Lady Finger: బెండకాయలో జిగురు పోవాలంటే.. ఈ చిట్కాలు పాటించండి..
ABN, Publish Date - Jan 22 , 2025 | 10:59 AM
బెండకాయ జిగురుగా ఉంటుందని కొంతమంది తినడానికి అస్సలు ఇష్టపడరు. అయితే, బెండకాయ జిగురు పోవాలంటే ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం..
Lady Finger: బెండకాయని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ఈ కూరగాయతో అనేక రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. బెండకాయను ఎక్కువగా చపాతీ, రోటీ లతో తినడానికి ఇష్టపడతారు. ఈ కూరగాయ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతారు. కానీ, బెండకాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా ఇది జిగురుగా ఉంటుందని కొంతమంది దీనిని తినడానికి ఇష్టపడరు. అయితే, జిగురు పోవాలంటే ఏం చేయాలి? దీని ఆరోగ్య ప్రయోజనాలేంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
బెండకాయ ప్రయోజనాలు:
బెండకాయలో విటమిన్ ఎ, సి, కె, మెగ్నీషియం, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గొంతు నొప్పి, జీర్ణ సమస్యలకు బెండకాయ ఉపశమనం కలిగిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బెండకాయలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల పొట్టను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది.
బెండకాయలోని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, కరిగే ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ వంటి సమ్మేళనాలు శరీర కణాలను దెబ్బతినకుండా రక్షిస్తాయి. బెండకాయలోని పోషకాలు ఆరోగ్యకరమైన చర్మం, జుట్టుకు సహాయపడుతాయి. అధిక ఫైబర్ వల్ల, మలబద్దకాన్ని నివారించడానికి సహాయపడుతుంది.
బెండకాయ జిగురు పోెవాలంటే..
బెండకాయ తింటే లెక్కలొస్తాయని మన పెద్దలు చెబుతుంటారు. కానీ, ఇది జిగురుగా ఉంటుందని చాలా మంది పిల్లలు దీనిని తినడానికి ఇష్టపడరు. అయితే, బెండకాయ జిగురు పోవాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. కడాయిలో బెండకాయ ముక్కలు వేయగానే కొంచెం మజ్జిగ వేసి కలిపితే జిగురు రాకుండా ఉంటుంది. బెండకాయలు కడిగిన తర్వాత కాసేపు ఆరబెట్టి కోస్తే తీగలు సాగకుండా ఉంటాయి. రెండు చుక్కల నిమ్మరసం, కొంచెం పెరుగు వేసినా బెండకాయ కూరలో జిగురు పోతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Updated Date - Jan 22 , 2025 | 11:01 AM