కళ్లు చెదిరేలా పెళ్లి ‘కళ’
ABN, Publish Date - Feb 16 , 2025 | 10:32 AM
జీవితంలో అత్యంత ముఖ్యమైన వేడుక పెళ్లి. ఈ ఘట్టం మరపురానిదిగా ఉండాలని వధూవరులు కోరుకుంటున్నారు. అందుకు తగిన ప్రణాళికలు వేసుకుంటున్నారు. పెళ్లంటే శుభలేఖల ఎంపిక మొదలుకుని మెహందీ, హల్దీ వేడుకలు, వివాహ వేదిక అలంకరణ, రిసెప్షన్, ఫుడ్ మెనూ, డిజైనర్ దుస్తులు... ఇలా ప్రతీ విషయంలో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు పెళ్లి పీటలెక్కబోయే ముందు వధూవరులు.
భారతీయ వివాహ వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ‘పెళ్లంటే మూడు ముళ్లు, ఏడడుగులు మాత్రమే’ అని వధూవరులు అనుకోవడం లేదు. జీవితాంతం అదొక మరపురాని వేడుకగా ఉండాలనుకుంటున్నారు. అందుకు తగ్గట్గుగానే ప్రతీ ఏడాది సరికొత్త ట్రెండ్స్ పుట్టుకొస్తున్నాయి. ఒకవైపు సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూనే మరోవైపు ఆధునిక, సృజనాత్మక సొబగులద్దుతున్నారు. పెళ్లి కార్డు నుంచి మండపం దాకా అన్నీ అదుర్సే. వివాహ వేడుకల్లో వస్తున్న నయా పోకడలివి...
జీవితంలో అత్యంత ముఖ్యమైన వేడుక పెళ్లి. ఈ ఘట్టం మరపురానిదిగా ఉండాలని వధూవరులు కోరుకుంటున్నారు. అందుకు తగిన ప్రణాళికలు వేసుకుంటున్నారు. పెళ్లంటే శుభలేఖల ఎంపిక మొదలుకుని మెహందీ, హల్దీ వేడుకలు, వివాహ వేదిక అలంకరణ, రిసెప్షన్, ఫుడ్ మెనూ, డిజైనర్ దుస్తులు... ఇలా ప్రతీ విషయంలో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు పెళ్లి పీటలెక్కబోయే ముందు వధూవరులు.
స్వదేశానికే ఓటు...
ప్రపంచం కుగ్రామంగా మారిన ఈ రోజుల్లో కొందరు సంపన్నులు వివాహ వేడుకల్ని విదేశాల్లో చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే కొన్నేళ్లుగా ఈ టైపు ఆలోచనల్లో మార్పు కనిపిస్తోంది. క్రమక్రమంగా మాతృదేశంలోనే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్న కపుల్స్ సంఖ్య పెరుగుతోంది. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని స్వదేశంలోనే జరిపించడం ఇందుకు చక్కని ఉదాహరణ. విదేశాల్లో అంగరంగవైభవంగా పెళ్లి చేసే అవకాశం ఉన్నా స్వదేశంలోనే చేయడానికి ఇష్టపడ్డారు అంబానీ కుటుంబసభ్యులు. ‘‘జామ్‌నగర్‌లో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు హాజరయ్యారు. వివాహ వేడుకలు నిర్వహించుకోవడానికి ఇండియాలో అవకాశాలకు కొదువ లేదని ఈ పెళ్లి నిరూపించింది. ఈ పెళ్లి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. విదేశాల్లో పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపిన కొందరు కపుల్స్ తమ నిర్ణయం మార్చుకోవడం మేం చూశాం. లగ్జరీ సౌకర్యాలకు ఇక్కడ కొరత లేకపోవడం కలిసి వస్తోంది. వివాహ వేడుకల్లో సంప్రదాయాలను మరిచిపోకుండా ఉండేందుకు స్వదేశంలో వివాహం దోహదపడుతోంది’’ అని జైపూర్‌లోని రాఫెల్స్ అండ్ ఫెయిర్‌మాంట్ హోటల్‌లోని సేల్స్ విభాగంలో అసోసియేట్ డైరెక్టర్‌గా ఉన్న సచిన్ కటోచ్ అన్నారు. ఇండియాలో ఈ హోటల్‌కి ప్రముఖ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా గుర్తింపు ఉంది. ఎన్నో సంపన్న కుటుంబాల పెళ్లిళ్లు ఇక్కడ జరిగాయి.
