కెమెరా కన్ను పుస్తకాలే దన్ను
ABN, Publish Date - Feb 09 , 2025 | 12:12 PM
చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ఓ పిల్లాడు పొట్ట చేత పట్టుకుని చెన్నై చేరుకున్నాడు. ఒక సినిమా కంపెనీలో ఆఫీస్‌బాయ్‌గా చేరి, ఆ తర్వాత కెమెరా అసిస్టెంట్ అయ్యాడు. కట్ చేస్తే... మనదేశంలోని టాప్ డైరెక్టర్స్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు.
చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ఓ పిల్లాడు పొట్ట చేత పట్టుకుని చెన్నై చేరుకున్నాడు. ఒక సినిమా కంపెనీలో ఆఫీస్‌బాయ్‌గా చేరి, ఆ తర్వాత కెమెరా అసిస్టెంట్ అయ్యాడు. కట్ చేస్తే... మనదేశంలోని టాప్ డైరెక్టర్స్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. తాజాగా ప్రపంచంలోనే ప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్స్ ఆర్గనైజేషన్‌గా పేరొందిన ప్రతిష్టాత్మకమైన ‘అమెరికన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్’ (ఎఎస్‌సీ)లో సభ్యుడిగా అరుదైన గౌరవం దక్కింది. మనదేశంలో సంతోష్ శివన్ తర్వాత ఈ గౌరవం అందుకున్న కెమెరామ్యాన్ రవివర్మన్ మాత్రమే. ఈ సందర్భంగా ఆయన ‘ఆదివారం ఆంధ్రజ్యోతి ’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
‘‘తంజావూరు (తమిళనాడు) జిల్లాలోని పట్టుకొట్టై సమీపంలో ఉన్న పొయ్యుందర్కుదికాడు అనే గ్రామం మాది. నా చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. పొట్ట చేత పట్టుకుని 14 ఏళ్ల వయసులోనే చెన్నై చేరుకున్నా. అక్కడ మా నాన్న స్నేహితుడొకరు సాయం చేస్తాడనే నా ఆశ నిరాశే అయ్యింది. ఊరికి తిరిగి వెళ్లేందుకు డబ్బులు కూడా లేవు. 7వ తరగతితోనే నా చదువు అటకెక్కింది. దేవాలయాల్లో పెట్టే ప్రసాదం తింటూ ఒక హోటల్‌లో ట్రైనీబాయ్‌గా చేరాను. అక్కడికి వచ్చే సినిమావాళ్ల ద్వారా ఒక సినిమా కంపెనీలో ఆఫీస్‌బాయ్‌గా చేరడంతో సినిమా అంటే ఏమిటో తెలిసింది.
కెమెరా అసిస్టెంట్‌గా...
మొదట్లో కెమెరామ్యాన్ వి.రంగా నన్ను ఆయనకు బాయ్‌గా పెట్టుకున్నారు. టీ అందించడం దగ్గరి నుంచి అన్ని పనులు చేసి పెట్టేవాణ్ణి. ‘మాప్పిళ్లై’ (తెలుగులో ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’)కు ఆయనే నన్ను అసిస్టెంట్ కెమెరామ్యాన్‌ను చేశారు. ఆ రోజుల్లో ఎలాగైనా డబ్బు సంపాదించి బాగా ధనవంతుడ్ని కావాలనే కోరిక ఉండేది. స్కూల్లో చదువుకోలేదు కానీ పుస్తకాలు బాగా చదువుతా. కొత్త కొత్త కెమెరాల గురించి తెలుసుకోవడం ఆసక్తిగా ఉండేది. 1992 దాకా చాలా సినిమాలకు అసిస్టెంట్ కెమెరామ్యాన్‌గా పనిచేశా.
