కృత్రిమ మేధ: భ్రమలూ, వాస్తవాలూ!
ABN, Publish Date - Feb 20 , 2025 | 01:42 AM
ఈమధ్య, ‘కృత్రిమ మేధ’ని ఆకాశానికి ఎత్తేస్తూ పత్రికల్లో వ్యాసాలూ సంపాదకీయాలూ వస్తున్నాయి. దాన్ని ‘శ్రేయో మేధ’ అనీ, ‘మేధో విప్లవం’ అనీ, ఇంకేదో అనీ, చెపుతున్నారు. ‘కృత్రిమ మేధ’ గురించి నాకు...
ఈమధ్య, ‘కృత్రిమ మేధ’ని ఆకాశానికి ఎత్తేస్తూ పత్రికల్లో వ్యాసాలూ సంపాదకీయాలూ వస్తున్నాయి. దాన్ని ‘శ్రేయో మేధ’ అనీ, ‘మేధో విప్లవం’ అనీ, ఇంకేదో అనీ, చెపుతున్నారు. ‘కృత్రిమ మేధ’ గురించి నాకు పెద్దగా తెలియదు. అందుకని, కంప్యూటర్ రంగంలో దాదాపు 40ఏళ్ళ అనుభవం వున్నవాడు, అమెరికాలో పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేసిన జె.ప్రసాద్‌తో మాట్లాడితే, కొంచెం అర్ధం అయింది. అయితే, నేను ఈ వ్యాసంలో రాయదలుచుకున్నది, ఆ సైన్స్ గురించి కాదు. నిజానికి ఏ సైన్సు అయినా, ప్రస్తుత సమాజంలో, ఏ వర్గ ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుందో చెప్పాలని మాత్రమే!
‘కృత్రిమ మేధ’ అనేది, మనుషులు కొన్ని పనులు జరగడం కోసం రాసుకునే ఒక కంప్యూటర్ ప్రోగ్రాం- అట! ఇంకా, సరిగా చెప్పాలంటే, ‘మనుషులు రాసుకునే’ అనే బదులు, ‘పెట్టుబడిదారీ యజమానులు రాయించుకునే’ అంటేనే బాగా సరిపోతుంది! మొత్తానికి, ‘కృత్రిమ మేధ’ అంటే, ఒక ‘కంప్యూటర్ మీద పని చేసే సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాం’ అనుకోవచ్చు. ఈ ప్రోగ్రాం, మానవ భాషనూ, వ్యక్తీకరణనూ అర్ధం చేసుకుంటూ, అనేక రంగాలకు సంబంధించిన, ఎంతో విస్తారమైన సమాచారాన్ని పోగుచేసి, అనేక విషయాలను, అనేక కోణాల్లో వివరంగా విశ్లేషించి చెపుతుందట! ‘కృత్రిమ మేధ’ కూడా మానవులు తమ ‘ఉత్పత్తి శక్తులు పెరగడం కోసం’ తయారు చేసుకున్న ఒక సాధనమే! ‘ఉత్పత్తి శక్తులు పెరగడం’ అంటే మెరుగైన ఉత్పత్తి సాధనాలను చేతిలోకి తీసుకుని పనిచేసే శ్రామికులు (ఇక్కడ ‘సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు’) తక్కువ మంది, తక్కువ సమయంలో, ఎక్కువ పనిని, ఎక్కువ సామర్థ్యంతో చేయడం. అంతే! (వారికి పని గంటలు తగ్గేదేమీ వుండదు సుమా!)
ఈ ‘కృత్రిమ మేధ’ చేయగలిగే పనులు ఇన్నిన్ని కావట! ఎన్నెన్నోనట! వాటిల్లో కొన్ని మాత్రమే చూద్దాం ఇక్కడ: (1) ఏ రంగానికి సంబంధించినదైనా, అనంతమైన సమాచారాన్ని, అతితక్కువ సమయంలో, వేగంగా, ఎక్కువ ఖచ్చితత్వంతో, అనేక కోణాల్లో విశ్లేషిస్తుందట! (2) రోగ నిర్ధారణను పొరపాట్లు లేకుండా చేసి, చికిత్సా విధానాలను కూడా సూచిస్తుందట!
