ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Illegal Ghee Scam: భోలేబాబా, వైష్ణవి, ఏఆర్‌నడుమ ‘నెయ్యి'

ABN, Publish Date - Feb 11 , 2025 | 04:28 AM

టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం కోసం ఈ మూడు రాష్ట్రాలకు చెందిన భోలేబాబా, వైష్ణవి, ఏఆర్‌ డెయిరీల నడుమ అక్రమ బంధం ఏర్పడింది.

  • మూడింటికీ టెండర్లలో పాల్గొనే అర్హత లేదు.. తప్పుడు డాక్యుమెంట్లతో పాల్గొన్న వైనం

  • 2022లోనే భోలేబాబా నెయ్యి తిరస్కరించిన టీటీడీ.. దీంతో వైష్ణవి ద్వారా ఏఆర్‌ డెయిరీకి నెయ్యి

  • అంతిమంగా ఏఆర్‌ నుంచి టీటీడీకి తరలింపు.. సెప్టెంబరులోనే తప్పుకొన్న పొమిల్‌, విపిన్‌ జైన్లు

  • తమ తరఫున వైష్ణవి డైరెక్టర్లుగా కారు డ్రైవర్లు.. సిట్‌ రిమాండ్‌ రిపోర్టులో విస్తుగొలిపే విషయాలు

(తిరుపతి-ఆంధ్రజ్యోతి)

ఉత్తరాఖండ్‌, ఏపీ, తమిళనాడు నడుమ ట్రయాంగిల్‌ అక్రమ నెయ్యి దందా నడిచింది. టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం కోసం ఈ మూడు రాష్ట్రాలకు చెందిన భోలేబాబా, వైష్ణవి, ఏఆర్‌ డెయిరీల నడుమ అక్రమ బంధం ఏర్పడింది. ఈమూడు డెయిరీలకు చెందిన నలుగురు డైరెక్టర్లను అరెస్టు చేసిన సందర్భంగా కోర్టుకు సమర్పించిన సిట్‌ రిమాండ్‌ రిపోర్టులో మతి పోగొట్టే అంశాలు అనేకం ఉన్నాయి. తిరుమలలో లడ్డూల తయారీకి జంతువుల కొవ్వు కలిపి కల్తీ చేసిన నెయ్యిని వాడిన వ్యవహారంపై సిట్‌ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. రిమాండ్‌ రిపోర్టులోని అంశాలను బట్టి.. భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు అయిన పొమిల్‌ జైన్‌, విపిన్‌ జైన్‌లు ఈ అక్రమ దందాలోకి వైష్ణవి డెయిరీని, ఏఆర్‌ డెయిరీని లాగారు. తొలుత వైష్ణవి డెయిరీలో షేర్లు కొనుగోలు చేసి దానికి డైరెక్టర్లుగా మారారు. అక్కడ కీలక స్థానాల్లో తమ మనుషులను నియమించుకున్నారు. వారి ద్వారా ఏఆర్‌ డెయిరీని ముగ్గులోకి లాగారు. తతిమ్మా కథ తెలిసిందే! టీటీడీ టెండర్లలో పాల్గొనే అర్హత ఈ మూడు డెయిరీలకూ లేకపోవడం గమనార్హం. అయితే అక్రమ పద్ధతుల్లో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి టీటీడీకి నెయ్యి సరఫరా చేసే టెండర్లలో పాల్గొన్నారు. టెండర్లు దక్కించుకుని నాసిరకం, కల్తీ నెయ్యి సరఫరా చేసి అరెస్టయ్యారు.


2019లో మొదలైన కథ ఇది!

