పుల్లమామిడితో తియ్య పానీయం
ABN, Publish Date - Feb 16 , 2025 | 12:36 PM
మామిడిపండుని పండ్లలో రారాజుని చేసింది దాని మధురసమే! వసంత సారం మధుదూత ఇలా పిలుస్తారు దీన్ని. బహు ళత్వానికి ప్రతీక మామిడి. ప్రేమకు, స్త్రీపురుష బంధానికి, ఫలదీకరణానికి, దాంపత్యసుఖానికి, లైంగిక సమర్థతకు మామిడి ఒక సంకేతం.
‘‘పండుకు వృక్షము పరులెవ్వరూ కారు
పరమాత్ముడనె ఆకుపైనుండు పండు
పండు యెనుబదినాల్గు పర్వములై యుండు
ఒరులకు యీపండు వశముగాకుండు
తియ్యని మామిడిపండు, పండు
తినబోతె దొరకదు తీపులుమెండు’’ (జానపదగీతం)
మామిడిపండుని పండ్లలో రారాజుని చేసింది దాని మధురసమే! వసంత సారం మధుదూత ఇలా పిలుస్తారు దీన్ని. బహు ళత్వానికి ప్రతీక మామిడి. ప్రేమకు, స్త్రీపురుష బంధానికి, ఫలదీకరణానికి, దాంపత్యసుఖానికి, లైంగిక సమర్థతకు మామిడి ఒక సంకేతం. రుగ్వేదంలో మామిడిని ‘సహ’ అన్నారు. సంస్కృతంలో సహరాః అంటే మామిడి. సహవాసానికి (స్నేహానికి), సౌహార్ద్రతకు సంబంధించింది ఈ సహర. సహర ఫలాన్నే సహకారఫలం అని మన కవులు కీర్తించారు.
మూలద్రావిడ భాషలో ‘మా’ అంటే మామిడి. 3,000 ఏళ్ల క్రితం ద్రావిడ భాషల్లోంచి రూపొందిన మూలతెలుగు (ప్రోటో తెలుగు) భాషలో కూడా ‘మా’ అనే పిలిచారు. మా చెట్టు యొక్క కాయ ‘మాకాయ’ లేదా ‘మాగాయ’; ‘మాంగాయ’. కాలక్రమంలో ఈ ‘మా’ అనే పేరు తెలుగులో ‘మావి’ అయ్యింది. ‘మావి రూపాలే మావిడి-మామిడి’ అని తెలుగు ఎటిమాలజీ నిఘంటువు పేర్కొంది. క్రీ. శ. 1510లో పోర్చుగీసులు మన మాంగాయని ‘మాంగో’ అన్నారు. ఇంగ్లీషువాళ్లూ దాన్నే స్వీకరించారు. ‘ఓ’ అనే అక్షరంతో అంతమయ్యే ఇంగ్లీషు పదాలు తక్కువ కాబట్టి మాంగో భారతీయ పదమేనని నిర్ధారించారు.
దేవుడికి నైవేద్యం పెట్టి, ఒక ముత్తైదువకు బొట్టు పెట్టి, మామిడిపండు చేతిలో పెట్టాకే ఇంట్లో మామిళ్లు తినటం తెలుగు సంస్కృతి. ఏ పండుకీ ఇంతటి గౌరవం లేదు. పీచం అంటే గర్వం. మామిడి గర్వానికి దాని పీచు ముఖ్య కారణం. మామిడిలోని పీచు వలనే అది అనేక రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. సమాన గుణధర్మాలు కలిగిన ద్రవ్యాలు సమాన గుణ ధర్మాలను పెంచుతాయని సిద్ధాంతం. మామిడి పండు రంగుని ఇండియన్ ఎల్లో అంటారు. మేలిమి బంగారు ఛాయని శరీరానికి కల్గించే శక్తి కూడా మామిడిపండుకి ఉంది. దీనికి రుచ్యం అంటే రుచిని పెంచే గుణం కూడా ఉంది. రక్త వృద్ధినిస్తుంది. కండరాలను బలసంపన్నం చేస్తుంది. ఇమ్యూనిటీ బూస్టర్ ద్రవ్యాలలో మామిడి ఒకటి. గొంతు రోగాలకు ఇది మంచి ఔషధం కూడా! మావి చిగురు తినగానే కోయిల పలికేది అందుకే!
మామిడి వ్యాపారులు కృత్రిమ పద్ధతులతో మామిడిపండులోని సహజ మాధుర్య లావణ్యాలను పాడుచేస్తున్నారు. ఆమ్రరసాలు సహజమైన తీపిని కోల్పోయి ఆమ్లరసాలుగా మారిపోతున్నాయి. పట్టించుకోని ప్రభుత్వాలకు ప్రజారోగ్యం మొదటి ప్రాధాన్యం కాదు కదా!
మామిడి షర్బత్తు: మామిడిలోని మాధుర్యాన్ని మరింత ఆస్వాదించటానికి మామిడిపానకం (షర్బత్తు) ఓ మంచి ఉపాయం. పచ్చిమామిడి కాయలు కొనుక్కొని ఇంట్లో గాలి తగలకుండా ఒక పక్కన ఉంచితే చక్కగా పండుతాయి. ఈ మామిడి పండు రసం పిండి, పంచదార, యాలకులపొడి, లవంగాలు అల్లం తగుపాళ్లలో చేర్చి అన్నీ కలిసేలా మిక్సీపట్టి ఫ్రిజ్జులో పెట్టుకుని చల్లగా తాగండి. బలకరం, వడదెబ్బ తగలనీయదు.
పచ్చి మామిడికాయతోనూ పానకం చేసుకోవచ్చు. రెండు కాయల్ని నీళ్లలో వేసి ఉడికించండి. బాగా ఉడికిన తరువాత ఇవతలకు తీసి చేత్తో పిసికి గుజ్జు పిండండి. కాచి చల్లార్చిన పాలు, పాలకు సమానంగా నీళ్లు, తగినంత పంచదార కలిపి బాగా మిక్సీ పట్టండి. ఈ మిశ్రమంలో యాలకులపొడి, లవంగాలపొడి, మిరియాలపొడి కలుపుకుంటే ఈ పానకం తియ్యగా, పుల్లగా కారంగా ఘాటుగా కమ్మగా ఉంటుంది. వాతవ్యాధులున్నవారికి అకారణంగా వచ్చే నడుం నొప్పి, కాళ్ల నొప్పులు, మైగ్రేన్ తలనొప్పి లాంటి వాటికి ఔషధంగా ఉపయోగ పడుతుంది. కఫాన్ని హరిస్తుంది.
తెలుగు నేలమీద వాన వచ్చిన రోజే వానాకాలం. చలి వేసిన రోజు చలికాలం. మిగతాదంతా వేసవే కాబట్టి, మామిడి షర్బత్తు ఎప్పుడూ అవసరం పడ్తూనే ఉంటుంది మనకి! 365 రోజులూ మామిళ్లు మార్కెట్లకు వస్తూనే ఉన్నాయి కదా!
- డా. జి వి పూర్ణచందు, 94401 72642
Updated Date - Feb 16 , 2025 | 12:36 PM