Viral News: ఇదేం కంపెనీ రా బాబు..పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగానికి రాజీనామా చేయాలా..
ABN, Publish Date - Feb 25 , 2025 | 11:53 AM
పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగానికి రాజీనామా చేయండి అంటూ ఓ కంపెనీ తన ఉద్యోగులకు అల్టిమేటం జారీ చేసింది.1,200 మంది ఉద్యోగులకు హెచ్చరిక నోటీసులు పంపింది.
లేటు వయసులో పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. తమ కాళ్లపై తాము నిలబడి ఉన్నత స్థానాలకు ఎదగాలని కొంత మంది పెళ్లిని వాయిదా వేస్తూ వస్తూంటే ఇంకొంత మంది మాత్రం తమ స్వేచ్ఛకు ఇబ్బంది కలుగుతుందని అసలు పెళ్లి చేసుకోవడానికే ఇష్టపడటం లేదు. అయితే, పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగానికి రాజీనామా చేయండి అంటూ ఓ కంపెనీ తన ఉద్యోగులకు అల్టిమేటం జారీ చేసింది. దీంతో ఆ ఉద్యోగులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.
1,200 మంది ఉద్యోగులకు నోటీసులు
చైనాకు చెందిన షాన్‌డాంగ్ షుంటియన్ కెమికల్ గ్రూప్ కో. లిమిటెడ్ అనే కంపెనీ తన అవివాహితులు, విడాకులు తీసుకున్న ఉద్యోగులకు దిగ్భ్రాంతికరమైన అల్టిమేటం జారీ చేసింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి వివాహం చేసుకోకపోతే వారిని లేఆఫ్ చేస్తామని బెదిరించింది. 28 నుంచి 58 ఏళ్ల మధ్య వయస్సు గల 1,200 మంది ఉద్యోగులకు కంపెనీ హెచ్చరిక నోటీసులు పంపింది, వారు నిర్ణీత గడువులోపు వివాహం చేసుకోవాలని సూచించింది.
మార్చి నాటికి వివాహం చేసుకోని ఉద్యోగులు వారు ఎందుకు అలా ఉంటున్నారో లేఖ సమర్పించాలని, జూన్‌లో మూల్యాంకనం ఎదుర్కోవాలని, సెప్టెంబర్ నాటికి ఇంకా అవివాహితులుగా ఉంటే ఉద్యోగం తొలగిపోయే ప్రమాదం ఉందని తెలిపింది. దీంతో ఆ ఉద్యోగులు ఒక్కసారిగా అవాక్కైయ్యారు. కంపెనీ ఇచ్చిన నోటీసుపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
ఇదేం కంపెనీ రా బాబు..
చాలామంది దీనిని వ్యక్తిగత స్వేచ్ఛపై ఉల్లంఘనగా పేర్కొంటున్నారు. అయితే, ఉద్యోగులలో సామాజిక స్థిరత్వం, బాధ్యతను ప్రోత్సహించడమే ఈ చర్య లక్ష్యం అని కంపెనీ వివరించింది. కానీ, ఇటువంటి చర్యలు అనైతికమైనవని, వివక్షతతో కూడుకున్నవని విమర్శకులు వాదిస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం ఇదేం కంపెనీ రా బాబు.. పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగానికి రాజీనామా చేయాలా అంటూ స్పందిస్తున్నారు.
Also Read: శాంసంగ్ ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్.. మార్కెట్లోకి విడుదల ఎప్పుడంటే..
Updated Date - Feb 25 , 2025 | 12:28 PM