వారిలో రవి.కె.చంద్రన్ ఒకరు. ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా. తెలుగులోకి ‘బామ్మ మాట బంగారుబాట’ (1989) ద్వారా అసిస్టెంట్ కెమెరామ్యాన్‌గా పరిచయమయ్యా. నా పనితనం నచ్చి అన్ని భాషల్లోనూ నాకు అవకాశాలు వచ్చాయి. తేజ హిందీలో తీసిన ‘యే దిల్’ (తెలుగులో ‘నువ్వు నేను’)కు కెమెరామ్యాన్‌గా పనిచేసిన తర్వాత తెలుగులో ‘జై’కి కూడా అవకాశం ఇచ్చారు. 2005లో శంకర్ ‘అన్నియన్’ (తెలుగులో ‘అపరిచితుడు’)కు ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా ‘ఫిల్మ్‌ఫేర్’ అవార్డు అందుకున్నా. కమల్‌హాసన్ ‘వెట్టైయాడు విలయాడు’ కు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఆయనతో ‘దశావతారం’, ‘భారతీయుడు 2’లకు పనిచేశా.
కథ, దర్శకులను అర్థం చేసుకుని...
నేను ఇప్పటిదాకా 6 భాషల్లో 32 మంది దర్శకుల దగ్గర 35 సినిమాలకు కెమెరామ్యాన్‌గా పనిచేశా. వారిలో మణిరత్నం, శంకర్, ప్రియదర్శన్, గౌతమ్ వాసుదేవ మీనన్, కె.ఎస్.రవికుమార్, అనురాగ్ బసు, సంజయ్‌లీలా భన్సాలీ, ఇంతియాజ్ అలీ, రాజ్‌కుమార్ హిరాణీ వంటి అగ్రశ్రేణి దర్శకులున్నారు. వారిలో ఎవరి స్టయిల్ వారిదే. ఒక సినిమాకు కెమెరామ్యాన్‌గా పనిచేసేప్పుడు నేను కథను, దర్శకుడి స్టయిల్‌ని బాగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తా. నాకు స్వతహాగా స్టాన్లీ కుబ్రిక్, అకిరా కురసోవా సినిమాలంటే బాగా ఇష్టం. బి.నర్సింగరావు ‘దాసి’ చూసి ఆశ్చర్యపోయా. అందులో పండగ సీన్, అబార్షన్ సీన్ అద్భుతం.
రామాయణ, భారతాలే స్ఫూర్తి...
నా కెమెరా కన్నుకు పుస్తకాలే దన్ను. సమయం దొరికితే చాలు... పుస్తకాలు చదువుతా. రామాయణం, భారతాలను క్షుణ్ణంగా చదివా. ఎందుకంటే వాటిలోని కథ, పాత్రలు నాకు దృశ్యమానంగా కనిపిస్తాయి. వాటిల్లో లేని ఎమోషన్ అంటూ ఉండదు. చదివేటప్పుడు నేను దృశ్యాలను విజువలైజ్ చేసుకుంటా. 2010లో ‘మాస్కోవిన్ కావేరీ’ (రాహుల్ రవీంద్రన్ హీరోగా, తమన్ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు) అనే తమిళ సినిమాకు దర్శకత్వం చేశా.
ఇప్పటికే ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ (ఎఎం-పాస్) గౌరవ సభ్యుడిగా ఉన్నాను. సినిమాల్లో నా పనితీరు నచ్చి ‘అమెరికన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్’ (ఎఎస్‌సీ)లో సభ్యుడిగా తీసుకోవడం ఆనందంగా ఉంది. ఆత్మగౌరవం, ఆత్మస్థయిర్యంతో పనిచేసుకుంటూ పోవడమే నాకు తెలిసిన విద్య. అదే నాకు ఈ రంగంలో పనిని, గౌరవాన్ని తెచ్చిపెడుతోంది’’.
సంభాషణ: చల్లా శ్రీనివాస్
కొన్ని కెమెరా మెరికలివి...
- బర్ఫీ (అనురాగ్ బసు)
- అపరిచితుడు (శంకర్)
- దశావతారం (కె.ఎస్.రవికుమార్)
- గలియోంకీ రాస్‌లీలా- రామ్‌లీలా
(సంజయ్‌లీలా భన్సాలీ)
- సంజూ (రాజ్‌కుమార్ హీరాణీ)
- పొన్నియన్ సెల్వన్ (మణిరత్నం)
Updated Date - Feb 09 , 2025 | 12:12 PM