DOGE Employees Resign: మస్క్‌పై గుస్సా.. 21 మంది డోజ్ శాఖ ఉద్యోగుల రాజీనామా
ABN, Publish Date - Feb 26 , 2025 | 07:29 AM
డోజ్ శాఖ చేపడుతున్న అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపునకు నిరసనగా ఆ శాఖకు చెందిన 21 మంది ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ప్రజాసేవల వ్యవస్థను కూల్చేందుకు తాము సహకరించలేమని స్పష్టం చేశారు.
ఉత్పాదకత పెంపు, ఖర్చుల తగ్గింపు పేరిట ఎలాన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలోని డోజ్ శాఖ చేపడుతున్న అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపుపై ఆ శాఖలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజాసేవల వ్యవస్థలను కూల్చేందుకు తాము సహకరించలేమంటూ డోజ్‌లోని సుమారు 21 మంది ఉద్యోగులు రాజీనామా చేశారు (DOGE Employees Resign). ఇలా తప్పుకున్న వారిలో ఇంజినీర్లు, డాటా సైంటిస్టులు, ప్రాజెక్టు మేనేజర్లు పలువురు ఉన్నారు. రాజీనామాల నేపథ్యంలో వారు మస్క్ చర్యలను తీవ్రంగా విమర్శిస్తూ లేఖ రాశారు. తాము అమెరికన్ల ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నామని, అయితే, ట్రంప్ హయాంలో భారీ స్థాయిలోః జరుగుతున్న ఉద్యోగుల తొలగింపును మాత్రం అస్సలు సహించలేమని వారు స్పష్టం చేశారు. ‘‘ప్రజలకు సేవ చేస్తామని, రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తామని ఉద్యోగంలో చేరేటప్పుడు ప్రమాణం చేశాము. కానీ వీటికి కట్టుబడి ఉండలేని పరిస్థితి వచ్చింది’’ అని తమ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
Elon Musk: మస్క్ అడిగాడు కదా.. చెప్పండి
మరోవైపు, ట్రంప్, మస్క్ దూకుడుగా చేపడుతున్న ఉద్యోగుల తొలగింపునకు క్రమంగా న్యాయపరమైన సవాళ్లు పెరుగుతున్నాయి. ఈ తొలగింపుల వెనక రాజకీయ కారణాలు ఉన్నాయన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఇక డోజ్ శాఖలోని ఉద్యోగులకు తమ విధి నిర్వహణకు అవసరమైన నైపుణ్యాలు లేవన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. డోజ్‌లో ఉద్యోగులను ఎంపిక చేసే వారికి కూడా సాంకేతిక నైపుణ్యాల తక్కువేనని మాజీ ఉద్యోగులు తమ లేఖలో ఆరోపించారు. వారు తమ వివరాలను చెప్పేందుకు ఇష్టపడకపోగా ఇంటర్వ్యూకు వచ్చిన వారిని రాజకీయ పరమైన ప్రశ్నలు అడుగుతున్నారని అన్నారు.
Donald Trump: భారత్‌కు ట్రంప్ ఝలక్
ఇదిలా ఉంటే, డోజ్ శాఖ తొలగించిన కేంద్ర ప్రభుత్వ (ఫెడరల్) ఉద్యోగులకు మళ్లీ జాబ్స్ ఇచ్చేందుకు న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వ ముందుకొచ్చింది. ‘‘మిమ్మల్ని జాబ్ లోంచి తీసేశాము అని వాళ్లంటే మీకు జాబ్ ఇస్తున్నాము అని మేము అంటాము’’ అని న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచుల్ అన్నారు. ఇటీవల ఉద్యోగాలు పోగొటుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు వీలుగా ఓ వెబ్‌సైట్‌ను కూడా ఆమె ప్రారంభించారు.
విమర్శలు ఎంతగా పెరుగుతున్నా మస్క్ మాత్రం వెనక్కు తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఈ వారాంతంలో మరింత మంది ఉద్యోగులకు ఈమెయిల్స్ అందుతాయని చెప్పారు. తాము ఆ వారంలో చేసిన పనిని ఉద్యోగులు తమ ప్రత్యుత్తరాల్లో వివరించాల్సి ఉంటుందని అన్నారు. ఈ ఈమెయిల్స్ స్పందించకపోతే వారు రాజీనామా చేసినట్టు భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక డోజ్ శాఖ చర్యల కారణంగా ఇప్పటివరకూ 2 లక్షల మంది ఫెడరల్ (కేంద్ర ప్రభుత్వ) ఉద్యోగులు జాబ్స్ పోగొట్టుకున్నారు.
Read More Latest and International News
Updated Date - Feb 26 , 2025 | 07:32 AM