సరిదిద్దడమేనా, సంస్కరణలు లేవా?
ABN, Publish Date - Feb 27 , 2025 | 04:25 AM
ముక్కుసూటితనం కలిగిన మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఆధ్వర్యంలో తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పడినప్పుడు తెలంగాణ విద్యాభిమానుల్లో ఒక భరోసా ఏర్పడింది. తెలంగాణ విద్యావ్యవస్థ,...
ముక్కుసూటితనం కలిగిన మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఆధ్వర్యంలో తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పడినప్పుడు తెలంగాణ విద్యాభిమానుల్లో ఒక భరోసా ఏర్పడింది. తెలంగాణ విద్యావ్యవస్థ, ముఖ్యంగా ప్రభుత్వరంగ పాఠశాల వ్యవస్థలో మౌలిక మార్పులు చూడవచ్చుననే ఆశలు కనిపించాయి. తీరా కొన్ని నెలలు తర్వాత తెలంగాణా విద్యా కమిషన్ అందజేసిన నివేదిక సారాంశం చూస్తే ఉన్న సమస్యలు తాత్కాలికంగా సరిదిద్దే విధంగా సిఫారసులు ఉన్నాయే తప్ప మొత్తం విద్యారంగం సంస్కరణ దిశగా లేవు.
మధ్యాహ్న భోజనం మెనూ, బిల్లులను వారం వారం చెల్లింపు, రెసిడెన్షియల్ పాఠశాలలలో స్నాక్స్ సిఫారసుతో పాటు, ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించిన ఫీజుల నియంత్రణ, వాటి అమలుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీల ఏర్పాటు వరకు కమిషన్ సిఫారసు చేసింది. అంటే– ఉన్న సమస్యల్లో తక్షణ సమస్యకు పరిష్కారం చూపిందే తప్ప, కీలకమైన నిర్ణయాల జోలికి వెళ్ళలేదని అర్థమవుతూంది. ప్రభుత్వ విద్యాసంస్థల పనితీరు మెరుగుపర్చడం; ప్రభుత్వ పాఠశాలలలో ఎన్‌రోల్మెంట్ ప్రక్రియ; అనేక రకాల యాజమాన్యాల కింద ఉన్న పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు ఓకే క్యాచ్‌మెంట్ ఏరియాకు తేవడం; విద్యాహక్కు చట్టం అమలు; పరీక్ష విధానం; తెలంగాణలో అడుగంటుతున్న విద్యా ప్రమాణాలు; వెనుకబడిన విద్యార్థుల విద్యాబోధన... ఇలాంటి కీలక నిర్ణయాల జోలికి వెళ్ళాలనే ప్రయత్నం చేసినట్లు లేదు.
మధ్యాహ్న భోజనం విషయంలో కమిషన్ సిఫారసు కొత్తదేమీ కాదు! అనేక ఏళ్ళుగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీలు చేస్తున్న డిమాండ్లనే కమిషన్ ప్రభుత్వానికి సూచనగా నివేదించింది. ఇక ప్రైవేటు విద్యా సంస్థలలో ట్యూషన్ ఫీజులు తప్ప ఇతరత్రా పీజులు వసూలు చేయకుండా నియంత్రించేందుకు రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ కమిటీలు వేయాలన్న సూచన, దాన్ని అమలుపరిచే యంత్రాంగ సూచన కూడా అరకొర సంస్కరణ రూపం గానే ఉంది. మళ్ళీ ప్రైవేటు విద్యా వ్యవస్థ నియంత్రణ కమిటీలు అని చెప్పి నామినేటెడ్ పదవుల పందేరం జరిగి, ప్రైవేటు స్కూల్ అనుయాయులకే ఈ పదవులు కట్టబెడితే ఆ సిఫారసు మూలంగా ప్రభుత్వానికి గానీ, ప్రజలకు గానీ ఒరిగేదేమీ ఉండదు. ప్రైవేటు విద్యాసంస్థల్లో భాగస్వామ్యం లేని విద్యారంగ ప్రముఖులు, సామాజిక సేవకులతో రాజకీయాలకు అతీతంగా ఈ కమిటీలు వేసినప్పుడు మాత్రమే కమిషన్ సిఫారసులు ఎంతోకొంత సజావుగా అమలు జరిగే అవకాశం ఉంది. వీటన్నింటికి మించి సమగ్ర శిక్షా అభియాన్ క్యాచ్‌మెంట్ ఏరియాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి ఆయా ఆవాస ప్రాంతాలలో ఉన్న ప్రైవేటు పాఠశాల రవాణా సౌకర్యాలు నిషేధిస్తే తప్ప విద్యావ్యవస్థ పూర్తి సంస్కరణ దిశగా పయనించదు.
ఇకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఎకరాలకు ఎకరాల విలువైన స్థలాలు, పాఠశాల భవనాలు ఉన్నప్పటికీ సరైన సంఖ్యలో విద్యార్థుల నమోదు లేదు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్న గురుకులాలలో సరైన బోధనా సిబ్బంది లేదు. తెలంగాణ విద్యా కమిషన్ ఈ రెండు వ్యవస్థలలో సమతౌల్యం కాపాడే సిఫారసులు చేస్తే బావుండేది. అనేక ఏండ్లుగా విద్యా బాధ్యతల నుండి వైదొలగుతూ వచ్చిన పాలకులు ప్రభుత్వ విద్యావ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ప్రైవేటు విద్యా వ్యవస్థను ప్రొత్సహించారు. దాని అత్యున్నత రూపమే ఫీజు రీయింబర్స్‌మెంట్. ఇప్పటికే ఉచితాల ఊబిలో లక్షల కోట్లు అప్పు చేసిన పాలకులు ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో కూడా అనేక ఏళ్ళుగా పెండింగ్‌లో పెట్టడంతో ఇంటర్మీడియట్ స్థాయి నుండి పీజీ స్థాయి వరకు ప్రైవేటు విద్యా వ్యవస్థ తెలంగాణా రాష్ట్రంలో కుప్పకూలింది. ఇక విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీయింబర్సమెంట్‌నే ప్రభుత్వ కళాశాలలకు గ్రాంట్లుగా ఇవ్వగలిగితే ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలు పూర్వ వైభవం సంతరించుకొనే అవకాశం ఉంది.
తెలంగాణా విద్యా కమిషన్ ఇటీవల కార్పోరేట్ పాఠశాలల్లో పెరుగుతున్న విద్యార్థుల బలవన్మరణాలు గురించి పరిశోధించాల్సిన అవసరం ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన స్థితి ఏమంటే– ప్రభుత్వం సరైన నిర్మాణం లేని ఇంజనీరింగ్ కళాశాలల బిల్డింగులను అద్దెకు తీసుకుని గురుకులాల పేరుతో లక్షలాది రూపాయలను అద్దెల రూపంలో ఈ బిల్డింగ్ యజమానులకు ప్రతి నెలా చెల్లిస్తున్నది. దీనికి బదులు విశాలమైన స్థలం, ప్రాంగణాలు, బిల్డింగ్ సౌకర్యాలు పూర్తిగా ఉన్న, పెద్దగా పిల్లలు లేని సమీప ప్రభుత్వ పాఠశాల భవనాల లోనికి ఈ గురుకుల పాఠశాలలను మార్చి భారం దించుకోవచ్చు గదా? ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న వేలాది పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెలపోతున్నాయి. వాటిని బలోపేతం చేయకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఏకలవ్య, నవోదయ, సైనిక, స్పోర్ట్స్ ఇలా ఓ ఇరవై రకాల పాఠశాల వ్యవస్థలను వివిధ పేర్లతో పెంచి పోషించడం ఎందుకు? ఈ అన్నిరకాల పాఠశాలల్లో ఒకే రకమైన సిలబస్ అయినప్పుడు విద్యకు కుల మతాల రంగులు అవసరమా?
‘‘ఒక దేశ భవిష్యత్ తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది’’ అన్న రజనీ కోఠారీ మాటల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకొని, ఆ దిశగా విద్యా రంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు గాని, తెలంగాణా విద్యా కమిషన్ సిఫారసులు గానీ ఉండాలని ఆకాంక్షిద్దాం.
ఎన్. తిర్మల్
సామాజిక కార్యకర్త
Also Read: జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు
Also Read: TGS RTC MahaLakshmi: ‘మహాలక్ష్మీ’తో ఆర్టీసీ సిబ్బంది.. ఇబ్బంది
Also Read: దోషులైన నేతలపై జీవిత కాల నిషేధం: కేంద్రం ఏమన్నదంటే..
For AndhraPradesh News And Telugu News
Updated Date - Feb 27 , 2025 | 04:25 AM