ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump: ట్రంప్‌ వచ్చేస్తున్నాడు!

ABN, Publish Date - Jan 20 , 2025 | 04:52 AM

మొండివాడు రాజు కన్నా బలవంతుడంటారు! కానీ.. మొండివాడే రాజైతే? విషయం ఏదైనా నిక్కచ్చిగా అభిప్రాయం చెప్పి..

భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి 10.30కి ప్రమాణం

వాషింగ్టన్‌లో తీవ్ర చలి.. బహిరంగ ప్రదేశంలో నిర్వహించొద్దని నిర్ణయం

కేపిటల్‌ హిల్‌లోని రోటుండా ఇండోర్‌లో ప్రమాణ స్వీకారం

హాజరుకానున్న మస్క్‌, బెజోస్‌, జుకర్‌బర్గ్‌

అమెరికా వ్యాప్తంగా ట్రంప్‌ వ్యతిరేకుల నిరసనలు.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

మొండివాడు రాజు కన్నా బలవంతుడంటారు! కానీ.. మొండివాడే రాజైతే? విషయం ఏదైనా నిక్కచ్చిగా అభిప్రాయం చెప్పి.. నిర్మొహమాటంగా నిర్ణయాలు తీసుకునే డోనాల్డ్‌ ట్రంప్‌ను ఆయన విమర్శకులు ‘మొండివాడు’ అనే అంటారు!! అలాంటి ట్రంప్‌.. అమెరికా అధ్యక్షుడిగా సోమవారం మళ్లీ బాధ్యతలు చేపట్టనున్నారు. అమెరికా అధ్యక్షుడంటే ఆ ఒక్క దేశానికి మాత్రమే సంబంధించిన వ్యవహారం కాదు. ఆ పదవిలో ఉన్న వ్యక్తి ఆలోచనల ప్రభావం ప్రపంచమంతా ఉంటుంది!! అందునా ట్రంప్‌ లాంటి దూకుడు మనస్తత్వం ఉన్న వ్యక్తి అయితే ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో.. పలు అంశాలపై గత కొన్ని నెలలుగా ఆయన చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఆయన వైఖరి ఎలా ఉండవచ్చో నిపుణులు విశ్లేషిస్తున్నారిలా..

భారత్‌పై పన్నుల భారం?

ట్రంప్‌ తొలి హయాంలో అమెరికా, భారత్‌ మధ్య వ్యూహాత్మక సంబంధాలు బలపడ్డాయి. కానీ.. వాణిజ్యం విషయంలో మాత్రం ఆయన పలుమార్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత్‌ విధించే సుంకాలపై గట్టిగానే చిర్రుబుర్రులాడారు. 2019లో.. భారత్‌ను ‘టారిఫ్‌ కింగ్‌’గా కూడా అభివర్ణించారాయన! అప్పటిదాకా భారత్‌కు ఉన్న ‘జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌ (జీఎస్పీ)’ని రద్దు చేశారు. గత ఏడాది డిసెంబరులో సైతం.. భారత్‌ విధిస్తున్న సుంకాలపై ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘అమెరికా ఉత్పత్తులపై భారత్‌, బ్రెజిల్‌ వంటి దేశాలు అత్యధికంగా 100ు, 200ు పన్నులు వేస్తున్నాయి.. దేనికైనా ప్రతిచర్య ఉంటుంది. వారు మాపై పన్నులు వేస్తే మేమూ అదే స్థాయిలో వసూలు చేస్తాం’’ అంటూ రివెంజ్‌ ట్యాక్స్‌ గురించి మాట్లాడారు. కాబట్టి వాణిజ్యంలో ఇరుదేశాల మధ్య ఘర్షణ.. పన్నుభారం తప్పకపోవచ్చు.


హెచ్‌1బీపై మెతక వైఖరి?