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం రూర్కీలోని భోలేబాబా డెయిరీ 2019లో తొలిసారిగా టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. అప్పట్లో ఈ డెయిరీ కిలో రూ.291 ఽధరతో నెయ్యి టిన్నులను టీటీడీకి అందించింది. ఆ ఏడాదిలోనే ఈ డెయిరీ డైరెక్టర్లు పొమిల్‌ జైన్‌, విపిన్‌ జైన్‌...తిరుపతికి చేరువలోనివైష్ణవి డెయిరీ యాజమాన్యాన్ని సంప్రదించారు. వైష్ణవి డెయిరీ టీటీడీ టెండర్లలో పాల్గొని అర్హత పొందితే ఆ డెయిరీ పేరిట తామే టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తామని ప్రతిపాదించారు. ఇందుకు సహకరిస్తే 2 నుంచి 3 శాతం వరకూ కమీషన్‌ చెల్లిస్తామని ఆఫర్‌ ఇవ్వడంతో వైష్ణవి డెయిరీ యాజమాన్యం అంగీకరించింది. జాతీయ డెయిరీల కేటగిరీలో భోలేబాబా డెయిరీ టీటీడీకి నెయ్యిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేది. 2022లో టీటీడీ ల్యాబ్‌ టెస్టుల్లో ఆ నెయ్యి విఫలం కావడంతో తిరస్కరించారు.

వైష్ణవిలో షేర్లు కొని డైరెక్టర్లుగా మారి...

భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పొమిల్‌ జైన్‌, విపిన్‌ జైన్‌....వైష్ణవి, ఏఆర్‌ డెయిరీలను ముగ్గులోకి దింపారు. వారిద్దరూ వైష్ణవి డెయిరీలో షేర్లు కొని భాగస్వాములుగా మారిపోయారు. అప్పటి నుంచీ వారిద్దరి తరపున అపూర్వ వినయ్‌కాంత్‌ చావడా సీఈవో హోదాలోనూ, సబ్బిల్‌ కలీముల్లా ఖాన్‌ అలియాస్‌ సామీర్‌ ప్లాంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ హోదాలోనూ వైష్ణవి డెయిరీ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు.


మూడు రూపాయల కమీషన్‌కు కక్కుర్తి పడి...

తమిళనాడు రాష్ట్రం దిండిగల్‌లోని ఏఆర్‌ డెయిరీ పాల విక్రయ వ్యాపారం చేస్తుండేది. అందులో భాగంగా చాలా కాలం నుంచి అలపట్టి చిల్లింగ్‌ సెంటర్‌ నుంచీ ఏపీలోని వైష్ణవి డెయిరీకి పాలు సరఫరా చేసేది. ఈ కారణంగా వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ చావడాకు ఏఆర్‌ డెయిరీ ఎండీ రాజశేఖరన్‌తో సన్నిహిత పరిచయాలున్నాయి. ఆ పరిచయాన్ని పురస్కరించుకుని చావడా ఆయన్ను ముగ్గులోకి లాగారు. టీటీడీకి నెయ్యి సరఫరా ప్రక్రియ గురించి రాజశేఖరన్‌కు వివరించిన చావడా నెయ్యి సరఫరా గురించి తాను చూసుకుంటానని, ఏఆర్‌ డెయిరీ పేరు వాడుకున్నందుకు కిలోకు రూ. 2.75 నుంచీ రూ. 3 వరకూ కమిషన్‌ చెల్లిస్తానని ఆఫర్‌ ఇచ్చారు. దీనికి రాజశేఖరన్‌ అంగీకరించారు. 2023 మేలో చావడా ఏఆర్‌ డెయిరీ పేరిట మెయిల్‌ ఐడీ క్రియేట్‌ చేశారు. ఏఆర్‌ డెయిరీ డాక్యుమెంట్లతో టీటీడీ ఇ-టెండర్లలో పాల్గొని ఆర్డర్‌ దక్కించుకున్నారు. భోలేబాబా డెయిరీ నుంచి వైష్ణవి డెయిరీకి వచ్చిన నెయ్యిని ఏఆర్‌ డెయిరీ పేరిట టీటీడీకి సరఫరా చేశారు. వాటి నమూనాలను సేకరించి టీటీడీ గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ ల్యాబ్‌కు పంపడం, అక్కడ టెస్టుల్లో నెయ్యిలో వెజిటబుల్‌, యానిమల్‌ ఫ్యాట్స్‌ వున్నాయని రిపోర్టులు రావడం తెలిసిందే.

