Tamil Nadu: నియోజకవర్గాల పునర్విభజనపై చర్చిద్దాం రండి
ABN, Publish Date - Mar 08 , 2025 | 05:14 AM
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు తమిళనాడు సీఎం స్టాలిన్ ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 29 పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపారు.
చంద్రబాబు, రేవంత్ సహా 7 రాష్ట్రాల సీఎంలు,
29 పార్టీల అధినేతలకు స్టాలిన్ ఆహ్వానం
22న చెన్నైలో ఉమ్మడి కార్యాచరణ కమిటీ భేటీ
చెన్నై, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు తమిళనాడు సీఎం స్టాలిన్ ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 29 పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపారు. ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో చేసిన తీర్మానం మేరకు ఉమ్మడి కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని భావించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22న చెన్నైలో సమావేశం తలపెట్టారు. దీనికి రావాలని కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబు, కేరళ సీఎం విజయన్, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, పశ్చిమబెంగాల్ సీఎం మమత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఒడిసా సీఎం మోహన్‌చంద్ర మాఝీలకు ఆహ్వాన లేఖలు పంపించారు. ఉమ్మడి కార్యాచరణ కమిటీ ఏర్పాటుకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆమోదం తెలపాలని, అదే సమయంలో ఆయా రాష్ట్రాలకు చెందిన రాజకీయపార్టీలు ఈ కమిటీలో తమ తరఫున ప్రతినిధులను సభ్యులుగా నియమించేందుకు ప్రతిపాదనలు పంపాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించబోయే నియోజకవర్గాల పునర్విభజన ఫెడరల్ రాజ్యాంగ విధానానికి వ్యతిరేకమైందని, ఈ వ్యవహారాన్ని రాజకీయపరంగా, చట్టపరంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. 2021లో జరగాల్సిన జనగణన ఆలస్యం కావడంతో నియోజకవర్గాల పునర్విభజన.. 2031లో జరగనున్న జన గణన ప్రకారం జరుగుతుందని భావించామని, అయితే అంతకంటే ముందే పునర్విభజన చేపట్టనుండడంతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లడం ఖాయమని పేర్కొన్నారు. కుటుంబ నియంత్రణ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి, జనాభా పెరుగుదలను నియంత్రించిన రాష్ట్రాలకు తీరని నష్టం కలుగుతుందన్నారు. పునర్విభజనకు తాము వ్యతిరేకం కాదని, అయితే అప్రజాస్వామికంగా చేపడుతున్న పునర్విభజననే వ్యతిరేకిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ‘‘జనాభా నియంత్రణను సమర్థవంతంగా పాటించినందుకు మనకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చోకూడదు’’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. స్టాలిన్ లేఖ రాసినవారిలో మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం జగన్, పుదుచ్చేరి సీఎం ఎన్. రంగస్వామి, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా ఉన్నారు. వీరితో పాటు కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిసా, పంజాబ్, తదితర రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నేతలకు కూడా స్టాలిన్ లేఖలు రాశారు.
వచ్చే ఏడాది ఎన్నికలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కీలకమైన అంశాలపై సీఎం స్టాలిన్ పోరుబాట పట్టారు. హిందీని బలవంతంగా రుద్దుతున్నారని పేర్కొంటూ ఇటీవల కాలంలో కేంద్రంపై నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన అంశంపైనా స్టాలిన్ పోరాటం ప్రారంభించారు. జనాభా నియంత్రణను పాటించిన రాష్ట్రాలకు ఈ పునర్విభజన ద్వారా నష్టం కలుగుతుందని, అదేసమయంలో జనాభా నియంత్రణను పట్టించుకోని బీజేపీ పాలిత ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అన్ని ప్రాంతీయ భాషలకూ కేంద్రం ప్రాధాన్యం
మెడికల్, ఇంజనీరింగ్ పాఠాలు తమిళంలోకి అనువదించాలని స్టాలిన్‌కు చెబుతున్నా: షా
చెన్నై, మార్చి 7(ఆంధ్రజ్యోతి): కేంద్రంలో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం కల్పిస్తోందని, మోదీ అధికారంలోకి వచ్చాకే సీఐఎ్‌సఎఫ్ ఎంపిక పరీక్షలు తమిళం సహా ఇతర ప్రాంతీయ భాషల్లో రాసే సదుపాయం కల్పించారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. తమిళనాడులోని రాణిపేట జిల్లా అరక్కోణం సమీపంలోని తక్కోలం వద్దనున్న రాజాధిత్య చోళన్ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎ్‌సఎఫ్) శిక్షణా కేంద్రంలో శుక్రవారం జరిగిన 56వ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. సీఐఎ్‌సఎ్‌ఫకు చెందిన పదిమందికి రాష్ట్రపతి పతకాలు, ఇరువురికి జీవన్ రక్షా పతకాలు, 10 మందికి ప్రత్యేక పతకాలను ప్రదానం చేశారు. అనంతరం అమిత్‌షా ప్రసంగిస్తూ.. మెడికల్, ఇంజనీరింగ్ కోర్సుల పాఠ్యాంశాలను తమిళంలో అనువదించాలని, అది తమిళ మాధ్యమ విద్యార్థులకు సులభంగా ఉంటుందని గత రెండేళ్లుగా తమిళనాడు సీఎం స్టాలిన్‌కు తాను ప్రతిపాదిస్తూనే ఉన్నానని తెలిపారు. ప్రధాని మోదీ తమిళ భాషకు, తమిళ సంస్కృతీ సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. భారతీయ సంస్కృతిని తమిళ సంస్కృతి మరింత పటిష్టం చేస్తోందన్నారు. దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ కోటిమంది పౌరులకు సీఐఎస్‌ఎఫ్ పటిష్టమైన భద్రతను కల్పిస్తుండటం హర్షణీయమన్నారు. సీఐఎ్‌సఎఫ్ ప్రాంతీయ శిక్షణా కేంద్రానికి చోళవంశీయుడైన రాజాధిత్య చోళుడి పేరు పెట్టడం అన్ని విధాలా ప్రశంసనీయమని చెప్పారు. సీఐఎ్‌సఎ్‌ఫలో ఈ యేడాది లక్షమందికి పైగా ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు.
ఇవి కూడా చదవండి...
CM Revanth Reddy: సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి
Telangana: మేడిగడ్డ వ్యవహారం.. కేసీఆర్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..
TGSRTC: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆరోజు ఏకంగా 3 వేల బస్సులు..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Mar 08 , 2025 | 05:14 AM