ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రిజర్వేషన్లే సామాజిక న్యాయ మార్గమా?

ABN, Publish Date - Feb 21 , 2025 | 12:43 AM

ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలన్నది ఒక తప్పుడు ఆలోచన; ముస్లింల శ్రేయస్సుకు సానుకూల చర్య (అఫర్మేటివ్‌ యాక్షన్‌) తక్షణమే తప్పనిసరిగా చేపట్టవలసి ఉన్నది...

ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలన్నది ఒక తప్పుడు ఆలోచన; ముస్లింల శ్రేయస్సుకు సానుకూల చర్య (అఫర్మేటివ్‌ యాక్షన్‌) తక్షణమే తప్పనిసరిగా చేపట్టవలసి ఉన్నది... ఈ రెండు అంశాలనూ నేను అంగీకరిస్తున్నాను. ఇవి సమంజసమైనవని మీరూ భావిస్తే– ఆ రెండు అంశాలనూ నేను అంగీకరిస్తున్నాను– స్వీయ వైరుధ్యం కానప్పటికీ అసంగతంగా ఆలోచిస్తున్నవారుగా కనిపించవచ్చు. అయితే అది మీ తప్పు కాదు. వర్తమాన భారతదేశంలో సామాజిక న్యాయం గురించిన సంకుచితమైన భావనలే ఆ తప్పుడు ధోరణికి ఆస్కారమిస్తున్నాయి. తత్ఫలితంగా సానుకూల చర్య అనేది రిజర్వేషన్లకు– అందునా ప్రభుత్వ విద్యా, ఉద్యోగ రంగాలలో– సమానపదమై పోయింది. సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటాలు అన్నీ కోటా లేదా ఉప కోటాకు వ్యతిరేకంగా పరిణమిస్తున్నాయి. ప్రతికూలతలు లేదా వివక్ష లేదా తీరని అవసరాలతో సతమతమవుతున్న సామాజిక సమూహాలన్నీ రిజర్వేషన్లను గట్టిగా కోరుతున్నాయి. మాజీ సైనికులు, లైంగిక మైనారిటీలు, నిర్వాసితులు మొదలైన బాధిత వర్గాలు రిజర్వేషన్లను డిమాండ్‌ చేస్తున్నాయి. రోగికి శస్త్రచికిత్స చేసేందుకు ఒక పెద్ద కత్తితో ఆపరేషన్‌ టేబుల్‌ వద్ద నిలబడిన సర్జన్‌లా భారత రాజ్య వ్యవస్థ ఉంది.


మరి ముస్లిం మతస్థులు అందరికీ విద్యా ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్‌ సదుపాయం కల్పించాలన్న డిమాండ్‌ ఒకటి ఉండడంలో ఆశ్చర్యమేముంది? ముస్లింలను ఒక ‘సామాజిక మత సమూహం’గా సచార్‌ కమిటీ నివేదిక (ఎస్‌సిఆర్‌) గుర్తించినప్పటి నుంచీ ఈ డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేయనప్పటికీ వారు విద్యా రంగంలో బాగా వెనుకబడి ఉన్నారని, పైగా అపరిమితమైన ఆర్థిక ప్రతికూలతలనెదుర్కొంటున్నారని ఎస్‌సిఆర్‌ గుర్తించింది. ముస్లిం సమాజపు ఈ కఠోర వాస్తవాలను సమగ్రంగా గుర్తించిన మొట్ట మొదటి అధికారిక నివేదిక అది.

ఇటీవల విడుదలైన ఒక నివేదిక సంప్రదాయ ఆలోచనా రీతులను దాటి భిన్నమైన కొత్త ఆలోచనలకు మనలను పురిగొల్పింది. ‘Rethinking Affirmative Action For Muslims in Contemporary India’ అన్న ఆ నివేదికను హిలాల్‌ అహ్మద్‌, మొహద్‌ సన్జీర్‌ ఆలం, నజిమా పర్వీన్‌లు రూపొందించారు. ముస్లింలకు రిజర్వేషన్ల విషయమై చర్చను ఈ నివేదిక మూడు విధాలుగా ముందుకు తీసుకు వెళ్లింది. తొలుత ముస్లింల శ్రేయస్సుకు సానుకూల చర్య తీసుకోవల్సిన అవసరం ఎందుకు ఉన్నదో విపులంగా, సహేతుకంగా వాదించింది; (2) ముస్లిం మతస్థులు అందరికీ రిజర్వేషన్ల సదుపాయం కల్పించడం మంచి ఆలోచన కాదని అంగీకరించింది; (3) వివిధ ముస్లిం సామాజిక సమూహాలు ఎదుర్కొంటున్న వివిధ ప్రతికూలతలను తొలగించేందుకు పలు విధానాలను సూచించింది. ముస్లింల వెనుకబాటుతనం సమస్య పరిష్కారానికి ఒక సరైన ఆలోచనా చట్రాన్ని ఈ నివేదిక సమకూర్చిందనడంలో సందేహం లేదు. అది ప్రస్తావించిన అంశాలపై మరింత పరిశోధన అవశ్యం జరగవలసి ఉన్నది.