కమీషన్‌ ఏజంటుగా శ్రీనివాసన్‌

చెన్నైకి చెందిన శ్రీనివాసన్‌ పేరు సిట్‌ దర్యాప్తులో ప్రముఖంగా వినిపించింది. టీటీడీ నిర్వహించే నెయ్యి సేకరణ టెండర్లలో ఇతడి పాత్ర కీలకంగా ఉందని సిట్‌ గుర్తించింది. ఇతడు 2018 నుంచీ భోలేబాబా డెయిరీకి కమిషన్‌ ఏజంటుగా వ్యవహరించేవాడని సిట్‌ దర్యాప్తులో వెల్లడైంది. ఆపై 2019 నుంచి వైష్ణవి డెయిరీకి కమీషన్‌ ఏజంటుగా వ్యవహరిస్తున్నాడని, అలాగే 2022 నుంచి మాల్‌గంగా డెయిరీకి, 2023 నుంచి ఏఆర్‌ డెయిరీకి ఏజంటుగా పనిచేస్తున్నట్టు సిట్‌ గుర్తించింది.


భోలేబాబా నుంచి ఏఆర్‌ డెయిరీకి నగదు బదిలీ

2023 అక్టోబరులో అప్పటి వైసీపీ హయాంలో టీటీడీ... జాతీయ డెయిరీలకు, 1500 కిలోమీటర్ల పరిధిలోని డెయిరీల నుంచి నెయ్యి సరఫరాకు ఇ-టెండర్లు పిలించింది. ఏఆర్‌ డెయిరీ ఆ టెండర్లలో పాల్గొనేందుకు ఈఎండీ చెల్లించాలి. రెండు కేటగిరీల కింద ఈఎండీ చెల్లింపు కోసం భోలే బాబా డెయిరీ నుంచే నగదు ఏఆర్‌ డెయిరీ ఖాతాకు బదిలీ అయింది. 2023 అక్టోబరు 21న భోలేబాబా డెయిరీ ఖాతా నుంచి ఆర్టీజీఎస్‌ ద్వారా రూ. 38 లక్షలు, రూ. 32 లక్షలు చొప్పున మొత్తం రూ. 70 లక్షలు ఏఆర్‌ డెయిరీ ఖాతాకు బదిలీ అయింది. అలాగే మరో సందర్భంలో అంటే 2024 మార్చి 11న ఇ-టెండర్ల ఈఎండీ చెల్లింపుల కోసం భోలేబాబా డెయిరీ నుంచీ ఏఆర్‌ డెయికీరి ఆర్టీజీఎస్‌ ద్వారా రూ. 51 లక్షలు బదిలీ అయింది. అదనపు ఈఎండీ రూ. 29 లక్షలు సైతం భోలేబాబా డెయిరీ నుంచీ ఏఆర్‌ డెయిరీకి 2024 మే 21న బదిలీఅయింది. ఏఆర్‌ దాన్నే టీటీడీకి చెల్లించింది.


కొత్త డైరెక్టర్లుగా కారు డ్రైవర్లు

సిట్‌ దర్యాప్తులో ఆసక్తికరమైన మరో అంశం వెలుగు చూసింది. గతేడాది సెప్టెంబరు 1న అంటే నెయ్యి కల్తీ వ్యవహారం బయటకు రాకమునుపే వైష్ణవి డెయిరీ డైరెక్టర్లు పొమిల్‌ జైన్‌, విపిన్‌ జైన్‌ ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేశారు. తమ స్థానంలో సురేంద్ర సింగ్‌, సౌరభ కశ్యప్‌ అనే కొత్త వ్యక్తులను వారు డైరెక్టర్లుగా నియమించారు. ఈ ఇద్దరూ ఎవరా అని ఆరా తీసిన సిట్‌ అధికారులు కంగుతిన్నారు. కొత్త డైరెక్టర్లుగా నియమితులైన ఇద్దరూ పాత డైరెక్టర్లు పొమిల్‌ జైన్‌, విపిన్‌ జైన్‌ల సొంత కారు డ్రైవర్లని తేలింది. కాగా, సోమవారం భోలేబాబా డెయిరీకి సంబంధించిన మరో డైరెక్టర్‌ను సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఆ వ్యక్తిని తిరుపతి సిట్‌ కార్యాలయానికి తీసుకొచ్చి విచారిస్తున్నట్టు తెలిసింది. కాగా, ఈ కేసులో నలుగురు నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ సిట్‌ అధికారులు తిరుపతి కోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు.


Also Read: సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల లేఖ.. ఎందుకంటే..?

Updated Date - Feb 11 , 2025 | 04:30 AM