ఆరుబయట వేడుకలపై ఆసక్తి
పెళ్లి అనగానే ఒక పెద్ద హాలులో పూలతో అలంకరించిన పెళ్లి మండపం, మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాల వెలుగులు, స్టేజ్‌కి ఎదురుగా వందల సంఖ్యలో వరుసగా వేసిన కుర్చీలు. ఏ వివాహ వేడుకకు వెళ్లినా ఇదే సీన్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఇలాంటి రొటీన్ సీన్‌ని వద్దంటున్నారు వధూవరులు. వాటి స్థానంలో ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి చెంతన పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఫంక్షన్ హాల్, కన్వెన్షన్ సెంటర్స్‌కి బదులుగా అవుట్‌డోర్ వెడ్డింగ్‌కి ‘సై’ అంటూ కొత్తదనానికి స్వాగతం పలుకుతున్నారు. ప్రకృతి ఒడిలో పెళ్లి అనేది మధురక్షణాలుగా, మరిచిపోలేని జ్ఞాపకాలుగా మారుస్తుంది. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలు పెళ్లికి వచ్చిన అతిథులను మంత్రముగ్ధులను చేస్తాయి.
అందుకే అవుట్‌డోర్ వెడ్డింగ్స్ కోసం ఆన్‌లైన్‌లో వెతికే వారి సంఖ్య 22 శాతం పెరిగింది. ఇది కొత్త ట్రెండ్‌కి అద్దం పడుతోందని వెడ్డింగ్ నిర్వాహకులు అంటున్నారు. ప్రకృతిలో పెళ్లి చేసుకోవాలని, వెడ్డింగ్ బ్యాగ్రౌండ్‌లో నేచర్ ఉండాలని కోరుంటున్న వారి సంఖ్య రెట్టింపయ్యింది. బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ పెళ్లి ఖండాలా ఫామ్‌హౌజ్‌లో, ప్రముఖ క్రికెటర్ కె.ఎల్ రాహుల్ వివాహ వేడుక సునీల్‌శెట్టికి చెందిన ఖండాలా మాన్షన్‌లో జరగడం మారిన ట్రెండ్‌ని సూచిస్తున్నాయి. చెట్ల కింద పెళ్లి మండపం, వెదురు బుట్టలు, జనపనార చాపలు, పూల మొక్కలు... వెరసి ప్రకృతిలో పెళ్లికి కపుల్స్ ఆసక్తి చూపుతున్నారు. ‘‘ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్‌లో 65 నుంచి 70 శాతం వధూవరులు ప్రకృతి చెంతన పెళ్లి జరుపుకోవాలని కోరుకుంటున్నారు.
నూర్‌మహల్ ప్యాలెస్‌లో ఉన్న అవుట్‌డోర్ వెడ్డింగ్ వెన్యూ ‘డేరా’ వీరి ఆశలను నెరవేరుస్తోంది. మెహందీ, సంగీత్ వేడుకలతో పాటు వివాహ వేడుక కోసం అవుట్‌డోర్ వెన్యూలు పాపులర్ అవుతున్నాయి. పెళ్లిని ఒక మధుర జ్ఞాపకంగా మలుచుకునేందుకు కొత్తతరం నేచర్‌ని ఎంచుకుంటోంది’’ అని నూర్‌మహల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రూప్ ప్రతాప్ చౌదరి అంటున్నారు. హర్యానాలో ఉన్న నూర్‌మహల్ ప్యాలెస్ హోటల్ వివాహ వేడుకలకు ప్రసిద్ధి చెందింది. టీవీ నటుడు సురభి చంద్ర ఇటీవలే ఉత్తరాఖండ్‌లోని ‘జిమ్‌కార్బెట్ నేషనల్ పార్కు’లో ప్రకృతి చెంతన వివాహం చేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ‘‘99శాతం మంది తమ పెళ్లికోసం అవుట్‌డోర్ మండపాలను ఎంచుకుంటున్నారు. మేము చాలా ఏళ్లుగా ‘ఫారెస్ట్ వెడ్డింగ్ కాన్సెప్ట్’ను ప్రమోట్ చేస్తున్నాం. ఈతరం ప్రకృతి చెంతన, సంప్రదాయ నృత్యాల నడుమ వివాహ వేడుక జరగాలని భావిస్తోంది. ఇది ఇటీవలి మా అధ్యయనంలో వెల్లడైంది’’ అని ఆహానా రిసార్ట్ డైరెక్టర్ ఆయు త్రిపాఠి అన్నారు. ప్రకృతితో మమేకమై జరిగే వేడుకలు మరిచిపోలేని, మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయడనంలో సందేహం లేదు.