హెచ్‌1బీ వీసాలపై ట్రంప్‌ గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హెచ్‌1బీ ప్రోగ్రామ్‌ ద్వారా వచ్చే దరఖాస్తుల వడపోతను కఠినతరం చేశారు. కానీ, ఇప్పుడు.. హెచ్‌1బీ వీసాలను సమర్థించే ఈలన్‌ మస్క్‌, వివేక్‌ రామస్వామి వంటివారు తన పక్కనే ఉన్న నేపథ్యంలో ఇటీవలికాలంలో ఆయన స్వరం మారింది. ఆ వీసాలపై ఆయన వైఖరి మెత్తబడింది. ‘‘హెచ్‌1బీపై నాకు నమ్మకం ఉంది. అదొక గొప్ప కార్యక్రమం’’ అంటూ న్యూయార్క్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు. అయితే.. ట్రంప్‌ మద్దతుదారుల్లోనే మరో వర్గం, అమెరికాను మళ్లీ గొప్పగా చేయాలని వాదించేవారు (మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌-మాగా) మాత్రం హెచ్‌1బీపై తీవ్ర వ్యతిరేకత వెలిబుచ్చుతున్నారు. కాబట్టి ఆ ఒత్తిడి కూడా ట్రంప్‌పై ఉండే అవకాశం ఉంది. దాన్ని ఎలా అధిగమిస్తారో చూడాలి!!

గ్రీన్‌లాండ్‌ స్వాధీనం!

అత్యంత వూహాత్మకమైన ప్రాంతంలో ఉన్న గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో భాగం చేస్తామని.. అందుకు అవసరమైతే సైన్యాన్నిగానీ, ధనాన్నిగానీ ఉపయోగించడానికి సిద్ధమని ట్రంప్‌ చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. ఇంతకీ గ్రీన్‌లాండ్‌పై ట్రంప్‌ దృష్టి ఎందుకు పడింది? అంటే.. ఆ దేశంలో అత్యంత అరుదైన వనరులు, నిక్షేపాలు ఉన్నాయి. యూర్‌పకు, ఉత్తర అమెరికాకు మధ్య వ్యూహాత్మక ప్రాంతంలో ఉందా భూభాగం. అటువైపుగా వెళ్లే రష్యన్‌ నౌకలు, అణు జలాంతర్గాములపై ఒక కన్ను వేసే అవకాశం అమెరికాకు అక్కడ ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే యూఎస్‌ అక్కడ ఒక శాశ్వత ఎయిర్‌బేస్‌ ఏర్పాటు చేసింది. అన్నిటికీ మించి.. గ్రీన్‌లాండ్‌ భౌగోళికంగా ఉత్తర అమెరికాలో భాగం! కానీ.. రాజకీయంగా 1953 వరకూ డెన్మార్క్‌ వలస ప్రాంతంగా ఉంది. ఇప్పుడు స్వయంపాలిత భూభాగంగా ఉంది. గ్రీన్‌లాండ్‌ రాజధానికి డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హేగన్‌ కన్నా కూడా న్యూయార్కే దగ్గర. వీటిన్నింటి నేపథ్యంలోనే ట్రంప్‌ గ్రీన్‌లాండ్‌ను ఎలాగైనా స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. గతంలో హ్యారీ ట్రూమన్‌ హయాంలో కూడా ఈ ద్వీపాన్ని 100 మిలియన్‌ డాలర్లతో కొనుగోలు చేయడానికి ప్రయత్నించారు. కానీ, కుదర్లేదు. ఇప్పుడు కూడా డెన్మార్క్‌ ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. ట్రంప్‌ మాత్రం ఈ విషయంలో మొండిగానే వ్యవహరించే అవకాశం ఉంది. అప్పుడు.. డెన్మార్క్‌కు బదులుగా అమెరికాతో అనుబంధంగా ఉండే నిర్ణయం తీసుకునే హక్కు గ్రీన్‌లాండ్‌కు ఉంటుంది. ఫలితంగా ఇన్నాళ్లుగా డెన్మార్క్‌ నుంచి గ్రీన్‌లాండ్‌కు అందుతున్న రాయితీలు అమెరికా నుంచి అందుతాయన్నమాట.


రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం

తాను అధికారంలోకి వస్తేగనక వెంటనే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్‌ గతంలో ప్రకటించారు. ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వం ఇవ్వబోమని హామీ ఇవ్వడం ద్వారా రష్యాను యుద్ధవిరమణకు ట్రంప్‌ ఒప్పించవచ్చన్నది ఒక ఆలోచన. అది ఉక్రెయిన్‌కు పెద్ద దెబ్బే. నిజానికి 2023లో అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు అందాల్సిన 61 బిలియన్ల డాలర్ల ప్యాకేజీ.. ట్రంప్‌ ఒత్తిడి కారణంగానే ఆగిపోయింది. అందుకే ఉక్రెయినియన్లకు ఇప్పుడు ట్రంప్‌ మీద ఆశలేమీ లేవు.

పనామా కాలువ స్వాధీనం?

తీరాల మధ్య వాణిజ్య, సైనిక నౌకల రవాణాను సులభతరం చేసేందుకు అమెరికా నిర్మించిన పనామా కాలువ ప్రస్తుతం పనామా దేశ ఆధీనంలో ఉంది. 1977లో అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ చేసుకున్న ఒప్పందం ప్రకారం.. 1999 డిసెంబరులో ఈ కాలువపై నియంత్రణను అమెరికా కోల్పోయింది. అయితే.. ఇటీవలికాలంలో ఆ దేశం సరుకు రవాణా నౌకలపై రుసుములు పెంచేయడం, చైనాతో సత్సంబంధాలు పెట్టుకోవడం వంటి నిర్ణయాలు తీసుకుంది. అవే ట్రంప్‌ ఆగ్రహానికి కారణమయ్యాయి. కాబట్టి పగ్గాలు చేపట్టాక ట్రంప్‌ పనామాపై దూకుడుగానే వ్యవహరించే అవకాశం ఉందని అంచనా. ఇవే కాదు, వాణిజ్యలోటు భర్తీ కోసం కెనడా, మెక్సికోలను కూడా అమెరికాలో రాష్ట్రాలుగా చేరుస్తామని ట్రంప్‌ వ్యాఖ్యానించారు! అమెరికాకు సన్నిహితమైన యూరోపియన్‌ దేశాలనూ ఆయన వదల్లేదు. యూరప్‌ దేశాలకు, అమెరికాకు మధ్య వాణిజ్య అంతరం భారీగా ఉందని.. దాన్ని పూడ్చడానికి యూరప్‌ దేశాలు గ్యాస్‌, ఇంధనాన్ని అమెరికా నుంచే కొనుగోలు చేయాలని హెచ్చరించారు. లేదంటే ఈయూపై పన్నులు పెంచేస్తానని బెదిరించారు. భూతాప ముప్పును నివారించేందుకు పారి్‌సలో కుదుర్చుకున్న పర్యావరణ ఒప్పందం నుంచి వైదొలగుతానని ప్రకటించారు. ఇలా ఆయన చెప్పినవన్నీ చేస్తే ప్రపంచానికి పెనుముప్పేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

గాజా వార్‌ ముగిసినట్లేనా?

గాజాలో జరుగుతున్న యుద్ధం విషయంలో ట్రంప్‌ చాలా స్పష్టంగా హమా్‌సకు వ్యతిరేకంగా ఉన్నారు. తాను ప్రమాణం చేసే జనవరి 20లోపు హమా్‌సగనక తన వద్ద ఉన్న బందీలందరినీ ఇళ్లకు పంపించకపోతే ఈ దురాగతాలకు పాల్పడేవారికి నరకం చూపిస్తానని ఇటీవలే హెచ్చరికలు జారీ చేశారు. ఈ యుద్ధానికి కారకులైనవారికి గట్టి దెబ్బ పడుతుందంటూ పరోక్షంగా ఇరాన్‌ను హెచ్చరించారు. ఈ క్రమంలోనే హమాస్‌ దిగివచ్చి ముగ్గురు బందీలను విడుదల చేసింది.

Updated Date - Jan 20 , 2025 | 04:53 AM