Delhi New CM: మరోసారి బీజేపీ బిగ్ ట్విస్ట్.. ఆఖరి క్షణంలో సీఎం రేసులో ఆ రెండు పేర్లు
ABN , Publish Date - Feb 19 , 2025 | 06:27 PM
ఢిల్లీ సీఎం ఎంపికలో బీజేపీ ఆశ్చర్యకరమైన నిర్ణయాన్ని తీసుకోబోతుందా.. ఎస్సీలకు బీజేపీ వ్యతిరేకమనే కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు అస్త్రాన్ని సిద్ధం చేసిందా.. ఢిల్లీ సీఎం ఎంపికతో కాంగ్రెస్ ప్రచారానికి చెక్ పెట్టనుందా..
బీజేపీ నిర్ణయాలను ముందే పసిగట్టడం అంత ఈజీ కాదు.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థుల ఎంపిక మొదలు.. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక విషయంలో బీజేపీ ఎప్పటికప్పుడు ట్విస్టుల మీద ట్విస్ట్‌లు ఇస్తూనే ఉంటుంది. తాజాగా ఢిల్లీ సీఎం ఎంపిక విషయంలో బీజేపీ మరో బిగ్ ట్విస్ట్ ఇవ్వనుందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఢిల్లీ సీఎంగా మహిళను ఎంపిక చేస్తారంటూ బుధవారం ఉదయం వరకు ప్రచారం జరిగింది. షాలీమార్ బాగ్ ఎమ్మెల్యే రేఖా గుప్తా పేరును ఆర్‌ఎస్‌ఎస్ ప్రతిపాదించగా.. బీజేపీ అధిష్టానం ఓకే చెప్పిందనే చర్చ జరిగింది. మరో గంటలో బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరగనుండగా.. మరికొన్ని పేర్లు ఢిల్లీ సీఎం రేసులో వినిపిస్తున్నాయి. వీరిలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఇద్దరు అభ్యర్థుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఇద్దరు ఎస్సీ రిజర్వు నియోజకవర్గాల నుంచి గెలుపొందినవాళ్లే. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఎస్సీ సామాజిక వర్గం నుంచి సీఎంను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ ఇద్దరు..
ఢిల్లీ సీఎం రేసులో మాదీపూర్, బవానా ఎమ్మెల్యే పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బవానా (ఎస్సీ) నియోజకవర్గం నుంచి రవీంద్ర ఇంద్రరాజ్ సింగ్ ఎమ్మెల్యేగా బీజేపీ తరపున గెలుపొందారు. 2013లో చివరిసారిగా బీజేపీ అభ్యర్థి ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవగా.. 2015, 2017, 2020 ఎన్నికల్లో ఆప్ ఈ సీటును గెలుచుకుంది. తాజాగా 2025 ఎన్నికల్లో ఆప్ నుంచి బీజేపీ ఈసీటును దక్కించుకుంది. ఎస్సీ రిజర్వుడు స్థానమైన బవానాలో ఎస్సీ ఓటర్లతో పాటు జాట్ ఓటర్లు కీలకం. ఈ ఇద్దరు బీజేపీ వైపు ఈ ఎన్నికల్లో మొగ్గుచూపడంతో రవీంద్ర ఇంద్రరాజ్ సింగ్ గెలుపొందారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి సీఎంను ఎంపిక చేయాలనే ఆలోచన ఉంటే మాత్రం రవీంద్ర ఇంద్రరాజ్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆప్ అభ్యర్థి జై భగవాన్‌పై 31వేలకు పైగా ఓట్ల మెజార్టీతో రవీంద్ర ఇంద్రరాజ్ సింగ్ గెలుపొందారు. అదే సమయంలో మాదిపూర్ ఎమ్మెల్యే కైలాష్ గంగ్వాల్ పేరును బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆయన కూడా ఎస్సీ రిజర్వుడు స్థానమైన మాదిపూర్ నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నియోజకవర్గం నుంచి 1993లో చివరిగా బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన 1998, 2003, 2008 ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ సీటును గెలుచుకోగా.. 2013, 2015, 2020 ఎన్నికల్లో ఆప్ ఈ సీటును గెలుచుకుంది. ఆప్ తరపున ఈ మూడు ఎన్నికల్లో గిరిష్ సోని ఎమ్మెల్యేగా గెలిచారు. 2025 ఎన్నికల్లో ఆప్ ఆయనకు సీటు నిరాకరించింది. ఆప్ నుంచి ఢిల్లీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ మంత్రి రాఖీ బిర్లాను బరిలో నిలిపింది. ఆమెను బీజేపీ అభ్యర్థి కైలాష్ గంగ్వాల్ 10వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. ప్రస్తుతం ఎస్సీ సామాజిక వర్గం నుంచి రవీంద్ర ఇంద్రరాజ్ సింగ్ , కైలాష్ గంగ్వాల్ పేర్లు సీఎం రేసులో ముందువరుసలో ఉన్నాయి.
ఎస్సీ సామాజిక వర్గం వైపు ఎందుకంటే..
ఢిల్లీ సీఎం అభ్యర్థిగా బీజేపీ ఎస్సీ సామాజికవర్గం నుంచి ఎంపిక చేయాలనే ఆలోచన వెనుక అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో అంబేద్కర్‌ను బీజేపీ అవమానిస్తోందని, ఎస్సీలకు ప్రాధాన్యత తగ్గిస్తుందనే ప్రచారాన్ని కాంగ్రెస్ ముమ్మరం చేసింది. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ఆలోచిస్తోందంటూ గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేసింది. తాజాగా ఈ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో ఎస్సీ సామాజిక వర్గం నుంచి దేశ రాజధాని ఢిల్లీ సీఎంను ఎంపిక చేస్తే కాంగ్రెస్ ప్రచారానికి అడ్డుకట్ట వేయవచ్చనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఢిల్లీ సీఎంగా ఎవరిని ఎంపిక చేయబోతుందనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here