Share News

Elon Musk: మస్క్‌ అడిగాడు కదా.. చెప్పండి

ABN , Publish Date - Feb 26 , 2025 | 04:49 AM

‘‘మీరంతా నిజంగానే పని చేస్తున్నారా.. చేస్తే ఆ పనులేంటో చెప్పండి అని మస్క్‌ అడుగుతున్నారు. ఒక వేళ సమాధానం ఇవ్వకపోతే మీరు తొలగించాల్సిన ఉద్యోగుల జాబితాలో ఉంటారు’’ అని ఫెడరల్‌ ఉద్యోగులను ఉద్దేశించి ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Elon Musk: మస్క్‌ అడిగాడు కదా.. చెప్పండి

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 25: ఫెడరల్‌ ఉద్యోగులంతా గడిచిన వారంలో చేసిన పనుల వివరాలను మెయిల్‌ చేయాలని, లేనిపక్షంలో ఉద్యోగాలకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలని అమెరికాలోని డోజ్‌ విభాగం చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ చేసిన ప్రకటనను అధ్యక్షుడు ట్రంప్‌ సమర్థించారు. ‘‘మీరంతా నిజంగానే పని చేస్తున్నారా.. చేస్తే ఆ పనులేంటో చెప్పండి అని మస్క్‌ అడుగుతున్నారు. ఒక వేళ సమాధానం ఇవ్వకపోతే మీరు తొలగించాల్సిన ఉద్యోగుల జాబితాలో ఉంటారు’’ అని ఫెడరల్‌ ఉద్యోగులను ఉద్దేశించి ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఫెడరల్‌ విభాగాల్లో పనిచేస్తున్నట్లుగా ఉన్న చాలా మంది ఉద్యోగులు అసలు ఉనికిలోనే లేరని, లేని ఉద్యోగులకు జీతాలు అందుతున్నాయని ట్రంప్‌ ఈ సందర్భంగా ఆరోపించారు. ఇలా వందల బిలియన్ల డాలర్ల మోసం జరుగుతోందని చెప్పారు. దీన్ని డోజ్‌ విభాగం గుర్తించిందన్నారు. మరోవైపు, తన ప్రకటన పట్ల ఫెడరల్‌ ఉద్యోగుల్లో వ్యతిరేకతపై మస్క్‌ స్పందించారు. ‘కొంచెం జవాబుదారీగా ఉండండి అంటే ద్వేషాన్నంతా వెళ్లగక్కుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడికి ఉన్న విచక్షణాధికారంతో ఫెడరల్‌ ఉద్యోగులకు ఇంకొక అవకాశం ఇస్తామని, అప్పుడు కూడా మెయిల్‌ పంపకపోతే వారిని కచ్చితంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ఆయన హెచ్చరించారు. అమెరికా కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రిలోగా ఫెడరల్‌ ఉద్యోగులంతా మెయిల్‌ పంపాలని మస్క్‌ మూడు రోజుల క్రితం ఆదేశించారు. ఇప్పటికే గడువు ముగిసింది. మరోవైపు, మస్క్‌కు రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదని ఫెడరల్‌ విభాగాలు తమ ఉద్యోగులకు సూచించాయి.


పుతిన్‌ నియంత కాదు

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ‘నియంత’ అని పిలిచేందుకు ట్రంప్‌ నిరాకరించారు. అలాంటి పదాలను ఎలా ఉపయోగిస్తామని ప్రశ్నించారు. సోమవారం ఆయన అమెరికా పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌తో చర్చలు జరిపారు. అనంతరం ఇరువురు నేతలు ఉమ్మడిగా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని ‘నియంత’ అని గత వారం ట్రంప్‌ విమర్శించిన నేపథ్యంలో ‘పుతిన్‌ను కూడా నియంతగా గుర్తిస్తున్నారా?’ అని విలేకరులు అడిగారు. ఇందుకు ట్రంప్‌ సమాధానం ఇస్తూ ‘అంత తేలికగా అలాంటి మాటలను ఎలా అంటాం’ అని అన్నారు. శాంతి చర్చలపై మాట్లాడుతూ ‘మనం స్మార్ట్‌గా ఉంటే వారంలోనే యుద్ధం ముగిసిపోవచ్చు. స్మార్ట్‌గా లేకపోతే కొనసాగవచ్చు’ అని అన్నారు. దీనిపై మేక్రాన్‌ స్పందిస్తూ శాంతి ఒప్పందం అంటే ఉక్రెయిన్‌ లొంగిపోవడం కాదని, ఎలాంటి గ్యారెంటీలు లేకుండా కాల్పుల విరమణ జరగకూడదని చెప్పారు.


మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: డీఎస్సీ‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Also Read : మాజీ ఎంపీకి జీవిత ఖైదు

Also Read: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు

Also Read : అసోం బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Also Read: రిమాండ్ మళ్లీ పొడిగింపు.. విచారణలో నోరు విప్పని వంశీ

For National News And Telugu News

Updated Date - Feb 26 , 2025 | 04:49 AM