భారతీయ సమాజం గురించి ప్రాథమిక అవగాహన ఉన్న వారందరికీ ఆ నివేదిక ప్రస్తావించిన మొదటి అంశం స్పష్టమే. ప్రస్తుత దేశ పాలకుల నుంచి ముప్పు ఎదుర్కొంటున్న మైనారిటీ మత వర్గం వారు మాత్రమే కాకుండా విద్య, ఆర్థిక రంగాలలో తీవ్ర ప్రతికూలతలతో సతమతమవుతున్న సామాజిక సమూహం కూడా ముస్లింలే. సచార్‌ కమిటీ నివేదిక నమోదు చేసిన వాస్తవాలను ఈ నివేదిక తాజాపరిచింది. సరికొత్త అధికారిక సమాచారం ఆధారంగా విద్యారంగంలో ముస్లింల పరిస్థితి దళితుల, గిరిజనుల స్థాయితో పోల్చదగినదిగా ఉన్నదని, ఆదాయం, సంపద విషయంలో ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ)తో తుల్యంగా ఉందని ఈ కొత్త నివేదిక వెల్లడించింది. విద్యారంగంలో యువ ముస్లింలు ఎదుర్కొంటున్న ప్రతికూలతలు వారి ఆర్థిక స్థితిగతుల లేదా తల్లిదండ్రుల విద్యాస్థాయితో సంబంధం లేనివి. కుటుంబ ఆదాయం, తల్లిదండ్రుల విద్యాస్థాయికి సంబంధించి సమస్థాయిలో ఉన్న ముస్లింలతో పోల్చినప్పుడు ‘అగ్రకుల’ హిందువులు రెట్టింపు సంఖ్యలో ఉన్నత విద్యను పొందతున్నారని, ప్రైవేట్‌ విద్యా సంస్థలలో విద్యాభ్యాసం చేస్తున్నారని, ఇంజినీరింగ్‌, ఇతర వృత్తి విద్యా కోర్సులలో చేరుతున్నారని ఈ కొత్త నివేదిక వెల్లడించింది. కుటుంబ ఆదాయం, తల్లిదండ్రుల విద్యార్హతలు సమంగా ఉన్నప్పటికీ అగ్రకుల హిందువులు, ముస్లింలకు లభిస్తున్న అవకాశాలలో అసమానతలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. దక్షిణాది, పశ్చిమ భారత రాష్ట్రాలలో పరిస్థితులు ఇటీవల మెరుగు పడినప్పటికీ ముస్లింల అభ్యున్నతికి సానుకూల చర్యలు తక్షణమే చేపట్టవలసి ఉందనేది స్పష్టం.

ఇటువంటి ప్రతికూలతలు నెదుర్కొంటున్న ముస్లింలకు సామాజిక న్యాయం సమకూర్చేందకు రిజర్వేషన్ల సదుపాయం కల్పించడమే సరైన సానుకూల చర్య కాదు, కాబోదు. ఇందుకు మూడు కారణాలు ఉన్నాయి. మొదటిది– ఈ విషయంలో రాజ్యాంగ పరమైన సమస్య ఒకటి ఉన్నది. ఒక మతానికి చెందిన వారని ‘సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడినవారు’గా గుర్తించేందుకు రాజ్యాంగం అనుమతించదు. అటువంటి అనుమతికి ఆస్కారం లేదని న్యాయవ్యవస్థ స్పష్టం చేసింది. రెండోది సామాజిక పరమైనది. ముస్లిం మతస్థులు అందరూ ఒక సజాతీయ సమూహానికి చెందినవారు కాదు. హిందూ కులాలలో మాదిరిగానే ముస్లింలలో కూడా సామాజిక హోదా, విద్యాస్థాయి, ఆర్థిక అంతస్తుల విషయంలో చాలా అంతరాలు ఉన్నాయి. మూడోది రాజకీయ పరమైనది ఇప్పుడుగానీ, సమీప భవిష్యత్తులో గానీ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగితే అందుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జనసమీకరణకు రాజకీయ శక్తులు తప్పక ప్రయత్నిస్తాయి. నేటి భారతదేశంలో ముస్లింల శ్రేయస్సుకు ఇటువంటి పరిస్థితి దాపురించకుండా ఉండడడం చాలా అవసరం.


మరి ముస్లింలు ఎదుర్కొంటున్న సామాజిక ఆర్థిక ప్రతికూలతలు, వివక్షలను రూపుమాపేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి? ముస్లింలు ఎదుర్కొంటున్న భద్రత, అస్తిత్వ పరమైన సవాళ్లను పరిగణనలోకి తీసుకుని హిలాల్‌ అహ్మద్‌ ప్రభృతుల నివేదిక ఒక ప్రత్యామ్నాయ ‘కోటా పద్ధతి’ని సూచించింది. సమస్త ముస్లింలకూ రిజర్వేషన్లు కల్పించడం లేదా ముస్లింలు అందరినీ ఓబీసీలుగా పరిగణించడం కాకుండా వెనుకబడిన ముస్లిం సామాజిక సమూహాలు అన్నిటినీ ఓబీసీ జాబితాలలో చేర్చాలి. ప్రస్తుతం ముస్లింలలో సగం మంది ఓబీసీ ప్రయోజనాలు పొందడానికి అర్హులుగా ఉన్నారు. ముస్లింలలో నాలుగింట మూడు వంతుల మంది విద్యా స్థాయి, ఆర్థిక పరిస్థితులు వారిని ఓబీసీలుగా పరిగణించేందుకు అర్హులను చేస్తున్నాయి.

