Jammu And Kashmir: జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు
ABN , Publish Date - Feb 26 , 2025 | 03:35 PM
Jammu And Kashmir: జమ్ము కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆర్మీ జవాన్లే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆర్మీ జవాన్లు సైతం ఎదురు కాల్పులకు తెగబడ్డారు. ఆ క్రమంలో ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

శ్రీనగర్; ఫిబ్రవరి 26: జమ్మూ కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజౌరీ జిల్లాలోని నియంత్రణ రేఖ సమీపంలో ఆర్మీ జవాన్లను తీసుకు వెళ్తున్న ట్రక్‌ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అయితే ఈ కాల్పుల్లో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు. బుధవారం సుందర్‌బనీ సెక్టార్‌లో పాల్ గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుందని వారు వివరించారు. అటవీ ప్రాంతంలో నక్కిన ఉగ్రవాదులు ఈ కాల్పులు జరిపారని చెప్పారు.
ఈ ప్రాంతం నుంచే జమ్మూ కశ్మీర్‌లోకి ఉగ్రవాదులు చోరబడతారని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు భద్రతా దళాలు సైతం అదే సమయంలో ఉగ్రవాదులపైకి ఎదురు కాల్పులకు దిగాయన్నారు. ఈ కాల్పుల ఘటనపై ఆర్మీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. హుటాహుటిన భద్రత దళాలు రంగంలోకి దిగాయి. అందులోభాగంగా ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపుతోపాటు తనిఖీ కార్యక్రమాన్ని ముమ్మరం చేసినట్లు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.
గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలోని పార్టీలు ఘన విజయం సాధించాయి. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌లో ప్రధానిగా మోదీతోపాటు ఆయన కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. అదే సమయంలో జమ్మూ కశ్మీర్‌లో రియాసీ జిల్లాలోని శివ్ ఖోడీ ఆలయాన్ని సందర్శించుకొని.. కాట్రాకు యాత్రికులతో వెళ్తున్న బస్సుపై పోని ప్రాంతంలోని తెర్యాత్ గామ్రం వద్ద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
ఉగ్రవాదుల కాల్పుల నుంచి తప్పించేందుకు డ్రైవర్.. బస్సు వేగాన్ని పెంచాడు. దీంతో ఆ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో పదిమంది యాత్రికులు అక్కడికక్కడే మరణించగా.. మరో 33 ప్రయాణికులు గాయపడ్డారు. ఆ నాటి నుంచి జమ్మూ కశ్మీర్‌లో ఎక్కడో అక్కడ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు మరణిస్తున్నారు. మరోవైపు గతేడాది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
అది కూడా ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఈ ఎన్నికలు జరగడంతో.. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి ఓటర్లు పట్టం కట్టారు. దీంతో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకోవైపు జమ్మూ కశ్మీర్‌లో ప్రజాస్వామ్య పద్దతిలో ప్రభుత్వం ఏర్పాటైనా.. అడపాదడపా ఉగ్రవాదులు రెచ్చి పోతుండడం పట్ల ఆ రాష్ట్ర ప్రజలు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
For National News And Telugu News