బంగ్లా పీటముడి
ABN, Publish Date - Feb 20 , 2025 | 01:25 AM
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్‌ను అసమర్థుడిగా, ఉగ్రవాదిగా అభివర్ణిస్తూ ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా మంగళవారం తీవ్ర విమర్శలు చేశారు...
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్‌ను అసమర్థుడిగా, ఉగ్రవాదిగా అభివర్ణిస్తూ ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా మంగళవారం తీవ్ర విమర్శలు చేశారు. అవామీలీగ్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి, వర్చువల్‌గా చేసిన ప్రసంగంలో తాను స్వదేశం తిరిగివచ్చి, జరిగిన నష్టానికి ప్రతీకారం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. ఉగ్రవాద ప్రభుత్వాన్ని తరిమికొట్టాలంటూ పిలుపునిచ్చారు. ఆమె భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న విషయం ప్రపంచమంతటికీ తెలుసు. మీ దేశంలో కూర్చొని మాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయనివ్వకండి అని బంగ్లాపాలకులు మనకు ఎప్పటికప్పుడు ఓ సుతిమెత్తని హెచ్చరిక చేస్తుంటారు. ఆమె నిశ్శబ్దంగా ఉంటే సంబంధాలు మెరుగుపడతాయని ఆశపెడుతుంటారు. ఆమె నోరువిప్పినప్పుడల్లా అప్పగింత డిమాండ్‌ను గుర్తుచేస్తుంటారు. ఎప్పటిలాగానే ఆమె జూమ్‌కాల్‌లో చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా హసీనాను వెనక్కు తీసుకురావడానికి తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందని యూనస్ కార్యదర్శి ప్రకటించారు. అధికారంలో ఉండగా ఆమె చేసిన నేరాలూ ఘోరాలకు తగిన శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారాయన. స్వదేశానికి వెళ్ళి ప్రతీకారం తీర్చుకుంటానని హసీనా, వెనక్కు రప్పించి తీరుతామని యూనస్ ఎలాగూ అంటున్నందున, పంపిచేస్తే సరిపోతుంది కదా అన్నది కొందరు సరదాగా చేస్తున్న వ్యాఖ్య.
కొద్దిరోజుల క్రితం భారతవిదేశాంగ మంత్రి జయశంకర్‌తో బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు తౌహీద్ హుసేన్‌తో మస్కట్‌లో చర్చలు జరిపారు. ఉభయదేశాల సంబంధాలు ప్రస్తుతం మెరుగుపడుతున్నాయని, ఏప్రిల్‌లో బిమ్స్‌టెక్ సదస్సు సందర్భంగా మోదీ, యూనస్ భేటీ జరిగినపక్షంలో ఘర్షణ మరింత తొలగిపోతుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. బోర్డర్‌గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) ప్రతినిధి బృందం సరిహద్దు సమస్యల పరిష్కారం, సమన్వయం లక్ష్యంగా చర్చలకు మనదేశం రావడం మంచి సంకేతం. గత ఆర్నెల్లకాలంలో స్మగ్లర్లు, క్రిమినల్స్ సహా వందలాది చొరబాటు యత్నాలు జరగడం, కొందరిని బీఎస్‌ఎఫ్ కాల్చివేయడం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. సరిహద్దు నిర్వహణ సజావుగా ఉంటే, ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటానికి అవకాశం ఏర్పడుతుంది.
హసీనా నిష్క్రమణ తరువాత, యూనస్ ప్రభుత్వం పాకిస్తాన్‌కు అన్ని రంగాల్లో వేగంగా దగ్గరవుతోంది. పాకిస్థాన్ ప్రధానితో యూనస్ పలుమార్లు భేటీ అయ్యారు. మంత్రులు, ఉన్నతస్థాయి సైనికాధికారుల రాకకపోకలు సాగుతున్నాయి. సైనికశిక్షణలు, ఉమ్మడి విన్యాసాలకు అవగాహనలు, ఒప్పందాలు కుదిరాయి. ప్రభుత్వం ఎంత దగ్గరవుతున్నప్పటికీ, ప్రజలు చారిత్రకంగా తమకు జరిగిన అన్యాయాన్ని విస్మరించి పాకిస్థాన్‌కు చేరువకాకపోవచ్చు. అంతమాత్రాన యూనస్ ప్రభుత్వంతో ఎంతోకొంత స్థాయిలో వ్యవహారాలు నడపకుండా వదిలివేయడం సరికాదు. భారతప్రధాని మోదీ ఒక్కసారి కూడా యూనస్‌తో భేటీ కాకపోవడం వల్ల మనకు కొత్తగా ఒరిగేదీ కూడా ఏమీ లేదు. సరిహద్దు ఉగ్రవాదం, ఆయుధాల అక్రమరవాణా తదితర కీలకమైన అంశాల విషయంలో నిక్కచ్చిగా ఉంటూ, మిగతా విషయాల్లో గతంలో మాదిరిగానే ఇచ్చిపుచ్చుకొనే వైఖరి చూపవచ్చు. సుదీర్ఘ సరిహద్దును పంచుకుంటున్న భారత్‌ను కాదని, పాకిస్థాన్‌తో వ్యవహరించడంలో బంగ్లాదేశ్‌కు కచ్చితంగా కొన్ని భౌగోళిక పరిమితులు ఉంటాయి. అప్పుల్లో ఉన్న పాకిస్థాన్ కంటే భారత్‌తోనే తమకు మేలు జరుగుతుందని బంగ్లాదేశ్ ప్రజలకు తెలియకపోదు. హసీనా వ్యాఖ్యానించినప్పుడల్లా బంగ్లాదేశ్‌లో మైనారిటీలమీద దాడులు జరుగుతాయి, ఢాకా నడిబొడ్డున పాలకుల పరోక్ష ఆశీస్సులతో జరిగిన బుల్‌డోజర్ మార్చ్‌లో భాగంగా ముజబూర్ రహ్మన్ ఇల్లు నేలమట్టమవుతుంది. యూనస్ ప్రభుత్వం పాకిస్థాన్‌కు చేరువుగా అడుగులు వేసినప్పుడల్లా హసీనా విమర్శలు చేస్తున్నారు. ఉభయదేశాల మధ్యా ఈ విష వలయాన్ని ఛేదించాలంటే హసీనా కొంతకాలం మాట్లాడకపోవడం అవసరం. బంగ్లాదేశ్ వ్యవహారాలను అమెరికా పట్టించుకోదని, ఆ దేశాన్ని ప్రధానమంత్రికి ఇచ్చేశానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మోదీ సమక్షంలో ప్రకటించారు. చేతికందిన ఆయుధాన్ని అతిజాగ్రత్తగా వినియోగించడం మన చేతుల్లోనే ఉంది.
Also Read:
Delhi New CM: మరోసారి బీజేపీ బిగ్ ట్విస్ట్.. ఆఖరి క్షణంలో సీఎం రేసులో ఆ రెండు పేర్లు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated Date - Feb 20 , 2025 | 01:28 AM