Donald Trump: భారత్‌పై సుంకాలు విధిస్తాం!
ABN, Publish Date - Jan 29 , 2025 | 02:25 AM
భారత్, చైనా, బ్రెజిల్ సహా ఇతర దేశాలపై భారీగా సుంకాలు విధించనున్నట్టు ట్రంప్ తెలిపారు. ‘‘ఆయా దేశాలు, పౌరులతో మనకు చాలా నష్టం జరుగుతోంది. అదేసమయంలో ఆ దేశాలు బాగుపడుతున్నాయి’’ అని వ్యాఖ్యానించారు.
చైనా సహా ఇతర దేశాలపై కూడా.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన
ఆయా దేశాలతో అగ్రరాజ్యానికి నష్టం జరుగుతోందన్న అమెరికా అధ్యక్షుడు
అమెరికన్లకు ఆదాయపన్ను రద్దు!
రిపబ్లికన్ సభ్యుల సదస్సులో వెల్లడి
ఆర్మీలో ట్రాన్స్‌జెండర్ల నియామకాలకు నో వైట్‌హౌస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ
వాషింగ్టన్, జనవరి 28: అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాలపై సుంకాల బాంబు పేల్చారు. ముఖ్యంగా అగ్రరాజ్యంతో బలమైన వాణిజ్య బంధాన్ని కొనసాగిస్తున్న భారత్‌పై భారీ ఎత్తున సుంకాలు విధిస్తామని ప్రకటించారు. భారత్, చైనా, బ్రెజిల్ సహా ఇతర దేశాలపై భారీగా సుంకాలు విధించనున్నట్టు ట్రంప్ తెలిపారు. ‘‘ఆయా దేశాలు, పౌరులతో మనకు చాలా నష్టం జరుగుతోంది. అదేసమయంలో ఆ దేశాలు బాగుపడుతున్నాయి’’ అని వ్యాఖ్యానించారు. దేశంలోకి సంపద వచ్చేందుకు ఆయా దేశాలపై భారీగా సుంకాలు విధించాల్సిందేనని ఉద్ఘాటించారు. ‘‘ఇతర దేశాలు ఏం చేస్తున్నాయో చూడండి. చైనా సుంకాల రారాజు. ఈ జాబితాలోనే భారత్, బ్రెజిల్ సహా పలు దేశాలు ఉన్నాయి. ఈ విధానాన్ని ఇక మీదట కొనసాగకుండా చూడాలి. ఎందుకంటే అమెరికాను అన్ని విధాలా ముందు నిలపాలి. అమెరికా ఫస్ట్!’’ అని నొక్కి చెప్పారు. ఇక, అమెరికా ప్రజలపై ఆదాయ పన్ను భారాన్ని రద్దు చేయాల్సి ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
‘‘మన ప్రజలను ధనవంతులుగా, శక్తిమంతులుగా తీర్చిదిద్దే వ్యవస్థను పునరుద్ధరించాల్సిన సమయం ఇదే’’ అని అన్నారు. విదేశాలు, విదేశీ పౌరులపై సుంకాలు, పన్నులు వేయడం ద్వారా అమెరికా తనను తాను సుసంపన్నం చేసుకుంటుందని తెలిపారు. ఈ మేరకు ఫ్లోరిడాలో సోమవారం జరిగిన రిపబ్లికన్ సభ్యుల సదస్సులో ట్రంప్ ప్రకటించారు. ‘‘1913కు ముందు దేశంలో ఎలాంటి ఆదాయపన్ను లేదు. కేవలం సుంకాల వ్యవస్థే ఉంది. ఇదే అమెరికాను అత్యంత సుసంపన్న దేశంగా మార్చింది. 1913 నుంచే ఆదాయపన్ను ప్రవేశించింది’’ అని ట్రంప్ చెప్పారు. అమెరికాను సుసంపన్నం చేసేందుకు విదేశీ పౌరులపై పన్నులు విధిస్తామని పేర్కొన్నారు. ‘‘ఇతర దేశాలను సంపన్నం చేసేందుకు మన వారిపై పన్నులు విధించే బదులు.. మన వారిని సంపన్నం చేసేందుకు విదేశాలపై పన్నులు, సుంకాలు విధించాలి. ఇలా చేయడమే సరైంది కదా?!’’ అని వ్యాఖ్యానించారు. సుంకాలు, పన్నుల నుంచి మినహాయింపు కోరుకునే వారు ఇక్కడే ప్రాజెక్టులను పెట్టాలన్నారు.
ట్రాన్స్‌జెండర్లకు బ్రేక్
అమెరికా సైనిక దళాల్లో ట్రాన్స్‌జెండర్లను నియమించే విధానానికి ట్రంప్ చెక్ పెట్టారు. తన ఎగ్జిక్యూటివ్ అధికారాలను ఉపయోగించి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ‘‘ట్రాన్స్‌జెండర్లను సైనిక దళాల్లో నియమించడం ద్వారా గౌరవ ప్రదమైన, నిజాయితీ, క్రమశిక్షణతో కూడిన సైనికుల నిబద్ధతకు విఘాతం కలుగుతుంది’’ అని ట్రంప్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐరన్ డోమ్ క్షిపణి వ్యవస్థను నిర్మించనున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా విదేశాలకు చేసే అన్ని రకాల సహాయాలను నిలిపివేస్తూ మరో ఉత్తర్వు ఇచ్చారు. అయితే, ఇజ్రాయెల్, ఈజిప్టులను వీటి నుంచి మినహాయించారు.
భారత్ అప్రమత్తం
భారత్ సహా ఇతర దేశాలపై భారీగా సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన నేపథ్యంలో మోదీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అమెరికా వాణిజ్య విధానంలో మార్పులు వస్తే ఏం చేయాలన్న దానిపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ అంతర్గత సమావేశాలు నిర్వహించింది. ట్రంప్ ప్రకటనతో భారత ఎగుమతులపై ప్రభావం పడనుందని నిపుణులు తెలిపారు. కాగా, భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం 120 బిలియన్ డాలర్లకు చేరింది. ఇదిలా ఉండగా, అక్రమ వలసదారులు వస్తే భారత్ అనుమతించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఇండియన్ ఓవర్‌సీస్ చైర్మన్ శ్యామ్ పిట్రోడా తాజాగా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
ఫిబ్రవరిలో మోదీ వస్తున్నారు..
అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన భారత పౌరుల విషయంలో ఆ దేశం సరైన చర్యే తీసుకుంటుందని ఆశిస్తున్నట్టు అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ‘‘అక్రమ వలసలపై భారత ప్రధాని మోదీతో చర్చించా. ఈ విషయంలో ఏది సరైన చర్యో భారత్ అలానే చేస్తుందని ఆశిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరిలో మోదీ అమెరికాకు రానున్నట్టు చెప్పారు. ఆ నెలలో ఎప్పుడైనా ఆయన రావొచ్చని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Mauni Amavasya: మౌని అమావాస్య.. పితృ దోషం నుండి ఇలా బయటపడండి..
Kumbh Mela 2025: మహా కుంభమేళాను 15 రోజుల్లో ఎంత మంది సందర్శించారో తెలుసా..
Read More National News and Latest Telugu News
Updated Date - Jan 29 , 2025 | 02:25 AM