చెక్క మెట్లు... అదిరిపోయేట్టు...
ABN, Publish Date - Mar 02 , 2025 | 09:37 AM
నది వెంట, కొండ అంచుల్లో కిలోమీటర్ల మేర పొందికగా, కళాత్మకంగా నిర్మించిన చెక్క మెట్లు. వాటిపై నడుస్తుంటే... ఒకవైపు ఉత్కంఠభరితంగా, మరోవైపు ప్రకృతితో మమేకమయ్యేలా... జీవితంలో మరిచిపోలేని మధురానుభూతులను అందిస్తుంది.
నది వెంట, కొండ అంచుల్లో కిలోమీటర్ల మేర పొందికగా, కళాత్మకంగా నిర్మించిన చెక్క మెట్లు. వాటిపై నడుస్తుంటే... ఒకవైపు ఉత్కంఠభరితంగా, మరోవైపు ప్రకృతితో మమేకమయ్యేలా... జీవితంలో మరిచిపోలేని మధురానుభూతులను అందిస్తుంది. ఇంతకీ ఆ మెట్లు ఎక్కడున్నాయి?
కొండలపై ఉన్న దేవాలయాలను చేరుకోవడానికి మెట్ల మార్గాలు ఏర్పాటు చేస్తుంటారు. అయితే పర్యాటకులు ప్రకృతి అందాలను వీక్షించేందుకు కలపతో మెట్ల మార్గాన్ని సృష్టించారు. తద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. పోర్చుగల్‌లోని అరోకాలో పైవా నది చెంతన కనిపిస్తుందీ సుందర దృశ్యం. నది వెంట ప్రకృతి రమణీయతను ఆస్వాదించేందుకు వీలుగా ఏకంగా ఎనిమిది కిలోమీటర్ల మేర చెక్కతో ఈ మెట్ల మార్గాన్ని నిర్మించారు. ఈ మెట్లపై నెమ్మదిగా నడుచుకుంటూ చూస్తే 360 డిగ్రీల కోణంలో భూమిపై మరెక్కడా ఇంత సుందర దృశ్యం లేదేమో అన్నట్టుగా ఉంటుంది. అందుకే కాస్త కష్టమైనా పర్యాటకులు ఈ మెట్ల మార్గంలో నడకకు సై అంటుంటారు.
- ప్రకృతితో మమేకం...
ఒకటి కాదు... రెండు కాదు... ఎనిమిది కిలోమీటర్ల మెట్ల మార్గమిది. దారి పొడవునా ప్రకృతి సహజ సంపద, అక్కడక్కడా జలపాతాలు కనువిందు చేస్తాయి. 2015లో పోర్చుగల్ ప్రభుత్వం ‘పైవా వాక్‌వే’ని పర్యాటకుల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఈ మెట్ల ప్రయాణం ఎరెన్హో బీచ్ దగ్గర ప్రారంభమై, ఎస్పింకా బీచ్ వద్ద ముగుస్తుంది. దారి పొడవునా ఎతైన కొండలు, అరుదైన వృక్షజాలం, జంతుజాలం కనిపిస్తుంది. ప్రకృతి సహజ సౌందర్యాన్ని వీక్షించేందుకు పర్యాటకులు అక్కడికి వెళ్తుంటారు. గత ఏడాది అగ్నిప్రమాదం వల్ల కొద్ది దూరం మెట్లు కాలిపోతే వెంటనే పునరుద్ధరించారు.
అరోకా మున్సిపాలిటీ, ట్రిమెట్రికా ఇంజనీరింగ్ సంస్థలు సంయుక్తంగా పైవా వాక్‌వేని నిర్మించాయి. మెట్ల మార్గం ప్రారంభమయ్యే ప్రదేశాన్ని చేరుకోవడానికి క్యాబ్‌లో వెళ్లాల్సి ఉంటుంది. పర్యాటకులు ఎక్కువగా గ్రూప్ టూర్ ప్లాన్ చేసుకుంటారు. ప్రకృతి అందాలు వీక్షించేందుకు అనువుగా విశాలమైన వ్యూ పాయింట్లు, విశ్రాంతి కోసం ప్రత్యేక పాయింట్లు ఉన్నాయి. అయితే ఈ వంతెన మార్గంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే అనుమతిస్తారు. సూర్యాస్తమయంలోపే పర్యాటకులు నడక పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. పెట్స్‌ని అనుమతించరు. నడక మార్గంలో ఎలాంటి చెత్త వేయకూడదు. మొక్కలను తెంపడం, రాళ్లను కదిలించడం చేయరాదు. మరో ముఖ్యమైన హెచ్చరిక ఏమిటంటే... పొగతాగరాదు. ఈ నియమ నిబంధనలన్నీ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. నడక మార్గం చివర్లో రెస్టారెంట్లు అందుబాటులో ఉంటాయి.
- పొడవైన వేలాడే వంతెన...
ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సాగే నడక ఆద్యంతం థ్రిల్‌ని పంచుతుంది. వాక్‌వేని చేరుకునే ముందే ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాదచారుల ‘సస్పెన్షన్ వంతెన’ ఉంటుంది. 516 మీటర్ల పొడవుండే దీన్ని ‘అరోకా 516’ అని పిలుస్తారు. పోర్చుగల్ ప్రభుత్వం పైవా వాక్‌వేని ప్రారంభించిన రెండున్నర నెలల్లోనే 2 లక్షల మంది సందర్శించారు. అంతేకాదు, దీనికి వరల్డ్ ట్రావెల్ అవార్డులు కూడా దక్కాయి. పర్యాటకుల సంఖ్య పెరిగిపోవడంతో ఎకో సిస్టమ్ దెబ్బతినకూడదని రోజువారి సందర్శకుల సంఖ్యపై పరిమితి విధించారు. రోజుకి 3500 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. యునెస్కో ఈ వాక్‌వేని ‘జియాలాజికల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ’గా గుర్తించింది.
Updated Date - Mar 02 , 2025 | 09:37 AM