రెండోది ముస్లింలు అందరినీ ఒకే ఓబీసీ జాబితాలో చేర్చడం కాకుండా ఆ జాబితాను కనీసం ‘బాగా వెనుకబడిన’, ‘వెనుకబడిన’ అనే రెండు జాబితాలుగా విభజించాలి. కేరళ, కర్ణాటకలో మాదిరిగా ముస్లిం ఓబీసీలను ఒక ప్రత్యేక ఉప కోటా వర్గంగా పరిగణించడాన్ని ఈ నివేదిక వ్యతిరేకించింది. భిన్న ముస్లిం సామాజిక సమూహాలను వాటి వాటి వెనుకబడినతనం ప్రాతిపదికన వేర్వేరు ఓబీసీ జాబితాలలో చేర్చాలి. మూడోది– ‘అస్పృశ్య’ ముస్లిం సామాజిక సమూహాలను ఎస్సీలుగా వర్గీకరించడంపై ప్రస్తుతమున్న నిషేధాన్ని ఎత్తివేయాలి.


ముస్లింల అభ్యున్నతి విషయమై హిలాల్‌ అహ్మద్‌ ప్రభృతుల నివేదిక ‘ప్రాదేశిక దృక్కోణాన్ని’ కూడా సమర్థించింది. ముస్లిం జనాభా కేంద్రీకృతమై ఉన్న ప్రాంతాలలో ప్రాథమిక పౌర సదుపాయాలను మెరుగుపరచాలని సూచించింది. సచార్‌ కమిటీ నివేదిక అనంతరం ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న జిల్లాలు, మండలాలు, గ్రామాలు, ప్రాంతాలను గుర్తించి ఆయా చోట్ల ప్రాథమిక పౌర సదుపాయాలను మెరుగుపరిచే ప్రయత్నాలు జరిగాయి. ఇటువంటి ప్రయత్నాలు సంబంధిత ప్రాంతాలలో ముస్లిమేతర జనాభా మాత్రమే లబ్ధి పొందేలా ఉండకూడదని హిలాల్‌ అహ్మద్‌ ప్రభృతుల నివేదిక స్పష్టం చేసింది. వివిధ వృత్తులకు ప్రభుత్వం ఆర్థిక మద్దతునిచ్చే ‘రంగాలవారీ దృక్కోణాన్ని’ కూడా ఈ నివేదిక ఆమోదించింది. నేత, తాళాల తయారీ, తివాచీ, అత్తర్ల తయారీ మొదలైన రంగాలలో ముస్లింల ప్రాబల్యమున్నది. ఈ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయా వృత్తులకు, తయారీ రంగాలకు ఇతోధిక సహాయాన్ని, ప్రోత్సాహాన్ని అందించవలసి ఉన్నది. మూడోది ప్రైవేట్‌ రంగ సంస్థలు కూడా ముస్లింల శ్రేయస్సుకు తోడ్పాటునిచ్చే విధంగా చూడాలి. దీనిపై ఈ నివేదిక ప్రతిపాదనలు స్పష్టంగా లేవు. ప్రైవేట్‌ రంగంలో మైనారిటీ మతస్థులకు కోటా సదుపాయ కల్పన వ్యతిరేక ఫలితాలు, ప్రతికూల పర్యవసానాలకు దారి తీసే అవకాశమున్నది. అయితే సబ్సిడీలు, కాంట్రాక్టులు పొందాలంటే ప్రైవేట్‌ సంస్థలు తమ ఉద్యోగులలో సామాజిక వైవిధ్యముండేందుకు తప్పనిసరిగా శ్రద్ధ చూపేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ఆలంబనతో ముస్లింల సమస్యల పరిష్కారం, సంక్షేమ సాధన సాధ్యం కాదని గుర్తించాలి. స్థానిక ముస్లిం జనసముదాయాల పేదరికాన్ని రూపుమాపేందుకు ఎన్‌జీజి ఓలు, స్వయం సహాయక బృందాలు, వితరణశీలురను ప్రోత్సహించేందుకు కొత్త రీతుల్లో ఆలోచించాల్సిన అవసరమున్నది.

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)


Also Read: కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

Also Read: ఈసీ కన్నా జగన్ గొప్పవాడా?

Also Read: ఎమ్మెల్యేకి తీవ్ర అనారోగ్యం.. ఆసుపత్రిలో చేరిక

Also Read: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కీలక మార్పులు..

Also Read: గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష.. హైకోర్టు కీలక తీర్పు

Also Read: రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆప్ ఎంపీ ప్రత్యక్షం

For National News And Telugu News

Updated Date - Feb 21 , 2025 | 12:43 AM