Yogi Adityanath: స్నానాలకే కాదు.. తాగడానికీ అనుకూలమే
ABN, Publish Date - Feb 20 , 2025 | 05:04 AM
బుధవారం ఆయన యూపీ అసెంబ్లీలో మాట్లాడుతూ కుంభమేళా గొప్పతనాన్ని పునరుద్ఘాటించారు. సనాతన ధర్మం, గంగానది, భారతదేశం, మహా కుంభమేళాపై నిరాధార ఆరోపణలు చేస్తూ, నకిలీ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
త్రివేణీ సంగమ జలాలపై యూపీ సీఎం యోగి స్పష్టీకరణ
లఖ్‌నవూ/ప్రయాగ్‌రాజ్, ఫిబ్రవరి 19: ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమం వద్ద నదిలో నీరు కలుషితమైందని సాగుతున్న ప్రచారాన్ని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఖండించారు. బుధవారం ఆయన యూపీ అసెంబ్లీలో మాట్లాడుతూ కుంభమేళా గొప్పతనాన్ని పునరుద్ఘాటించారు. సనాతన ధర్మం, గంగానది, భారతదేశం, మహా కుంభమేళాపై నిరాధార ఆరోపణలు చేస్తూ, నకిలీ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు చేసిన 56.25 కోట్ల మంది ప్రజల విశ్వాపాలతో ఆడుకోవడమే అన్నారు. త్రివేణీ సంగమంలోని నీరు స్నానాలు చేయడానికే కాదు తాగడానికి కూడా పనికొస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ఫీకల్ బ్యాక్టీరియా నివేదిక తర్వాత కుంభమేళాను కించపరిచేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. నీటి నాణ్యతపై యూపీ పీసీబీ నిరంతరం పర్యవేక్షిస్తోందని చెప్పారు.
బుధవారం నివేదికల ప్రకారం సంగమం వద్ద నీటిలో బీవోడీ పరిమాణం 3 కంటే తక్కువగానే ఉందని, డిజాల్వ్‌డ్ ఆక్సిజన్ (డీవో) 8 నుంచి 9 వరకూ నమోదైందని యోగి వివరించారు. దీనిప్రకారం సంగమంలోని నీరు స్నానాలకే కాదు ఆచమనానికి కూడా అనుకూలమేనని స్పష్టం చేశారు. మహాకుంభమేళాలో ఇంకా ఏడు రోజులు మిగిలి ఉన్నాయని, బుధవారం మధ్యాహ్నం వరకూ 56.25 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని సీఎం ప్రకటించారు.
తొక్కిసలాట మృతుల కుటుంబాలకు, రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందినవారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దీన్ని కూడా రాజకీయం చేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎస్‌పీ, ఆర్‌జేడీ, టీఎంసీ నేతలు బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, సనాతన ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడం నేరమైతే తమ ప్రభుత్వం ఆ నేరాన్ని చేస్తూనే ఉంటుందని యోగి స్పష్టం చేశారు.
కుంభమేళాతో 3లక్షల కోట్ల వ్యాపారం
ప్రయాగ్‌రాజ్‌లో రూ.3లక్షల కోట్ల వ్యాపారాన్ని సృష్టించడం ద్వారా మహా కుంభమేళా దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కార్యక్రమాల్లో ఒకటిగా మారిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (కాయిట్) సెక్రటరీ జనరల్, ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు. కుంభ్ ప్రారంభానికి ముందు 40కోట్ల మంది ప్రజలు వస్తారని, సుమారు రూ.2లక్షల కోట్ల లావాదేవీలు సాగుతాయని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. ఇప్పటికీ వెల్లువలా తరలివస్తున్న భక్తులను చూస్తుంటే ఈ నెల 26న కుంభమేళా చివరిరోజు నాటికి వీరి సంఖ్య 60 కోట్లు దాటుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాగ్‌రాజ్‌తో పాటు దానికి 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పట్ణణాలు, నగరాల్లో కూడా గణనీయమైన వ్యాపారాభివృద్ధి జరిగిందని తెలిపారు.
12ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారు?: అవిముక్తేశ్వరానంద
మహాకుంభ్.. ‘మృత్యుకుంభ్’గా మారుతోందంటూ వ్యాఖ్యానించిన బెంగాల్ సీఎం మమతకు ఉత్తరాఖండ్‌లోని జ్యోతిష్ పీఠ్ 46వ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి మద్దతు పలికారు. కుంభమే ళా నిర్వాహకులు సరైన రద్దీ నియంత్రణ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ‘12ఏళ్ల తర్వాత కుంభమేళా వస్తుందని 12 ఏళ్ల క్రితమే తెలుసు. అయినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదేం’ అని నిలదీశారు.
సంస్కృతి పరిరక్షణకు యూపీ స్ఫూర్తితో కంకణబద్దులు కావాలి
మహా కుంభమేళాలో కుటుంబ సభ్యులతో పురందేశ్వరి
అమరావతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): మన దేశంలోని ప్రతి ఒక్కరూ హాయిగా, ఆనందంగా ఉండాలని గంగాదేవిని వేడుకున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. మహా కుంభమేళాను పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగ్ రాజ్‌లోని త్రివేణి సంగమంలో ఆమె పవిత్ర పుష్కర స్నానం ఆచరించారు. సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేసిన అద్భుతమైన ఏర్పాట్లు చూసి ఆశ్చర్యం కలిగిందని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
Anti Corruption: అవినీతిని అరికట్టేందుకు కీలక చర్యలు.. 52 మంది అధికారుల సస్పెండ్
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా వ్యాపారం ఈసారి 3 లక్షల కోట్లు.. సరికొత్త రికార్డ్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..
Read More Business News and Latest Telugu News
Updated Date - Feb 20 , 2025 | 05:04 AM