ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పెళ్లికి ముందే జంటగా ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌

ABN, Publish Date - Feb 16 , 2025 | 11:25 AM

పరిణయం.. రెండు జీవితాల సంగమం. కడదాకా కలిసుండేందుకు ముడిపెట్టే బంధం. అందుకు ఇద్దరి మధ్య తరగనంత ప్రేమతో పాటు తగినంత డబ్బూ అవసరమే. ఎందుకంటే, భార్యా భర్తల సంబంధంలో డబ్బు చాలా సున్నితమైన, ప్రధాన అంశంగా మారింది.

- మనీ మ్యాటర్స్‌ ముందే మాట్లాడుకుంటే బెటర్‌

- తద్వారా వైవాహిక బంధానికి, భవిష్యత్‌కు భరోసా

పరిణయం.. రెండు జీవితాల సంగమం. కడదాకా కలిసుండేందుకు ముడిపెట్టే బంధం. అందుకు ఇద్దరి మధ్య తరగనంత ప్రేమతో పాటు తగినంత డబ్బూ అవసరమే. ఎందుకంటే, భార్యా భర్తల సంబంధంలో డబ్బు చాలా సున్నితమైన, ప్రధాన అంశంగా మారింది. ఇరువురి మధ్య ఆర్థిక విబేధాలతో వివాహ బంఽధం బీటలు వారే ప్రమాదం ఉంది. ఒక్కోసారి విడాకులకూ దారి తీయవచ్చు. అందుకే, పెళ్లికి ముందే జంటగా ఆర్థిక విషయాలు, లక్ష్యాలపై చర్చించుకోవడం మేలు. తద్వారా వారి వైవాహిక జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను జంటగా పరిష్కరించుకునేందుకు ముందు నుంచే సిద్ధం కావచ్చు. అయితే, కాపురానికి ముందే ఇలాంటి విషయాలను ప్రస్తావిస్తే కాబోయే భర్త లేదా భార్య తనను డబ్బు మనిషి అనుకుంటారన్న సందేహం ప్రతి జంటలోనూ ఉంటుంది. కానీ, మీ దృక్పథాన్ని, లక్ష్యాన్ని నిజాయితీగా, స్పష్టంగా వివరించగలిగితే మీ భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది.


మీ భాగస్వామి ఆర్థిక దృక్పథాన్ని అర్ధం చేసుకోండి..

కుటుంబ ఖర్చులు లేదా పెట్టుబడుల గురించి చర్చించే ముందు ఆర్థిక విషయాల్లో మీ భాగస్వామి వైఖరిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు కాబోయే భర్త లేదా భార్య దృష్టిలో డబ్బు అంటే ఆర్థిక భరోసానా..? స్వేచ్ఛా జీవితమా..? లేదా వినోదం, విలాసాలా..? ఈ విషయాన్ని పసిగట్టగలిగితే మీ భాగస్వామి ఖర్చు చేసే విధానం, ఆర్థిక ప్రాధాన్యాలపై ఓ అంచనాకు రాగలుగుతారు. అలాగే, మీ ఆర్థిక దృక్పథంలో పోల్చి చూసుకోవచ్చు. తద్వారా వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాక తలెత్తే అభిప్రాయ భేధాలను ముందుగానే నివారించుకునే వీలుంటుంది. అంతేకాదు, ఆర్థిక విషయాలపై ఏ కోణంలో చర్చ మొదలు పెట్టాలనే విషయంపైనా అవగాహన లభిస్తుంది. ఉదాహరణకు, మీరు పొదుపరి. కానీ, మీ భాగస్వామి ఆనందాల కోసం బాగా ఖర్చు చేస్తారనుకుందాం. ఈ సందర్భంలో ముందుగా చర్చించుకోవడం ద్వారా పెళ్లి తర్వాత మధ్యేమార్గంపై ఓ నిర్ణయానికి రావడంతోపాటు భవిష్యత్‌ ప్రణాళికను రచించుకునేందుకు వీలుపడుతుంది.


పారదర్శకంగా చర్చించండి..

పెళ్లికి ముందే ఆర్థిక విషయాల్ని చర్చించినా, అందులో పారదర్శకత లేకపోతే కాపురంలో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కేవలం ఆదాయం, ఖర్చులనే కాదు కుటుంబ ఆర్థిక లక్ష్యాలనూ గుర్తించి వాటిపైనా చర్చించాలి. ఖర్చులపై పరిమితులు, భవిష్యత్‌ అవసరాలు.. అందుకున్న పొదుపు మార్గాలనూ చర్చలో భాగం చేయండి. అప్పుడే మీ ఆర్థిక దృక్పథం కాబోయే భాగస్వామికి స్పష్టంగా అర్థమవుతుంది. తద్వారా వైవాహిక భవిష్యత్‌కు భరోసా లభిస్తుంది.

ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోండి..

జంట ప్రయాణంలో కారు, ఇళ్లు కొనుగోలు దగ్గరి నుంచి పిల్లల చదువు, రిటైర్మెంట్‌ వరకు ముందే ప్లాన్‌ చేసుకోండి. స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను ముందుగానే గుర్తించడం ద్వారా ఆది నుంచే అందుకోసం పొదుపు ప్రారంభించవచ్చు.


నీది.. నాది

డబ్బు విషయంలో భార్యాభర్తల మధ్య నీది.. నాది అనే తేడాలు రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఇద్దరూ సంపాదించేవారైతే, ఒకరి డబ్బును మరొకరు వినియోగించుకోవడం, ఎవరి సంపాదన ఎందుకోసం ఖర్చు చేయాలనే విషయాల్లో పెళ్లికి ముందే స్పష్టమైన అంగీకారానికి రావడం మేలు. అలాగే, జాయింట్‌ అకౌంట్లు, బీమా పాలసీలు, పెట్టుబడి పథకాలు.. వాటికి నామినీలుగా ఎవరుండాలనే విషయాలపైనా ఇరువురూ ఓ అవగాహనకు వస్తే మరింత మంచిది. జీవితంలో ఎప్పుడేం జరుగుతోందో ఎవరూ చెప్పలేరు. అందుకే, ఆర్థిక తక్షణావసరాలను తీర్చుకునేందుకు వీలుగా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. కనీసం 3 నుంచి 6 నెలల ఆర్థిక అవసరాలను తీర్చగలిగేలా ఈ నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే, జీవిత, ఆరోగ్య బీమా కవరేజీని సమకూర్చుకోవడం కూడా కీలకం.

Updated Date - Feb 16 , 2025 | 11:25 AM