ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మన్యం పసుపు ఆస్ట్రేలియాకు...

ABN, Publish Date - Jan 19 , 2025 | 08:02 AM

‘మా పక్కన సముద్రం లేదు కాబట్టి ఉప్పు పండించడం లేదు కానీ, వంట నూనె కూడా మేమే తయారు చేసుకుంటాం!’ అన్నారు చుట్టూ పసుపు తివాచీలా పరుచుకున్న వలిసిపూలను చూపిస్తూ ఈ జంట! కొండల కింద పరిచిన పసుపు పచ్చని తివాచీ మీద నడుస్తున్నట్టుంది ఈ వలిసిపూల వనం.

‘మా పక్కన సముద్రం లేదు కాబట్టి ఉప్పు పండించడం లేదు కానీ, వంట నూనె కూడా మేమే తయారు చేసుకుంటాం!’ అన్నారు చుట్టూ పసుపు తివాచీలా పరుచుకున్న వలిసిపూలను చూపిస్తూ ఈ జంట! కొండల కింద పరిచిన పసుపు పచ్చని తివాచీ మీద నడుస్తున్నట్టుంది ఈ వలిసిపూల వనం. అతడి పేరు సాంబ. ఆదివాసీల్లో అత్యంత వెనుకబడిన కోందు తెగ రైతు. ‘ఏ తెగలో పుట్టాలనేది ఎవరి చేతుల్లోనూ ఉండదు కానీ, ఎలా ఎదగాలనేది మన చేతుల్లోనే ఉంటుంది.’ అన్నాడు కోతకు సిద్ధంగా ఉన్న సామ కంకులను చూపిస్తూ.

‘‘రెండకరాల్లో రాగులు పండించేవాణ్ణి. సరైన దిగుబడి వచ్చేది కాదు. కొన్నిసార్లు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేది కాదు. సేద్యం మానేసి మరో పనేదైనా చూసుకుందాం అనిపించేది. అలాంటి పరిస్థితుల్లో ‘ఆగ్రో ఫారెస్ట్రీ’ విధానం తెలిసి శిక్షణ తీసుకున్నా. ఆ తరువాత నా జీవితమే మారిపోయింది. ఇప్పుడు నా పొలంలో పండిన పసుపు కోసం ఆస్ట్రేలియా నుంచి ఆర్డర్లు వస్తున్నాయి’’ అన్నాడు పసుపు పంట అనంతరం వేసిన స్వీట్‌ పొటాటో పొలం వైపు నడుస్తూ.


పాడేరు ఏజెన్సీ (అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌)లో జీవిస్తున్న అదివాసీల్లో అత్యంత వెనుకబడిన అరుదైన తెగ ‘కోందులు’ (Vulnerable Tribal Groups). వారిలో చాలామందికి తెలుగు సరిగా రాదు. లిపి లేని ‘కువి’ భాషలో మాట్లాడతారు. కాఫీతోటల్లో పనులకు వెళ్తారు. కొందరు కొండల్లో నుండి పారే ఊటనీటితో వాలులో మెట్లు కట్టి వరి, కూరగాయలు పండిస్తారు. నీటివసతి లేని చోట రాగులు, సజ్జలు సాగు చేసుకుంటారు. ఆ తెగలోని రైతే సీదరి సాంబ. పరదేశీ పుటు (పాడేరు మండలం)లో రెండు ఎకరాలు సేద్యం చేస్తున్నాడు.

జీవితాన్ని మార్చిన ‘ఆగ్రో ఫారెస్ట్రీ’

తూరుపు మన్యం ప్రజలు ఏడాదిలో సగం రోజులు అడవిపై, మిగతా కాలం వ్యవసాయంపై ఆధారపడతారు. స్ధిరమైన బతుకుతెరువు లేక పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ, అటవీ ఉత్పత్తుల వినియోగంలో అవగాహన లోపం, పోడు వ్యవసాయం పెరగడం, అడవులు తగ్గిపోవడం వలన పాడేరు ఏజెన్సీలో పచ్చ దనం క్షీణించి జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో అమృతా వెల్ఫేర్‌ సొసైటీ ‘ఆగ్రోఫారెస్ట్రీ’ని అమలు చేసింది.


ఆగ్రోఫారెస్ట్రీ అంటే?