పెళ్లి తరువాత పార్టీ
పెళ్లి తరువాత పార్టీ ఒక రేంజ్‌లో ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలని ఆరాటపడే వారి సంఖ్య పెరుగుతోంది. డీజేతోపాటు సెలబ్రిటీ సింగర్స్‌తో నైట్ పార్టీ అదిరిపోయేలా ఉండాలని కోరుకుంటున్నారు. నిశ్చితార్థం, రిసెప్షన్ పార్టీల్లో ఫొటోలకు పోజులివ్వడంతో సరిపెట్టుకోవద్దని భావిస్తున్నారు. స్నేహితులు, కజిన్స్, బంధువులు ఎప్పటికీ మరిచిపోలేని విధంగా రిసెప్షన్ వేదికలను డ్యాన్స్ ఫ్లోర్‌లుగా మార్చాలని అనుకుంటున్నారు. ‘ఆఫ్టర్ పార్టీ’ గురించి ఆన్‌లైన్‌లో వెతికే వారి సంఖ్య 55 శాతం పెరగడం మారిన ట్రెండ్‌ను సూచిస్తోంది. ‘‘సాధారణంగా పెళ్లి వేడుక లేక రిసెప్షన్ తరువాత ఆఫ్టర్ పార్టీని ఏర్పాటు చేస్తుంటారు. సమయాన్ని బట్టి సాయంత్రం నుంచి రాత్రి పొద్దు పోయే దాకా ఉండేలా పార్టీ ప్లాన్ చేస్తారు. అతిథులు ఎంజాయ్ చేయడానికి ఈ పార్టీ తప్పనిసరి ఉండేలా చూసుకుంటున్నారు’’ అని శ్రీరామ్ ఈవెంట్స్ ఫౌండర్ దేవాంశి పటేల్ అంటున్నారు.
కొత్త రంగుల లోకం...
సాధారణంగా వెడ్డింగ్ వెన్యూని రకరకాల రంగుల్లో, థీమాటిక్‌గా డెకరేట్ చేస్తుంటారు. 2025లో దంపతులు కాబోయే వారు ఊదారంగుకు ఓటేస్తున్నారు. ఊదారంగు వెడ్డింగ్ డెకరేషన్స్ గురించి ఆన్‌లైన్‌లో వెతికే వారి సంఖ్య 129 శాతం పెరగడం వధూవరులు ఎలాంటి మార్పును కోరుకుంటున్నారో తెలియజేస్తోంది. అందుకే ఈ ఏడాదిని ‘పర్పుల్ ఇయర్’ అని పిలుస్తున్నారు వెడ్డింగ్ ప్లానర్స్. పెళ్లి కూతురు వేసుకునే లెహెంగా మల్టీ కలర్‌లో ఉండాలని కోరుకునే వారి సంఖ్య 30 శాతం పెరిగింది. ఇవన్నీ కొత్త ట్రెండ్‌ని సూచిస్తున్నాయి. సంప్రదాయ రంగుల స్థానంలో కొత్తరంగులకు ప్రాధాన్యం ఇస్తున్నారు వధూవరులు. ‘‘వెడ్డింగ్ డెకరేషన్‌లో మల్టిపుల్ కలర్స్ ఒక ఉల్లాసభరితమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. లేత, ముదురు రంగుల కలయిక సంతోషాన్ని పంచుతుంది’’ అని ‘ది డోలి డైరీ’ కో-ఫౌండర్ జినాల్ పటేల్ అన్నారు. డెకరేషన్ ఏ రంగులో ఉండాలనే విషయంలోనూ కపుల్స్ కొత్త పంథాను ఎంచుకుంటున్నారని వెడ్డింగ్ ప్లానర్స్ అంటున్నారు.
