Barbie: మగువా... నీకుంది ఆ తెగువ
ABN, Publish Date - Mar 08 , 2025 | 06:20 AM
సునీతా విలియమ్స్‌లా ఆకాశాన్ని అందుకోగలదు. మలాలలా ప్రపంచాన్ని కదిలించగలదు. కట్టుబాట్లను కాదని... వివక్షను దాటి... అవమానాలకు తట్టుకొని... అత్యున్నత శిఖరాలను చేరిన వనితలు ఎందరో. అలాంటి అసాధారణ మహిళల విజయాలను స్మరిస్తూ...
మహిళ ఒక చైతన్య దీప్తి. ఆదిపరాశక్తి. సునీతా విలియమ్స్‌లా ఆకాశాన్ని అందుకోగలదు. మలాలలా ప్రపంచాన్ని కదిలించగలదు. కట్టుబాట్లను కాదని... వివక్షను దాటి... అవమానాలకు తట్టుకొని... అత్యున్నత శిఖరాలను చేరిన వనితలు ఎందరో. అలాంటి అసాధారణ మహిళల విజయాలను స్మరిస్తూ... వారి ప్రస్థానాన్ని భావితరాలకు పరిచయం చేస్తూ... ‘అనుకొంటే ఏదైనా సాధించగలవు’ అంటూ స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తుంటుంది ప్రముఖ సంస్థ ‘బార్బీ’. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని... ఈసారి వివిధ రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్న ఐదుగురు భారతీయుల బొమ్మలను మార్కెట్‌లోకి విడుదల చేసింది.
వీరిలో భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ప్రముఖ గాయని నీతి మోహన్, ఫ్యాషన్ డిజైనర్ అనామికా ఖన్నా, ముంబయి చెఫ్ బీనా నోరోన్హా, ఫైర్ ఫైటర్ మేఘనా సక్పాల్ ఉన్నారు. వీరంతా తమ తమ రంగాల్లో తమదైన ముద్ర వేశారు. లక్ష్యం ఎంత పెద్దదైనా, అవరోధాలు, అసమానతలు ఎన్ని ఎదురైనా అనుకున్నది సాధించి చూపించారు. యువతరానికి ప్రేరణగా నిలిచారు.
హర్మన్‌ప్రీత్ కౌర్:
భారత మహిళల క్రికెట్ జట్టు సారథి. సమర్థవంతమైన నాయకత్వంతో దేశంలో మహిళా క్రికెట్‌కు అరుదైన విజయాలు అందించింది. అనితరసాధ్యమైన బ్యాటింగ్‌తో రికార్డులెన్నో తిరగరాసింది. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం, జట్టును ప్రభావవంతంగా నడిపించడంలో ప్రత్యేకత చాటుకున్న హర్మన్... ఔత్సాహిక మహిళా అథ్లెట్లకు స్ఫూర్తిమంత్రం.
నీతి మోహన్:
భారతీయ సంగీత పరిశ్రమలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్న గాయని నీతి మోహన్. రియాలిటీ షో కంటెస్టెంట్ నుంచి దేశం గర్వించదగ్గ గాయనిగా ఎదగడం వరకు... ఆమె ప్రతి మజిలీ ప్రేరణ కలిగిస్తుంది. వృత్తిపట్ల అంకితభావం... ఎంతటి క్లిష్టమైన స్వరమైనా అలవోకగా పలికించగలగడం... ఇవే నీతి మోహన్‌ను భిన్నమైన గాయనిగా తీర్చిదిద్దాయి.
మేఘనా సక్పాల్:
ఆమె కుటుంబంలో మూడోతరం ఫైర్ ఫైటర్. మగవారికే పరిమితమనుకున్న ఈ వృత్తిని చేపట్టిన ఆమె సాహసానికి మహిళా లోకం సలాం చేస్తోంది. విధుల నిర్వహణలో అంకితభావం, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా వెనుతిరగని నైజం చూస్తుంటే... అతివకు అసాధ్యమనేది లేదని చెబుతోంది.పట్టుదలగా ప్రయత్నిస్తే ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపిస్తోంది.
అనామికా ఖన్నా:
దేశంలోనే ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరు అనామికా ఖన్నా. భారతీయ సంప్రదాయ వస్త్రధారణలోని గొప్పదనాన్ని చాటుతూనే... వినూత్న డిజైన్లతో ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆకర్షించిన ఘనత ఆమెది. వస్త్రశ్రేణుల్లో విలక్షణత, చేసే పనిలో నిబద్ధత, అద్భుతమైన కళాచతురత... ఫ్యాషన్ రంగంపై అనామికాది చెరగని ముద్ర.
బీనా నోరోన్హా:
స్కార్లెట్ హౌస్, లైలా, గిగీ తదితర ముంబయిలోని ప్రసిద్ధ రెస్టారెంట్లకు హెడ్ చెఫ్‌గా వ్యవహరిస్తోంది బీనా నోరోన్హా. స్కార్లెట్ హౌస్’ బాలీవుడ్ భామ మలైకా అరోరా, ఆమె తనయుడు అర్హన్‌ఖాన్ కలిసి ఏర్పాటు చేసిన రెస్టారెంటు. ఈ రెస్లారెంట్లలో సంప్రదాయ భారతీయ వంటకాలకు పాశ్చాత్య హంగులు అద్ది విభిన్నంగా వడ్డిస్తోంది బీనా. తద్వారా మన రుచులను ప్రపంచ దేశాల అతిథులకు పరిచయయం చేస్తోంది. ఆతిథ్య రంగంలోకి రావాలనుకొనే మహిళలకు ఆమె ప్రయాణమే పెద్ద ప్రేరణ.
ఇవి కూడా చదవండి...
Also Read: వేయించిన తెల్ల నువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే ఇన్ని ప్రయోజనాలా..
Also Read: తమిళనాడు సీఎం ఏంకే స్టాలిన్ కీలక నిర్ణయం.. సీఎంలకు లేఖ
Also Read: పోసానికి గుడ్ న్యూస్ కానీ.. జైల్లోనే..
Also Read : రంగయ్య మృతి.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
మరిన్ని ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Mar 08 , 2025 | 06:21 AM