ఒక ఎకరం పొలంలో ఏడాదంతా పలురకాల పంటల మీద ఆదాయం అందు కోవడమే ఆగ్రోఫారెస్ట్రీ. ఎకరం భూమిని నాలుగు ముక్కలు చేస్తారు. ఒక భాగంలో మామిడి, సపోటా, పనస, జామ వంటి పండ్ల తోటలు. రెండవ భాగంలో రాగులు, సజ్జలు, జొన్నలు వంటి చిరుధాన్యాలు. మూడవ భాగంలో అన్ని రకాల ఆకుకూరలు, తీగజాతి కాయగూరలు. నాలుగవ భాగంలో అశ్వగంధ, తిప్పతీగ, నన్నారి వంటి ఔషధ సుగంధ మొక్కలు. పొలం చుట్టూ సరిహద్దుల్లో కిత్త నార, టేకు, అరటి పెంచుతారు. ఇదంతా వాతావరణ మార్పులను ఎదుర్కొనే కొత్త వ్యవసాయ విధానం. ఆంధ్రప్రదేశ్‌లోని,అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మన్యంలో కొందరు రైతులతో ఆగ్రోఫారెస్ట్రీని అమలు చేయించారు. వారిలో సక్సెస్‌ అయిన రైతే సాంబ.


ఆస్ట్రేలియాకు ఎగుమతి...

‘‘రెండెకరాల్లోని ఒక ఎకరంలో జొన్న, సామలు వేశాను. మరో ఎకరాన్ని నాలుగు భాగాలు చేసి అల్లం, పసుపు, స్వీట్‌ పొటాటో, వలిసెలుతో పాటు పిప్పళ్లు, నన్నారి వంటి ఔషధ పంటలు పండిస్తున్నాం. పొలం చుట్టూ సరిహద్దులో అరటి, టేకు పెంచుతున్నాం. ఇది పూర్తిగా ప్రకృతి వ్యవసాయం. సొంతవిత్తనాలు నాటుతాం. మా పంటల్లో పసుపుకు డిమాండ్‌ బాగుంది. గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాకు ఎగుమతి అవుతోంది. స్వీట్‌ పొటాటోను ఒడిశా వర్తకులు కొంటున్నారు’’ అన్నాడు సాంబ.


ఔషధగుణాలు అధికం...

మన్యంలో సహజంగా పారే ఊటనీటితో పండించే పసుపులో ఔషధ విలువలు ఎక్కువగా ఉంటాయి. అందుకే విదేశాల్లో డిమాండ్‌. ‘స్పైస్‌ ఇండియా’ వారు సాంబను సంప్రదించగా 23 టన్నుల పసుపు పంపారు. మరో 50 టన్నుల వరకు ఆర్డర్‌ వచ్చింది. సాంబను చూసి మిగతా రైతులు కూడా ముందుకు రావడంతో వారి నుంచి సేకరించిన పసుపును పంపుతున్నాడు. ఇతడు పండిస్తున్న పిప్పళ్లు, నన్నారి పంటల దిగుబడిని ప్రతీ సంవత్సరం తీసుకోవడానికి తమిళనాడుకు చెందిన ఆయుర్వేద కంపెనీ రైతుతో ఒప్పందం కుదుర్చుకుంది.ఆదివాసీల్లో అత్యంత వెనుకబడిన వర్గానికి చెందిన సాంబ సాగులోనే కాదు చదువులోనూ ముందున్నాడు. ఎమ్మెస్సీ బీఈడీ చేశాడు. వ్యవసాయం మీద మక్కువతో ఉద్యోగ ప్రయత్నాలేవీ చేయకుండా సేద్యమే జీవితంగా బతుకుతున్నాడు.

- శ్యాంమోహన్‌, 94405 95858


సొంతంగా వంటనూనె

సాంబ సాగు చేస్తున్న అరుదైన మరో పంట వలిసెలు. అరకు నుంచి పాడేరు వరకు కొండవాలులో ఈ నూనె గింజలను పెంచుతారు. ‘‘ఈసారి రెండు బస్తాలు దిగుబడి వచ్చింది. 2 కిలోల వలిసెల గింజలను మిల్‌లో ఆడిస్తే కిలో ఆయిల్‌ వస్తుంది. ఏడాదంతా వంటలకు వాడుకుంటాం. మిగిలితే సంతలో అమ్ముకుంటాం. కొలెస్ట్రాల్‌ తక్కువ, ఆరోగ్యానికి మంచిదని చాలామంది మా దగ్గరకు వచ్చి అడుగుతుంటారు. మా గ్రామంలో 90 శాతం మంది ఇదే నూనె వాడుతారు’’ అంది వలిసె పూలను చూపిస్తూ సాంబ భార్య.

Updated Date - Jan 19 , 2025 | 08:02 AM