Tree House: చెట్టు కాండమే ఇల్లు..
ABN, Publish Date - Mar 02 , 2025 | 10:42 AM
ఆ ఇంట్లోకి అడుగుపెడితే మండు వేసవిలోనూ చల్లగా ఉంటుంది. విశాలంగా లేకపోయినా ఒక పక్క కిచెన్, మరో పక్క బెడ్‌రూమ్, లివింగ్‌రూమ్, డైనింగ్‌రూమ్... ఇలా సకల సదుపాయాలతో పొందికగా కనిపిస్తుంది. అయితే అది పునాదులు తీసి, సిమెంట్, ఇసుకతో గోడలు కట్టి, పైకప్పు వేసిన ఇల్లులాంటిది కాదు.
ఆ ఇంట్లోకి అడుగుపెడితే మండు వేసవిలోనూ చల్లగా ఉంటుంది. విశాలంగా లేకపోయినా ఒక పక్క కిచెన్, మరో పక్క బెడ్‌రూమ్, లివింగ్‌రూమ్, డైనింగ్‌రూమ్... ఇలా సకల సదుపాయాలతో పొందికగా కనిపిస్తుంది. అయితే అది పునాదులు తీసి, సిమెంట్, ఇసుకతో గోడలు కట్టి, పైకప్పు వేసిన ఇల్లులాంటిది కాదు. వేల ఏళ్ల నాటి ఒక ఎర్రచందనం చెట్టు కాండాన్ని తొలిచి తీర్చిదిద్దిన ఇల్లు. ‘వన్ లాగ్ హౌజ్’ అని పిలుస్తుంటారు.
ఆసక్తి ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చు అనడానికి స్మాక్ ఆలోచన చక్కని ఉదాహరణ. కొన్ని దశాబ్దాల క్రితం ఈయన అడవిలో ఒక ఎర్రచందనం చెట్టును చూశాడు. రెండువేల ఏళ్లనాటి భారీ వృక్షం అది. దాని కాండాన్ని తొలిచి ఇల్లుగా మారిస్తే భలేగా ఉంటుంది కదా అనే ఆలోచన స్మాక్‌కు తట్టింది.
వెంటనే చెట్టును నరికి కాండాన్ని వేరు చేశాడు. భూమిపై పడ్డ కాండం 7 అడుగుల ఎత్తు, 32 అడుగుల పొడవుతో ఉంది. దాని వ్యాసం ఏకంగా 13 అడుగులు. బరువు సుమారు నలభై రెండు టన్నులు. తన ఆలోచనను అమలు పరచడానికి ఇద్దరు వ్యక్తుల సహాయం తీసుకున్నాడు స్మాక్. ఇది ఇప్పటి ముచ్చట కాదు... 1946లో ఇద్దరు వ్యక్తులు ఎనిమిది నెలల పాటు శ్రమిస్తే కాండం లోపలి భాగం పూర్తిగా తొలగించే పని పూర్తయింది. కాండం లోపల విశాలంగా తయారయింది. ఆ తరువాత అందులో సకల సదుపాయాలు సమకూర్చాడు స్మాక్. కిచెన్, బెడ్‌రూమ్, లివింగ్‌రూమ్, డైనింగ్ రూమ్... ఇలా అన్ని ఏర్పాటు చేశాడు.
ఇప్పుడది పర్యాటక ప్రదేశం...
నిజానికి ‘వన్ లాగ్ హౌజ్’ ఒక ట్రావెలింగ్ హోమ్. కాండాన్ని తొలిచి ఇంటిలా తయారు చేయించిన స్మాక్, అప్పట్లో దాన్ని లారీలో ఎక్కించి అమెరికా అంతటా తిప్పాలనుకున్నాడు. కానీ దాని సైజు వల్ల ఆ ఆలోచనను విరమించుకున్నాడు. ఇప్పుడున్న ప్రాంతానికి తీసుకురావడానికి ముందు దానిని కమ్మింగ్స్‌లో 25 ఏళ్లు, ఫిలిప్స్‌విల్లేలో 23 ఏళ్లు ఉంచారు. ఆ తరువాత 1999లో కాలిఫోర్నియాలోని గార్బర్‌విల్లేకు పదికిలోమీటర్ల దూరంలో ఉన్న రిచర్డ్‌సన్ గ్రోవ్ స్టేట్‌పార్క్‌కు తరలించారు. అప్పటి నుంచి ‘వన్ లాగ్ హౌజ్’ అక్కడే ఉంది. ఇప్పుడది పర్యాటక ప్రదేశంగా మారింది. అందులోకి వెళ్లి చూడాలంటే ప్రవేశ రుసుము చెల్లించాల్సిందే. ఒకరికి ఒక డాలరు ఎంట్రీఫీజుగా నిర్ణయించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పర్యాటకులకు అందు బాటులో ఉంటుంది. కాలిఫోర్నియాకు వెళ్లిన పర్యాటకులు ఈ కాండం ఇంటిని సందర్శిస్తుంటారు.
Updated Date - Mar 02 , 2025 | 08:50 PM