అతిథుల కోసం... సీటింగ్ చార్టులు...
పెళ్లికి వెళితే ఎక్కడ కుర్చీ ఖాళీగా ఉంటే అక్కడ కూర్చోవడం తెలిసిందే. అయితే ఇకనుంచి అలా కుదరకపోవచ్చు. ఎందుకంటే పెళ్లికి వచ్చే అతిథులందరికీ ముందుగానే సీటింగ్ అరేంజ్‌మెంట్ చేస్తారు. శుభలేఖతో పాటే సీటింగ్ అరేంజ్‌మెంట్‌కు సంబంధించిన కార్డును ఇస్తారు. అందులో సీటు నంబరు, పేరుతో సహా ఉంటుంది. ఈ గ్లోబల్ ట్రెండ్‌ను ఇండియన్ కపుల్స్ సైతం ఫాలో అవుతున్నారు. సీటింగ్ చార్టుల గురించి ఆన్‌లైన్‌లో వెతికే వారి సంఖ్య 22 శాతం పెరిగింది. అతిథులకు ఒక కొత్త, ప్రత్యేకమైన అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో సీటింగ్ చార్ట్ పద్ధతిని తీసుకొచ్చారు. అదేగాక పెళ్లికి ఎక్కడెక్కడి నుంచో బంధువులు, మిత్రులు వస్తారు. వారందరూ ఒక్కొక్కరు ఒక్కో చోట కూర్చోకుండా కలిసి కూర్చునేలా సీటింగ్ సెట్ చేయడానికి ఈ చార్టు ఉపయోగపడుతుంది.
అలా కూర్చోవడం వల్ల వాళ్ల అనుభవాలు, జ్ఞాపకాలను మిత్రులతో, బంధువులతో పంచుకుంటూ వేడుకను ఎంజాయ్ చేసేందుకు వీలు కలుగుతుంది. ‘‘సీటింగ్ చార్ట్‌ను పేర్లతో అందించడం ద్వారా ప్రతీ అతిథిని ‘మీరు మాకెంతో ముఖ్యమైన వారు’ అని సందేశం ఇచ్చినట్టుగా ఉంటుంది. అతిథులపై ప్రత్యేక శ్రద్ధ చూపించిన భావన కలుగుతుంది. వెస్ట్రన్ శైలి వెడ్డింగ్‌లో కనిపించే సీటింగ్ చార్ట్ పద్ధతి ఇండియాలోనూ పెరగడం మంచి పరిణామమే’’ అని వెడ్డింగ్ ప్లానర్, రేష్ అండ్ కో సంస్థ కో-ఫౌండర్ రేష్మా రామయ్య అంటున్నారు. కొంతమంది సీటింగ్ చార్టును శుభలేఖతో పాటు అందిస్తే, మరికొందరు వెన్యూ దగ్గర గాజు బాటిల్స్‌పై పేర్లను, టేబుల్ సంఖ్యను రాసి పెడుతున్నారు. మరికొన్ని చోట్ల బోర్డులు ఏర్పాటు చేసి పేర్లను రాసి పెట్టడం ద్వారా వేడుకను మరింత ఆకర్షణీయంగా మార్చుకుంటున్నారు.