(3) రక రకాల రచనలనూ, అనువాదాలనూ, అతి తక్కువ సమయంలో, వేగంగా, అతి తక్కువ దిద్దుబాట్లు మాత్రమే అవసరమయ్యే విధంగా, చేస్తుందట! (4) వాతావరణంలో మామూలు ఊహకు అందని ఏ మార్పులు రావచ్చునో, వాటిని ఏ విధంగా ఎదుర్కోవచ్చునో, ఖచ్చితమైన అంచనా వేసి చెపుతుందట.
(5) స్కూలు పిల్లలకి హోమ్‌వర్కులు చేసి పెడుతుందట! లెక్కలు కూడా చేసి పెడుతుందట! అనేక భాషల్లో ఏ విషయం మీదైనా సరే వ్యాసాలు రాసి పెడుతుందట. (6) సాఫ్ట్‌వేర్ విద్యార్ధులకు కొత్త ప్రోగ్రాములు రాసి పెడుతుందట. (7) ఒక కొత్త ప్రోగ్రాముని, ఎవరన్నా తయారు చేస్తే, దాన్ని పరిశీలించి, దాన్ని ‘కృత్రిమ మేధ’ రాసిందో, మనుషులు రాశారో, తేల్చి చెబుతుందట. (8) కావలిసిన విధంగా, అన్నిరకాల సినిమాలకీ– సాంఘికాలకీ, జానపదాలకీ, పౌరాణికాలకీ–కధల్నీ, సన్నివేశాల్నీ, సంభాషణల్నీ, పాటల్నీ, సంగీతాన్నీ, దృశ్యాల్నీ... ఇలా ఏ రకం సినిమా తీయదలుచుకున్నారో, ఆ రకంగా చేసిపెడుతుందట! (9) మరమనుషులతోనూ (రోబోట్స్‌తో), మానవరహిత వాహనాలతోనూ (డ్రోన్స్‌తో) రకరకాల వ్యాపారాల శాఖలలో, అతి తక్కువమంది ఉద్యోగులతో పనిచేయిస్తుందట. (10) నేలమీదే కాదు, అంతరిక్షంలో కూడా పరిశోధనల్ని తేలిగ్గా చేసిపెడుతుందట! – ఇలా, ఒకటేమిటి, ఇందుగలదందు లేదని, సందేహము వలదు! ఎందెందు వెతికి చూసిన అందందే, ‘‘కృత్రిమ మేధ’’ని ఉపయోగించి, కంపెనీలు, ఎన్నో లాభాలు గడించవచ్చునట!
కొంతమంది పెట్టుబడిదారులు, ఒక ‘కృత్రిమ మేధ’ కంపెనీ మొదలుపెట్టి, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లని జీతాలకి పెట్టుకుని, కొత్త కొత్త సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాములు రాయిస్తారు. ఆ ప్రోగ్రాములు అనేక రకాలుగా వుంటాయి. ఆస్పత్రులకూ, సైన్సు పరిశోధనలకూ కావలిసినవి ఒక రకం! బ్యాంకులకు కావలిసినవి ఇంకో రకం! పెద్ద పెద్ద యంత్రాలతో నడిచే పరిశ్రమలకి మరో రకం! అంతరిక్ష పరిశోధనలకు ఇంకో రకం ప్రోగ్రాములు! సినిమాలకు అన్నిటినీ మించిన రకం! – ఇలా, ‘కృత్రిమ మేధ’ అనే సైన్సుతో, రకరకాల ప్రోగ్రాముల్ని తయారు చేయించే కంపెనీలు ప్రపంచంలో దాదాపు 70 వేల దాకా వున్నాయని ఒక లెక్క! ఈ కంపెనీల్లో తయారయ్యే ప్రోగ్రాములన్నీ అమ్మకం కోసం తయారైన సరుకులే! కాకపోతే, అవి సబ్బుల్లాగో, చెప్పులూ, చొక్కాలూ లాగో, వస్తువులుగా వుండవు.
