Man leaks Cholesterol: బాబోయ్ ఇదేం వింత వ్యాధి! వ్యక్తి చేతుల్లోంచి లీకైపోతున్న కొలెస్టెరాల్
ABN, Publish Date - Jan 25 , 2025 | 06:29 PM
బరువు తగ్గేందుకు కార్నివోర్ డైట్ ఫాలో అయిన ఓ వ్యక్తి చేతుల్లోంచి కొలెస్టరాల్ లీక్ కావడం ప్రారంభమైంది. అమెరికాలో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: బరువు తగ్గాలనుకున్న ఓ వ్యక్తి ప్రయత్నం వికటించింది. చేతులు, కాళ్లు, మోచేతుల నుంచి కొలెస్టరాల్, ఇతర కొవ్వులు లీకవడం ప్రారంభించాయి. అమెరికాలో ఈ వింత ఘటన వెలుగు చూసింది. దీని తాలూకు వివరాలు జామా కార్డియాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి (Health).
పూర్తి వివరాల్లోకి వెళితే, సదరు యువకుడు కార్నివోరస్ డైట్ అవలంబించాడు. అంటే, మాంసం, ఫిష్, ఎగ్, వెన్న లాంటి ఇతర పాల ఉత్పత్తులను మాత్రమే తిన్నారు. ఈ తరహా డైట్‌ను వైద్యులు కీటోజెనిక్ డైట్ అని పిలుస్తారు. ఈ విధానంలో శరీరానికి కావాల్సిన శక్తి 75 శాతం వరకూ కొవ్వుల నుంచి, 20 శాతం ప్రొటీన్ల అందుతుంది. కార్బోహైడ్రేట్లు నుంచి అందే శక్తి 10 శాతానికి మించకూడదనేది ప్రధాన నియమం (Man leaks Cholesterol).
Eggs: కోడిగుడ్లపై ఈ అపోహలు వద్దు..
ఈ తరహా డైట్ అవలంబించే వారు పళ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, గింజలు, విత్తనాల వంటి వాటి జోలికి వెళ్లరు. ఇక తాజాగా ఘటనలో వ్యక్తి డైట్‌లో చీజ్, వెన్న, వంటివి ఉండేవి. కొద్ది నెలల పాటు ఈ డైట్ అవలంబించాక తన బరువు భారీగా తగ్గిందని అతడు చెప్పుకొచ్చాడు. తన ఎనర్జీ లెవెల్స్ పెరిగాయని, ఆలోచనల్లో స్పష్టత పెరిగిందని అన్నాడు. అయితే, అతడికి తెలీకుండానే శరీరంలో ఇతర మార్పులు వచ్చాయి. ముఖ్యంగా రక్తంలో కొలెస్టరాల్ స్థాయి డెసీలీటర్‌కు 1000 మిల్లీగ్రాములను దాటింది. ఆరోగ్యవంతుల్లో కొలెస్టరాల్ స్థాయి 200కు మించదు. 240 దాటిందంటే అధిక కొలెస్టరాల్ ఉందని అర్థం.
Health: మాంసంపై నిమ్మరసం ఎందుకు పిండుతారో తెలుసా..
ఈ డైట్ ఫలితంగా అతడు జాంథలెస్మా బారినపడ్డాడు. రక్తంలో కొవ్వుల స్థాయి పెరిగి అవి రక్త నాళాల్లోంచి బయటకు లీకై పేరుకుపోవడం ప్రారంభించాయి. సాధారణ పరిస్థితుల్లో ఇలా పేరుకున్న కొవ్వును తెల్లరక్త కణాలు తొలగిస్తుంటాయి. కానీ ఈ వ్యక్తి విషయంలో తెల్లరక్త కణాల సామార్థ్యానికి మించి కొవ్వు లీకై చేతుల్లోంచి బయటకు రావడం ప్రారంభించింది. దీంతో, అతడు ఆసుపత్రిని ఆశ్రయించాల్సి వచ్చింది. ఇక అతడికి ఇచ్చిన ట్రీట్‌మెంట్‌పై స్పష్టత లేకపోయినప్పటికీ నిపుణులు మాత్రం బరువు తగ్గేందుకు అనవసర ప్రయోగాలు చేయొద్దని హెచ్చరిస్తున్నారు. ఇక కార్నివోర్ డైట్‌తో కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ అతిగా దీన్ని ఫాలో అయితే చివరకు కిడ్నీలో రాళ్లు, గౌట్ వంటి వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
Updated Date - Jan 25 , 2025 | 06:33 PM