Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా వ్యాపారం ఈసారి 3 లక్షల కోట్లు.. సరికొత్త రికార్డ్
ABN , Publish Date - Feb 19 , 2025 | 02:42 PM
ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా భక్తుల రద్దీతోనే కాదు, ఇటు వ్యాపారంలో కూడా సరికొత్త రికార్డ్ సృష్టించింది. గతంలో ఇక్కడ దాదాపు రెండు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేయగా, ఇప్పుడు అది మూడు లక్షల కోట్లను దాటేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా(maha kumbh mela 2025)లో ఈసారి అనుకున్న దానికంటే ఎక్కువ వ్యాపారం జరిగిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) సెక్రటరీ జనరల్ చాందినీ చౌక్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ (Praveen Khandelwal) తెలిపారు. ఈ క్రమంలో వస్తువులు, సేవల ద్వారా దాదాపు రూ. 3 లక్షల కోట్ల (USD 360 బిలియన్ల) వ్యాపారం సృష్టించబడిందన్నారు. 144 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ ప్రత్యేక మహా కుంభమేళా జనవరి 13న మొదలు కాగా, ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది.
అంచనాల ప్రకారం
ఈ కుంభమేళా ప్రారంభానికి ముందు ప్రాథమిక అంచనాల ప్రకారం 40 కోట్ల మంది భక్తులు వస్తే, దాదాపు రూ. 2 లక్షల కోట్ల విలువైన వ్యాపార లావాదేవీలు జరుగుతాయని ఖండేల్వాల్ చెప్పారు. కానీ ఇప్పటికే వచ్చిన భక్తుల సంఖ్య 55 కోట్లను దాటేసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26 నాటికి దాదాపు 60 కోట్ల మంది ఈ మహాకుంభమేళాలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. దీంతో రూ. 3 లక్షల కోట్లకు పైగా వ్యాపార టర్నోవర్ జరుగుతుందని CAIT సెక్రటరీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఉత్తర్ ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందించిందని, దీంతోపాటు కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించిందని ఆయన అన్నారు.
అనేక రంగాలు..
మహా కుంభమేళా నేపథ్యంలో ఆతిథ్యం, ఆహారం, పానీయాలు, రవాణా, లాజిస్టిక్స్, మతపరమైన దుస్తులు, పూజా సమగ్రి, హస్తకళలు, దుస్తులు, ఇతర వినియోగ వస్తువులు, ఆరోగ్య సంరక్షణ వ్యాపారాలు పుంజుకున్నట్లు తెలిపారు. దీంతోపాటు మీడియా, ప్రకటనలు, వినోదం, పౌర సేవలు, టెలికాం, మొబైల్, AI ఆధారిత సాంకేతికత, CCTV కెమెరాలు వంటి అనేక ఇతర వ్యాపార రంగాలు కూడా మంచి ఆర్థిక కార్యకలాపాలను చూశాయని ఖండేల్వాల్ చెప్పారు.
దీని పరిధిలోని నగరాలు కూడా..
ఈ క్రమంలో కుంభమేళా 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న నగరాలు, పట్టణాలు కూడా గణనీయమైన వ్యాపార వృద్ధిని సాధించాయన్నారు. దీని ద్వారా ఆయా స్థానిక ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అయినట్లు చెప్పారు. దీంతోపాటు అయోధ్య, వారణాసి, ఇతర మతపరమైన ప్రదేశాలలో కూడా యాత్రికుల సందర్శనలు పెరిగాయన్నారు.
ఎందుకంటే భక్తులు అయోధ్యలో రాముడు, వారణాసిలో శివుడు, సమీప జిల్లాల్లో దర్శనం, పూజల కోసం ప్రయాణించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాలలో కూడా భారీ ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయన్నారు. యూపీ ప్రభుత్వం ప్రయాగ్‌రాజ్‌లో ఫ్లైఓవర్లు, రోడ్లు, అండర్‌పాస్‌ల కోసం రూ. 7500 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో రూ. 1500 కోట్లు మహాకుంభమేళా ఏర్పాట్ల కోసం ప్రత్యేకంగా కేటాయించబడ్డాయి.
ఇవి కూడా చదవండి:
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..
New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Read More Business News and Latest Telugu News