SATA: సౌదీలో ఇద్దరు ఆంధ్రులను ఆదుకున్న మానవతామూర్తులు
ABN, Publish Date - Feb 04 , 2025 | 10:36 PM
సౌదీలో చిక్కుకుపోయిన ఇద్దరు ఆంధ్రులను సాటా సంఘం సభ్యులు సురక్షితంగా స్వదేశానికి చేర్చారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సువిశాల దేశంలో ఇద్దరు ఆంధ్రులు.. రెండు వేర్వేరు నగరాలలో ఏళ్ళ తరబడి పని చేస్తూ తమ ప్రవాస చివరి అంకంలో అనారోగ్యానికి గురయి అచేతనావస్థలో నడువలేని స్థితిలో స్వదేశానికి వెళ్ళడానికి సంవత్సర కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. సౌదీ అరేబియా ప్రభుత్వ ఉదారశీల విధానం, ప్రవాసీ తెలుగు సంఘం సాటా సేవా రీతి వలన ఆ ఇద్దరు ఇటీవల మాతృభూమికు చేరుకున్నారు (NRI).
NRI: ఖతర్ ప్రవాసీ భారతీయ సంఘాల ఎన్నికలలో తెలుగు తమ్ముళ్ల తంటాలు
పశ్చిమ గోదావరి జిల్లా అచంటకు చెందిన మామిడిశెట్టి సుజాత అనే మహిళ బతుకుతెరువు కోసం సౌదీ అరేబియాకు వచ్చి తెలంగాణకు చెందిన ఒక దళారీ చేతిలో మోసపోయి గత అయిదేళ్ళుగా అనేక కష్టాలు ఎదుర్కొంది. మూడు సంవత్సరాలు ఎలాగొలా నెట్టుకొచ్చిన అమె యజమానితో విభేదాలు రావడంతో చివరకు పారిపోయింది. తెలిసిన అనేక ఇళ్ళలో పాచిపనులు చేస్తుండగా ఆమె ఆరోగ్యం క్రమేణా క్షీణించింది. మరో వైపు తన వద్ద నుండి పారిపోయినందుకు అమె పై యజమాని హురూబ్ ఆంక్ష విధించడంతో ఆమె దేశం విడిచి వెళ్ళలేక విలవిల్లాడింది. రెండు సంవత్సరాలుగా భారతీయ కాన్సులేటు చుట్టూ తిరిగింది, తనను మోసగించిన జాడి మల్లేశం అనే దళారీని నిలదీసినా ప్రయోజనం లేకపోయింది. అనారోగ్యంతో నడువలేని స్ధితిలో ఉన్న సుజాతకు సాటా జెద్ధా ప్రతినిధులు శివ సైమన్ పీటర్, సాటా అధ్యక్షుడు మల్లేషన్ ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నారు. ఈ లోపు సౌదీ అరేబియా అధికారులు హురూబ్ ఆంక్ష ఉన్న విదేశీయులు స్వదేశాలకు తిరిగి వెళ్ళడానికి ఉదార విధానాన్ని అవలంబించడంతో ఆమె తిరిగి వెళ్ళడానికి మార్గం సుగమమైంది. శివ ఆమెను భారతీయ కాన్సులేట్ సహాయంతో సౌదీ అరేబియా అధికారుల వద్దకు తీసుకెళ్ళి ఎగ్జిట్ ప్రక్రియను పూర్తి చేయించారు. ఆమె ప్రయాణానికి అవసరమైన విమాన టిక్కెట్టు, తాత్కాలిక వైద్య ఖర్చుల నిమిత్తం కొంత ఆర్థిక సహాయం అందించి ఆమెను స్వదేశానికి పంపించగా ఆమె మంగళవారం స్వస్థలానికి చేరుకొంది.
BATA: అంగరంగ వైభవంగా ‘బాటా’ సంక్రాంతి సంబరాలు!
మరో వైపు ఈశాన్య ప్రాంతంలో పని చేసే తూర్పు గోదావరి జిల్లా పీఠాపురం మండలం జమలపల్లి గ్రామానికి చెందిన పెద్దింటి పుల్లా రెడ్డి ఎలక్ట్రికల్ లేబర్‌గా సుదీర్ఘకాలంగా పని చేస్తున్నాడు. కంపెనీ ఆర్థిక పరిస్థితి కారణంగా అందులో పని చేస్తున్న అనేక మందికి వేతనాలు సకాలంలో చెల్లించలేదు. ఇలా జీతాలు అందని వారిలో పుల్లా రెడ్డి ఒకరు. ఈ రకంగా అతనికి గత ఎనిమిది నెలల వేతన బకాయిలు రావాల్సి ఉందని సాటా ప్రతినిధి రాంరెడ్డి తెలిపారు. 8 నెలల బకాయి వేతనంతో పాటు 16 సంవత్సరాల కాలానికి రావల్సిన ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్ కోసం పుల్లా రెడ్డి గత సంవత్సర కాలంగా తిరిగి విసిగిపోయినా ప్రయోజనం లేకుండాపోయింది. కంపెనీలో అందరితో పాటు కలిసి ఆయన న్యాయస్థానంలో తన బకాయిల కోసం కేసును కూడా దాఖలు చేయగా న్యాయస్థానం కార్మికుల పక్షాన తీర్పు ఇచ్చింది. అయినా కంపెనీ డబ్బులు చెల్లించలేదని రాంరెడ్డి అన్నారు. వీటన్నింటికీ తోడుగా రాంరెడ్డి అఖమా గడువు ముగిసి కూడా సంవత్సరమవుతున్నా దాన్ని రెన్యువల్ చేయలేకపోవడంతో అతను తన అభీష్టానికి విరుద్ధంగా అక్రమవాసిగా మారిపోయాడు. వీసాతో ముడిపడి ఉన్న బ్యాంకు ఖాతా కూడ స్తంభించిపోయింది. పుల్లారెడ్డి పరిస్ధితిపై జాలిపడ్డ రాంరెడ్డి గత మూడు నెలలుగా వివిధ రకాలుగా ప్రయత్నాలు చేసి న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయించి ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్‌ను ఇప్పించడమే కాకుండా ఆగిపోయిన ఎగ్జిట్ ప్రక్రియను కూడా పూర్తి చేసారు. పుల్లారెడ్డికి విమాన టిక్కెట్ సాటా సభ్యులు సమకూర్చినట్లుగా రాంరెడ్డి, మల్లేషన్, తేజ తెలిపారు. అదే విధంగా అంతకు ముందు నిజామాబాద్ జిల్లాకు చెందిన చందుల గంగాధర్ అనే కార్మికునికి కూడా సహకరించి స్వదేశానికి పంపించనట్లుగా వారు పేర్కొన్నారు.
Updated Date - Feb 04 , 2025 | 10:37 PM