Share News

NRI: ఖతర్ ప్రవాసీ భారతీయ సంఘాల ఎన్నికలలో తెలుగు తమ్ముళ్ల తంటాలు

ABN , Publish Date - Jan 30 , 2025 | 01:24 PM

ఖతర్‌లో ప్రముఖ ప్రవాసీ సంఘాలకు సంబంధించిన శుక్రవారం జరుగనున్న ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో తెలుగు ప్రవాసీయుల పాత్ర మాత్రం పరిమితంగానే ఉందన్న వ్యాఖ్య. డబ్బు చెల్లించి సంఘాలలో సభ్యత్వ నమోదు తీసుకునే వారి సంఖ్య తక్కువగా ఉన్నది.

NRI: ఖతర్ ప్రవాసీ భారతీయ సంఘాల ఎన్నికలలో తెలుగు తమ్ముళ్ల తంటాలు

  • ప్రజాక్షేత్రంలో పత్తా లేని డిజిటిల్ నాయకులు - పేరు గొప్ప ఊరు దిబ్బ

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: ఖతర్‌లో ప్రవాసీ భారతీయులకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే మూడు సంఘాలకు సంబంధించిన శుక్రవారం జరుగనున్న ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. బరిలో ఉద్దండులు ఉండంతో ఉత్కంఠ రేపుతూ భారతదేశంలో లోక్ సభ ఎన్నికలను మరిపిస్తున్నాయి (NRI).

గల్ఫ్ దేశాల కూటమిలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఖతర్‌లో మాత్రమే భారతీయ ఎంబసీ ఆధ్వర్యంలో ప్రజా స్వామ్యబద్ధంగా ఐ.సి.బి.యఫ్, ఐ.సి.సి. ఐ.యస్.సి అనే సంక్షేమ, సాంస్కృతిక, క్రీడల సంఘాలకు జరుగుతున్న పోటీలో అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతూ గంటలు సమీపిస్తున్న కొద్దీ ఓట్ల వేటను ముమ్మరం చేసారు.

ఈ మూడు సంఘాలలో కార్మికుల సంక్షేమానికి పని చేసే ఐ.సి.బి.యఫ్‌కు ప్రాముఖ్యత ఉండగా ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు చేసే ఐ.సి.సి, క్రీడలను ప్రొత్సహించే ఐ.యస్.సిలలో కూడా చోటు కొరకు ఎన్నికల గోదాలో ఉన్నారు. ఐ.సి.బి.యఫ్‌కు రెండవ పర్యాయం కూడా తాను అధ్యక్ష పదవి చేపట్టాలని షానవాస్ బావా అనే మలయాళీ ప్రముఖుడు కసరత్తు చేస్తుండగా ఐ.సి.సికి ముచ్చటగా మూడో సారి పోటీలో ఏపీ మణికంఠన్ ఉన్నారు. విజయం ఎవరికి వరిస్తుందో ఎన్నికలు పూర్తయిన తర్వాత గానీ తెలియదు.


NRI : అమెరికాలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించిన వక్తలు

పేరుకు భారతీయులందరు ఈ మూడు సంఘాలలోను ఉన్నా అందులో మొత్తం పెత్తనం మాత్రం మలయాళీలది కావడంతో తెలుగు వారితో సహా మిగిలిన వారందరు కూడా మలయాళీల మద్దతుతో మాత్రమే పోటీలో ఉన్నారు.

ఖతర్‌లో సంఖ్యా పరంగా మలయాళీల తర్వాతి స్థానంలో తెలుగు రాష్ట్రాల ప్రవాసీయులు ఉన్నారు. దానికి తగినట్లుగా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా అందులో ఉచిత భోజనం ఉంటే వందల సంఖ్యలో ఈగలుగా వాలే తెలుగు ప్రవాసీయులు సభ్యత్వ రుసుం చెల్లించి మాత్రం ఈ సంఘాలలో సభ్యత్వ తీసుకోవడానికి ముందుకు రారు. దీంతో ఈ మూడు సంఘాలలోని ఓటర్ల జాబితాలో తెలుగు వారి సంఖ్య మలయాళీలతో పోల్చితే అసలు పరిగణలోకి రాదు. అయినా ఫెస్ బుక్, వాట్సప్ గ్రూప్ లలో మాత్రం ఉచిత డాటాతో ఒక్క ఖతర్ ఏమి యావత్తు ప్రపంచాన్ని ఉద్దరిస్తున్నట్లుగా తెలుగు ప్రవాసీయుల పోకడలు ఉంటాయి. ఎప్పటికి బిర్యానీ దస్తర్లకు మాత్రమే పరిమితమయ్యే హైదరాబాదీ భయ్యాలు ఈ మొత్తం తతంగానికి దూరంగా తమ లోకంలో తామున్నారు.

వాస్తవానికి ఈ మూడు సంఘాలలో భారతీయులందరికీ ప్రవేశార్హత ఉన్నా సభ్యత్వ రుసుం చెల్లించడానికి ఇష్టపడకపోవడంతో తెలుగు ఓటర్ల సంఖ్య ఆశించిన విధంగా అభివృద్ధి కావడం లేదు. ఖతర్ ప్రవాసీ సమాజంలో ప్రాబల్యం కోసం ఈ సారి కొందరు నూతన సభ్యత్వాలను తమ స్వంత డబ్బుతో చేర్పించడం ముదావహం కానీ గెలుపు ఓటమిలను ప్రభావితం చేసే స్థాయిలో అది జరగలేదని సమాచారం.


H-1b Registrations: హెచ్-1బీ రిజిస్ట్రేషన్స్‌లో 38 శాతం మేర తగ్గుదల!

దీంతో మలయాళీలను మచ్చిక చేసుకుని వారి ప్యానళ్ళలో ప్రవేశం పొంది వారి మద్దతు ద్వార మాత్రమే ఒక్కొక్కరు ఒక మార్గం గుండా ఎన్నిక కాలుగుతున్నారు.

తెలుగు సమాజంలో పెద్ద మనుషులుగా చలామణీ అవుతూ పదవులు ఇప్పిస్తామంటున్న వారు సైతం జేబు నుండి ఒక్క రియాల్ వెచ్చించి జీవితంలో ఒక సభ్యత్వం ఇప్పించలేదనే విమర్శలు ఉన్నాయి.

ఈ సారి బరిలో ఉన్న అబ్బగోని నందిని, ఖాజా నిజామోద్దీన్, ప్రవీణ్ బుయ్యాని ముగ్గరు కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కావడం విశేషం కాగా ఈ ముగ్గురు వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రచారం చేస్తుండడం ఆసక్తి కల్గిస్తోంది. వీరికి తోడుగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దీపక్ చుక్కల కూడా ఐ.యస్.సిలో స్థానం కోసం విజయ ధీమాపై ఉన్నారు. శుక్రవారం విజయం ఎవరిని వరించినా ఖతర్‌లోని తెలుగు ప్రవాసీ సమాజానికి నిర్మాణాత్మక దిశలో సేవ చేస్తారని ప్రవాసీయులు ఆశిస్తున్నారు.

Read Latest and NRI News

Updated Date - Jan 30 , 2025 | 01:25 PM