీని తేవడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టిందన్నారు. ఫార్మా రంగంలో కంపెనీలు మరిన్ని పెట్టుబడులు పెట్టేలా, ఈ రంగంలో రాష్ట్ర యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో దీన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. దీనిపై త్వరలోనే క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని, 20 రోజుల్లోగా కొత్త విధానాన్ని ప్రకటిస్తామన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామని, దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలోని అపార అవకాశాలు రాష్ట్ర యువతకు దక్కేలా అన్ని వర్సిటీల్లో కొత్త కోర్సులు అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఈ అంశంపై త్వరలో అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతుల (వీసీ)తో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఫార్మా రంగంలో తెలంగాణలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు కంపెనీలు ఆసక్తితో ఉన్నాయని, కాలుష్య లేని విధంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. వికారాబాద్, జహీరాబాద్‌లో ఇప్పటికే స్థలాలను గుర్తించామని, లగచర్లలో ఫార్మా పరిశ్రమలుకాకుండా పర్యావరణహిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారని మంత్రి పేర్కొన్నారు. ఇక హెల్త్, ఫార్మా రంగాలకు చెందిన 100మంది నిపుణులు ఆయా రంగాల్లో సవాళ్లను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన అంశాలపై బయోఏషియాలో చర్చించారని, ఈ సదస్సులో 200కుపైగా బిజినెస్ టూ బిజినెస్ సమావేశాలు జరిగాయని మంత్రి తెలిపారు. గతేడాది కంటే ఈసారి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయన్నారు. అమెరికాకు చెందిన బయో టెక్నాలజీ దిగ్గజం అమ్జెన్ భారీ పెట్టుబడులతో 3వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ ఏడాది సదస్సులో 84 స్టార్టప్స్ పాల్గొన్నాయన్నారు. సంబంధిత రంగంలో అనుభవమున్న 4 పరిశ్రమల సహకారంతో ‘సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ర్టీ’ పేరిట ప్రత్యేక కోర్సును ప్రారంభించామని, మొదటి బ్యాచ్‌లో 140మంది విద్యార్థులు శిక్షణను పూర్తి చేసుకున్నారని మంత్రి తెలిపారు. జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని గతంలో ప్రధాని మోదీ హామీ ఇచ్చార న్నారు. ఈ కేంద్రం ఏర్పాటయ్యేలా సహకరించాలని సదస్సు వేదికపై ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ మంత్రి పేర్కొన్నారు.
లైఫ్‌సైన్సెస్‌లో తెలంగాణ అద్భుతం: పీయూష్
లైఫ్‌సైన్సెస్, ఫార్మా రంగాల్లో తెలంగాణ అద్భుతమైన విజయాలను సాధిస్తోందని, రాష్ట్రం ప్రముఖ హెల్త్‌కేర్ హబ్‌గా నిరూపించుకుందని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. బయో ఏషియా ముగింపు సదస్సులో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. దేశంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్లు, బయోటెక్ పరిశోధనా కేంద్రాలను తెలంగాణ నిర్వహిస్తోందని కొనియాడారు. ఈ రంగంలో తెలంగాణ విజయాలు.. భారత అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, జహీరాబాద్‌లోని ఇండస్ర్టియల్ నోడ్‌తోపాటు బీబీనగర్ ఎయిమ్స్‌తో తెలంగాణ ప్రయోజనం పొందుతోందని తెలిపారు.
ఫార్మాలో హైదరాబాద్ కీలకం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
భారత ఫార్మా రంగంలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలోని ఫార్మా ఆదాయంలో 35శాతం, బల్క్ డ్రగ్స్‌లో 40శాతం ఆదాయం ఇక్కడి నుంచే వస్తోందన్నారు. 800 ఫార్మా, బయోటెక్, మెడిటెక్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయన్నారు. బయో ఏషియా ముగింపు సమావేశంలో కిషన్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్‌లో ఐఐటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ (నైపర్), సీసీఎంబీ, ఐఎ్‌సబీ, నల్సార్, డీఆర్‌డీవో వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి నైపుణ్యం కలిగిన యువకులు ఆయా రంగాల్లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ, ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్కు వంటివి విదేశీ పెట్టుబడులను ఆకర్షించి, 2047నాటికి 500 బిలియన్ డాలర్ల లైఫ్ సైన్సెస్ ఎకానమీ సృష్టి దిశగా అడుగులు వేసే అవకాశాలు హైదరాబాద్‌లో మెండుగా ఉన్నాయన్నారు. లైఫ్‌సైన్సెస్ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందువరుసలో ఉంటుందని తెలిపారు. కేంద్రం తెచ్చిన ‘మెడ్‌టెక్ మిత్ర’ వంటి వేదికలు.. ఆవిష్కర్తలు, స్టార్టప్స్, భాగస్వామ్య పక్షాలు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించేందుకు దోహదపడుతున్నాయని చెప్పారు. ‘రానున్న రెండేళ్లలో భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చేరుకోవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, 2030నాటికి 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ‘బల్క్ డ్రగ్ క్యాపిటల్’, ‘వ్యాక్సిన్ క్యాపిటల్’గా పురోగతి సాధించిందన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో వినూత్న ఆవిష్కర్తలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు బహుమతులు ప్రదానం చేశారు.
Updated Date - Feb 27 , 2025 | 04:20 AM