కాన్వాస్‌పై పెళ్లి వేడుక
పెళ్లి వేడుకలో లైవ్ ఈవెంట్స్ ఉండేలా ప్లాన్ చేసుకునే వధూవరుల సంఖ్య పెరుగుతోంది. పెళ్లికి వచ్చిన అతిథుల చిత్రాలను అప్పటికప్పుడు వేసి ఇచ్చే ‘లైవ్ పెయింటర్’ను పెట్టడం అందులో ఒకటి. ఈ మధ్యకాలంలో ఏ వేడుకకు వెళ్లినా లైవ్ పెయింటర్ కనిపిస్తున్నాడు. వివాహ వేడుకను కాన్వాస్‌పై చూసుకోవాలనే కోరికను నెరవేర్చుకోవడానికి లైవ్ పెయింటర్ ట్రెండ్ ఉపకరిస్తోంది. ఈ యునీక్ క్రియేటివ్ ట్రెండ్ భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందని అంటున్నారు.
ఆహ్వానం కొత్తగా...
ఎప్పటిలాగే వివాహ వేడుకకు రమ్మని ఆహ్వానిస్తూ ఇచ్చే పెళ్లి పత్రికల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పటితరం ఇంకా కొత్తదనాన్ని కోరుకుంటోంది. థీమ్ బేస్డ్ ఇన్విటేషన్లకు ప్రాధాన్యం ఇస్తోంది. శుభలేఖలో వెడ్డింగ్ స్టోరీని చెప్పదలుచుకుంటున్నారు వధూవరులు. అందుకు అనుగుణంగా బ్రైడ్ థీమ్, బీచ్ థీమ్, బోర్డింగ్ పాస్ థీమ్, డోలి థీమ్, ఫ్లోరల్ థీమ్, గ్రూమ్ థీమ్, లోటస్, ప్యాలెస్ థీమ్... అంటూ కొన్ని వందల రకాల థీమ్‌లతో ఇన్విటేషన్ కార్డులను అందుబాటులోకి తెచ్చాయి వెడ్డింగ్ ఇన్నొవేటివ్ డిజైన్ సంస్థలు. ‘‘వినూత్నమైన డిజైన్లలో ఇన్విటేషన్ ఉండాలని కోరుకుంటున్నారు. ప్రత్యేకంగా కనిపించాలని, ఆకట్టుకునేలా ఉండాలని అడుగుతున్నారు. అందుకు తగ్గట్టుగా కొత్త ఫాంట్స్, ఇల్లస్ర్టేషన్స్‌తో డిజైన్ చేసి ఇస్తున్నాం’’ అని వెడ్డింగ్ ఇన్విటేషన్ డిజైనర్ ఇచ్చా తల్రేజా అంటున్నారు.
ఫస్ట్ లుక్... ప్రత్యేకం...
పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుంచి ప్రతీ క్షణాన్ని మధురమైనదిగా భావిస్తున్నారు వధూవరులు. ముఖ్యంగా వివాహ వేడుకకు ముందు వధూవరులు ఒకరినొకరు చూసుకునే మధురక్షణాలను కెమెరాలో బంధించాలనుకునే ట్రెండ్ పెరుగుతోంది. 2025లో ఫస్ట్ లుక్ ట్రెండ్ గురించి ఆన్‌లైన్‌లో వెదికిన వారి సంఖ్య 19 శాతం పెరిగింది. వివాహ వేడుక ప్రారంభానికి ముందు జరిగే ఫస్ట్ లుక్ వధూవరులకి స్పెషల్ మెమొరీని క్రియేట్ చేస్తుంది. వధూవరుల మధ్య ఒక ప్రత్యేకమైన, భావోద్వేగమైన క్షణంగా ఫస్ట్‌లుక్ నిలుస్తోంది. ఇద్దరి మధ్య ఒక ఎమోషన్‌ను క్రియేట్ చేస్తోంది. ‘‘ఫస్ట్‌లుక్ ఒక మధురమైన క్షణం. వధూవరులు భావోద్వేగ క్షణాన్ని పంచుకోవడానికి ఉపయోగపడుతుంది. వారి భావోద్వేగాలను కెమెరాలో బంధించే సమయం ఇది’’ అని ముంబైకి చెందిన ఎపిక్‌స్టోరీస్ ఫౌండర్, వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ హిమాంశు పటేల్ అంటారు.
వివాహ వేడుక డాక్యుమెంటరీగా...