తేలిగ్గా అర్ధం చేసుకోవడానికి, ‘కృత్రిమ మేధ’ అనేదాన్ని, పోలిక కోసం, ఒక పనిముట్టుగా, ఒక యంత్రంగా చెప్పుకోవచ్చు. కాకపోతే, అది ఒక కదిలే యంత్రంలా వుండదు. దాన్ని చేత్తో ముట్టుకోలేము. అది యంత్రాలకి నేర్పడానికి కొన్ని సూత్రాల, సూచనల రూపంలో (‘సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాం’గా) వుంటుంది. దానిని ఉపయోగిస్తూ, కొత్తగా శ్రమలు జరుగుతాయి. దాన్ని సరిగా వాడుకుంటే, దాని ఉపయోగాలు దానికుంటాయి. తక్కువ సమయంలో, తక్కువమంది మేధా శ్రామికులతో, ఎక్కువ పని జరగడానికి ఉపయోగపడుతుంది. ఈ కొత్త టెక్నాలజీ, పెట్టుబడిదారీ యజమానుల చేతుల్లో ఆస్తిగా ఉంటుంది కాబట్టి, దీన్ని ‘పెట్టుబడిదారీ మేధ’ అని అంటే ఎక్కువ సరిగా వుంటుంది! ఎక్కువ లాభాల్ని తెచ్చిపెట్టేదిగా వుంటుంది కాబట్టే, ఈ రంగంలో పెట్టుబడులు క్రమంగా పెరిగిపోతున్నట్టు వార్తలొస్తున్నాయి. 2025లో, ఈ రంగంలో పెట్టుబడులు దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు అవుతాయట!
ఏ కంపెనీలో పెట్టుబడి అయినా, రెండు భాగాలుగా వుంటుంది గదా? (1) సాధనాల కోసం పెట్టే డబ్బు. ‘కృత్రిమ మేధ’ కంపెనీలలో, ఉత్పత్తి సాధనాలుగా వుండేవి కంప్యూటర్లూ, లాప్‌టాప్‌లూ, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులూ, వగైరా. ఇవి ఎంత సామర్ధ్యంగలవిగా వుండాలీ అనేది, తయారు చేయవలిసిన ప్రోగ్రాముల్ని బట్టి వుంటుంది. మామూలు కంప్యూటర్లూ, లాప్‌టాపులూ సరిపోతాయా; లేకపోతే, సూపర్ స్పీడ్ కంప్యూటర్లు కావాలా అనేది వ్యాపార స్తాయిని బట్టీ, ఆ ప్రోగ్రాముల్ని బట్టీ వుంటుంది. (2) ఆ సాధనాలను ఉపయోగించి, రకరకాల, కొత్త కొత్త ప్రోగ్రాములు తయారు చేసే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకి ఇచ్చే జీతాలు. ఈ జీతాలు, సాధారణంగా, ఇతర రంగాల్లో పనిచేసే ఉద్యోగుల జీతాలకంటే, బాగా ఎక్కువగా వుంటాయి. ఎందుకంటే, వీళ్ళు తయారు చేసే ప్రోగ్రాముల్ని వాడే పరిశ్రమల్లోగానీ, ఇతర పని స్తలాల్లో గానీ, ఎక్కువమంది ఉద్యోగులు అవసరం లేకుండానే పని జరిగేలా, ‘కృత్రిమ మేధ’తో తయారైన ప్రోగ్రాములు తయారు చేస్తారు కాబట్టి! – అంటే, ‘కృత్రిమ మేధ’ అనే కొత్త టెక్నాలజీ ఏయే పని స్తలాల్లోకి వస్తుందో, ఆ పని స్తలాల్లో పనులు చేస్తూవున్న అనేక మందికి ఉద్యోగాలు పోతాయి. దీనికి పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలు చెప్పే పరిష్కారం ఏమిటంటే: అక్కడ పనులు పోయినా, ‘కృత్రిమ మేధ’ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు వస్తాయి -అని! కానీ, నిజమైన లెక్కలూ, అంచనాలూ వేరేగా వుంటున్నాయి. ‘కృత్రిమ మేధ’కి సంబంధించిన వెబ్‌సైట్ల సర్వేల ప్రకారం, ‘కృత్రిమ మేధ’కి సంబంధించిన టెక్నాలజీ వాడడం వల్ల, కొద్దికాలంలోనే, ప్రపంచవ్యాప్తంగా, 30కోట్ల మందికి ఉద్యోగాలు పోతాయనీ, కేవలం 9 కోట్ల, 70 లక్షల ఉద్యోగాలు మాత్రమే కొత్తగా వస్తాయనీ తేలింది! అయినప్పటికీ, పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలు వంకర వాదనలు చేస్తూనే వున్నారు.
కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడల్లా, ఈ రకం మాటలు, ఈ నాడే కాదు, 150 ఏళ్ళ కిందట కూడా వుండేవని, మార్క్సు ‘కాపిటల్’ ద్వారా ఇలా తెలుస్తుంది: ‘‘కార్మికులను పనినించీ తొలగించే యంత్రాలన్నీ, అదే తరహా కార్మికులను పనిలో నియమించడానికి తగినంత పెట్టుబడిని, అదే సమయంలో, తప్పనిసరిగా విడుదల చేస్తాయని జేమ్స్ మిల్, మాక్ కులోచ్, టోరెన్స్ సీనియర్, జాన్ స్టువర్ట్ మిల్, ఇంకా మొత్తం వరసగా బూర్జువా రాజకీయ అర్ధశాస్త్రగ్న్యులు నొక్కి చెపుతున్నారు...(కానీ) యంత్రాల్లో వచ్చే ప్రతీ మెరుగుదలతోటీ, అది (ఆ పెట్టుబడి) పనిలో నియమించే వారి సంఖ్య తగ్గుతూనే వుంటుంది.’’ (‘యంత్రాలూ, ఆధునిక పరిశ్రమలూ’ అనే చాప్టర్‌లో.) తేడా అల్లా, మార్క్స్ కాలమేమో, ప్రధానంగా భారీ యంత్రాల కాలం. ఇప్పుడేమో, భారీగా వున్న యంత్రాల సామర్ధ్యాన్ని మరింత భారీగా మెరుగుపరిచే ‘పెట్టుబడిదారీ మేధ’ కాలం!
చివరిగా, ఎవరైనా అనవచ్చును: ‘‘ఎన్నో గొప్ప ఉపయోగాల్ని ఇచ్చే ‘కృత్రిమ మేధ’ వంటి టెక్నాలజీని వ్యతిరేకించాలా? గత 200 ఏళ్ళల్లో ఎన్నో రకాల టెక్నాలజీలు రాలేదా? వాటిని ఉపయోగిస్తూనే వున్నాం గదా? కొత్త టెక్నాలజీని వదిలేస్తూ, వెనక్కి, వెనక్కి, గుహల్లో జీవించే కాలానికే తిరిగి పోదామా?’’ దానికి జవాబు: మంచి టెక్నాలజీని వద్దనడం లేదు. అది సమాజంలో, మానవులందరికీ మంచిదై వుండాలి! దానిని పెట్టుబడిదారీ పద్ధతుల్లో వాడడం వల్ల, శ్రమ దోపిడీ విపరీతంగా జరుగుతున్న విషయాన్ని గుర్తించాలి. తక్కువ సమయంలో, ఎక్కువ పని జరిగి, ఈ టెక్నాలజీతో నడిచే కంపెనీలకు లాభాలు పెరగవచ్చును గానీ, మెరుగైన టెక్నాలజీతో పనిచేసే శ్రామికులకు పని గంటలు తగ్గుతాయా? ఈ టెక్నాలజీ వల్ల, తోటి మనుషులకు పనులు పోయే, తిండి పోయే పరిస్తితులు వస్తున్నాయి. ఇదంతా, కేవలం లాభాపేక్షతో నడిచే పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం వల్లనే! దీన్ని వ్యతిరేకించే ఆలోచనా ధోరణినీ, పోరాటాల అవసరాన్నీ గుర్తించాలి! మార్క్సు హెచ్చరించినట్టు, టెక్నాలజీలో ‘‘ప్రగతి మరింత తక్కువ కాలంలో, ఒక పద్ధతిలో, మరింత ఎక్కువ పని చేయించుకునేందుకు, అంటే, శ్రమ శక్తిని మరింత తీవ్రంగా దోచుకునేందుకు ఒక సాధనంగా ఎలా ఉపకరిస్తోందో’’ గమనించాలే గానీ, ఆ టెక్నాలజీ సృష్టించే భ్రమల్లో పడిపోకూడదు!
రంగనాయకమ్మ
Also Read:
Delhi New CM: మరోసారి బీజేపీ బిగ్ ట్విస్ట్.. ఆఖరి క్షణంలో సీఎం రేసులో ఆ రెండు పేర్లు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated Date - Feb 20 , 2025 | 01:42 AM