Digital Detox: 'డిజిటల్ డిటాక్స్'.. ఇది మనస్సు, శరీరాన్ని ప్రభావితం చేస్తుందా..
ABN, Publish Date - Jan 24 , 2025 | 11:25 AM
డిజిటల్ డిటాక్స్ అంటే ఏంటి? ఇది మన మనస్సు, శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Digital Detox: టెక్నాలజీ ప్రపంచానికి దూరంగా ఉండటాన్ని డిజిటల్ డిటాక్స్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే.. ఎలక్ట్రానిక్ పరికరాలు, సోషల్ మీడియా వినియోగాన్ని కొంత సమయం పాటు తగ్గించడాన్నిడిజిటల్ డిటాక్స్ అని చెబుతారు. నేటి కాలంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన చూపు మొబైల్ ఫోన్‌పైనే ఉంటుంది. ఉద్యోగం అంటూ ల్యాప్‌టాప్ లను 9 నుండి 12 గంటల పాటు వాడుతునే ఉంటారు. ఇక ఖాళీ సమయం దొరికిన చాలు సోషల్ మీడియాలో ఉంటారు. ఇన్ స్టా, ఫేస్ బుక్, వాట్సప్ అంటూ మిగిలిన సమయాన్ని కూడా వాటితోనే గడుపుతారు. ఇలా జీవితమంతా డిజిటల్ పరికరాలతోనే సరిపోతుంది. ఇలా ప్రతి రోజు ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం వల్ల మన మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
నీలి కాంతి ప్రభావం
ఎలక్ట్రానిక్ పరికరాలు నీలం కాంతిని విడుదల చేస్తాయి. ఇది మన ఆరోగ్యానికి చాలా హానికరం. స్మార్ట్‌ఫోన్‌లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం, ముఖ్యంగా రాత్రి సమయంలో బ్లూ లైట్ వల్ల కలిగే మెలటోనిన్ (స్లీప్ హార్మోన్) ఉత్పత్తిని తగ్గిస్తుంది, ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. డిజిటల్ డిటాక్స్ చేయడం వల్ల స్క్రీన్‌లకు దూరంగా ఉంటాం కాబట్టి బాగా నిద్రపోతారు. తద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు.
డిజిటల్ డిటాక్స్ మనస్సును ఎలా ప్రభావితం చేస్తుంది?
తక్కువ స్క్రీన్ సమయం ఒత్తిడిని తగ్గిస్తుంది. స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్‌ను నిరంతరం చూడటం వల్ల కంటి అలసట, తలనొప్పి, మానసిక అలసట కలుగుతుంది. డిజిటల్ డిటాక్స్ స్క్రీన్ ముందు గడిపే సమయాన్ని తగ్గించే అవకాశాన్ని ఇస్తుంది. ఇది మానసిక ప్రశాంతతను అందిస్తుంది. మనం స్మార్ట్‌ఫోన్‌లకు దూరంగా ఉన్నప్పుడు మానసికంగా మరింత రిలాక్స్‌గా ఉంటాం. ఎందుకంటే సోషల్ మీడియా లేదా ఇమెయిల్‌లను నిరంతరం తనిఖీ చేయడం వల్ల మానసిక ఒత్తిడి వస్తుంది. డిజిటల్ డిటాక్స్ మన కుటుంబానికి, స్నేహితులకు మనల్ని దగ్గర చేస్తుంది. ఇది మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
డిజిటల్ డిటాక్స్ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
డిజిటల్ పరికరాలకు దూరంగా ఉండి యోగా, ఇంటి పనులు లేదా సాధారణ నడక వంటివి చేస్తే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. పరికరాల అధిక వినియోగం కంటి, శారీరక అలసటను కలిగిస్తుంది. ఇది కళ్లలో వాపు, చికాకు, అలసటకు కారణమవుతుంది. దీన్నే 'డిజిటల్ ఐ స్ట్రెయిన్' అంటారు. అందువల్ల, స్క్రీన్ సమయాన్ని తగ్గించడం వల్ల కళ్లకు విశ్రాంతి లభిస్తుంది. అలాగే శారీరక అలసట తగ్గుతుంది. కాబట్టి, ఇక నుండి డిజిటల్ డిటాక్స్ ద్వారా మీ శారీరాన్ని, మానసును ఆరోగ్యంగా ఉంచుకోండి.
Also Read: రోజుకో లవంగం తింటే చాలు.. ఆ సమస్యలన్నీ పరార్..
Updated Date - Jan 24 , 2025 | 11:31 AM