ఎంగేజ్‌మెంట్, మెహందీ వేడుక, సంగీత్, హల్దీ వేడుక, ఫస్ట్ లుక్, వెడ్డింగ్, ఆఫ్టర్ పార్టీ.... ఇలా ప్రతి వేడుకలో తీసిన వెడ్డింగ్ ఫొటోలు, వీడియోలతో ప్రత్యేకంగా డాక్యుమెంటరీ రూపొందించుకోవాలని వధూవరులు కోరుకుంటున్నారు. సెలబ్రిటీలతో మొదలైన ఈ ట్రెండ్ సామాన్యులకూ చేరింది. ఇందులో కపుల్స్ ఇంటర్వ్యూలు, వధూవరుల తల్లిదండ్రులు, స్నేహితులు, తోబుట్టువుల అభిప్రాయాలతో డాక్యుమెంటరీ ఉండాలని భావిస్తున్నారు. 2025లో ‘వెడ్డింగ్ డాక్యుమెంటరీ’ ట్రెండ్‌ను క్రియేట్ చేస్తుందని వెడ్డింగ్ ప్లానర్స్ అంటున్నారు. ‘‘వెడ్డింగ్ డాక్యుమెంటరీ సినిమాటిక్ స్టోరీ కాదు. అభూతకల్పనలు ఉండవు. వధూవరుల రియల్ స్టోరీ. వివాహ వేడుకలో జరిగినదాన్నే చూపిస్తారు. వివాహ వేడుక అంటే చిన్న విషయం కాదు. ఎంతోమంది, ఎన్నో పనులు చక్కబెడితే కానీ పూర్తి కాదు. అప్పగింతల సమయంలో కుటుంబసభ్యుల భావోద్వేగాలు, బారాత్‌లో డ్యాన్స్, బూట్లు దొంగిలించే ఆచారం, సంప్రదాయాలు, పాటలు... ఇలా ప్రతిదీ డాక్యుమెంటరీలో చూడొచ్చు. ఇది వధూవరుల కుటుంబాలకు ఒక మరిచిపోలేని అనుభూతిని అందిస్తుంది’’ అని అంటారు ఫొటోగ్రఫీ సేవలు అందించే నాటింగ్ బెల్స్ సంస్థ కో-ఫౌండర్ రాజేష్ సతంకర్.
నలుపు మంచిదే!
శుభకార్యాల సమయంలో నలుపు రంగు దుస్తులు ఽధరించకూడదని పెద్దలు చెబుతుంటారు. కానీ ట్రెండ్ మారుతోంది. పెళ్లికూతుళ్లు నలుపు రంగు దుస్తులు ధరించి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. బ్లాక్ లెహెంగా గురించి ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసే వారి సంఖ్య 22 శాతం పెరగడం మారిన ట్రెండ్‌ను సూచిస్తోంది. సంప్రదాయాన్ని కాసేపు పక్కకు జరిపి నచ్చినవి ధరించేందుకు సిద్ధమవుతున్నారు ఈతరం వధూవరులు. ముఖ్యంగా కాక్‌టెయిల్, సంగీత్ నైట్స్‌లో నలుపు దుస్తులకు సై అంటున్నారు. వెడ్డింగ్ కోసం బ్లాక్ లెహెంగా ధరించవచ్చా? అని చాలామంది నెట్‌లో సెర్చ్ చేస్తున్నా, ప్రీవెడ్డింగ్ పార్టీలు, కాక్‌టెయిల్ నైట్స్ వరకే పరిమితమవుతున్నారు. అయితే తొందరలోనే పెళ్లి రోజు కూడా బ్లాక్ లెహెంగా కనిపించే రోజులు కూడా రావొచ్చేమో.
ల్యాబ్ డైమండ్స్‌కి సై...
పెళ్లికి ధరించే ఆభరణాల విషయంలోనూ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. బంగారు ఆభరణాల స్థానంలో డైమండ్స్‌ని ఎంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు చాలామంది. అయితే ఈ డైమండ్స్ ల్యాబ్‌లలో తయారుచేసినవి. మనదేశంలో ఈ తరహా డైమండ్స్‌కి ఇప్పుడు బాగా గిరాకీ ఉంది. 2024లో ల్యాబ్‌లో తయారయ్యే డైమండ్స్ గురించి వెదికే వారి సంఖ్య 174 శాతం పెరగడం మార్పును సూచిస్తోంది. బడ్జెట్‌పై అవగాహన ఉన్న కపుల్స్ ఈ తరహా డైమండ్స్‌ని ఎంచుకుంటున్నారు.
పాత ట్రెండ్‌కు కొత్త రూపం...
పాత ట్రెండ్ అనుకున్నవి మళ్లీ కొత్తరూపుతో తిరిగి రావడాన్ని చూస్తూనే ఉంటాం. ‘టోయ్ ఎట్ మోయ్’ కూడా అలాంటిదే. 18వ శతాబ్దంలో ట్రెండ్‌ని క్రియేట్ చేసిన టోయ్ ఎట్ మోయ్ ఇప్పుడు మళ్లీ ట్రెండ్‌గా మారుతోంది. టోయ్ ఎట్ మోయ్ అంటే ఫ్రెంచ్ భాషలో ‘నువ్వు-నేను’ అని అర్థం. ఒకప్పుడు ప్రసిద్ధ వ్యక్తులు ధరించిన ఈ ఉంగరాలను ఇప్పుడు అదితీరావుహైదరీ వంటి సెలబ్రిటీలు ధరించేందుకు ఇష్టపడుతున్నారు. సెలబ్రిటీలు నిశ్చితార్థపు ఉంగరంగా ‘టోయ్ ఎట్ మోయ్’ని ధరిస్తున్నారు. రెండు ఆత్మల కలయికను సూచించే విధంగా ఉంగరం ఉండటం ప్రత్యేకత. ఈ ఉంగరం గురించి ఆన్‌లైన్‌లో వెతికే వారి సంఖ్య ఇటీవల 49 శాతం పెరిగింది.
పోల్కీ నగలకు పెద్ద పీట
పోల్కీ జ్యువెలరీ అంటే కట్ చేయని, పాలిష్ చేయని ఆభరణం. ఎలాంటి ఫిజికల్, కెమికల్ ట్రీట్‌మెంట్ లేకుండా నేచురల్ డైమండ్స్‌తో తయారుచేసినవి. ఒరిజినల్ రఫ్ వెర్షన్‌లోనే డైమండ్స్ ఉంటాయి. నిజానికి ఈ డైమండ్స్ ఖరీదైనవి. ఒక్కో డైమండ్ ఒక్కో రీతిలో ఉంటుంది. వాటన్నింటిని కలిపి ఆభరణాలు తయారుచేస్తారు. ఈ మధ్యకాలంలో పోల్కీ జ్యువెలరీ గురించి సెర్చ్‌చేసే వారి సంఖ్య 234 శాతం పెరిగింది. మెహందీ వేడుకలో సోనమ్ కపూర్ పోల్కీ జ్యువెలరీనే ధరించారు. ప్రియాంక చోప్రా ఫెరా, హల్దీ వేడుకల్లో ఈ ఆభరణాలతోనే మెరిసిపోయారు. అనుష్కశర్మ, నేహాధూపియాలు వారి పెళ్లిరోజు పోల్కీ జ్యువెలరీనే ధరించారు. ముకేష్ అంబానీ కోడలు రాధికా మర్చంట్ సైతం రకరకాల పోల్కీ పీసెస్ ధరించి ఆకట్టుకున్నారు. హల్దీ వేడుకలో ఆమె పోల్కీ నెక్లెస్ ధరించారు. అంబానీ పెళ్లి వేడుకకు వచ్చిన సెలబ్రిటీల్లో చాలా మంది పోల్కీ ఆభరణాలతో తళుక్కుమన్నారు. మొత్తంగా భారతీయ వివాహ వేడుకల్లో కళ్లు చెదిరే పెళ్లి‘కళ’ కళకళలాడుతూ అందర్నీ ఇట్టే కట్టిపడేస్తోంది.
- సండే డెస్క్
Updated Date - Feb 16 , 2025 | 10:32 AM