Perni Nani: మేనేజ్ చేసి మేనేజర్ పైకి నెట్టి
ABN, Publish Date - Jan 03 , 2025 | 05:48 AM
పేదల బియ్యాన్ని స్వాహా చేసి అడ్డంగా దొరికి పోయిన మాజీ మంత్రి పేర్ని నాని తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఓ అమాయకుడిని బలి చేసేందుకు సిద్ధమయ్యారు.
బియ్యం కేసులో అమాయకుడిని బలి చేసే వ్యూహం
చేసిన తప్పును గోడౌన్ మేనేజర్‌పై నెట్టేసే ప్రయత్నం
6 నెలల క్రితమే మేనేజర్‌కు బాధ్యతలంటూ
పోలీసు విచారణలో పేర్ని భార్య బుకాయింపు
2023 నుంచి మేనేజర్‌గా పనిచేస్తున్న మానస్ తేజ్
ఏడాదిలో అతని ఖాతాలో రూ.22.39 లక్షలు జమ
బియ్యం విక్రయం ద్వారానే వచ్చి చేరిన నగదు
ఆ డబ్బంతా పేర్ని కుటుంబానికే అందజేత
విచారణలో గుర్తించిన పోలీసులు
(విజయవాడ - ఆంధ్రజ్యోతి): పేదల బియ్యాన్ని స్వాహా చేసి అడ్డంగా దొరికి పోయిన మాజీ మంత్రి పేర్ని నాని తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఓ అమాయకుడిని బలి చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికోసం ఆయన కుటుంబం బుకాయించేందుకు వెనుకాడలేదు. తమ గోదాములో బియ్యం మాయమైన కేసులో బుధవారం పోలీసు విచారణకు పేర్ని నాని సతీమణి జయసుధ హాజరైన విషయం తెలిసిందే. బియ్యం పక్కదారి పట్టిన ఉదంతంలో తమ తప్పు ఏమీ లేదని, తప్పంతా మేనేజర్‌దేనని ఆమె వాంగ్మూలం ఇచ్చారు. గోదాము మేనేజర్ విషయంలో ఆమె అబద్ధాలు చెప్పేందుకు ప్రయత్నం చేయగా.. పోలీసుల విచారణలో అసలు విషయాలు బయటపడ్డాయి.
ఒప్పందం సాక్షిగా..
బందరు మండలం పొట్లపాలెం గ్రామంలో ఎల్‌పీ నంబరు 89/2, 92/1లో పేర్ని కుటుంబ సభ్యులకు 11 ఎకరాల భూమి ఉంది. ఇందులో పేర్ని జయసుధ పేరు మీద 2.18 ఎకరాలు ఉండగా మిగిలిన భూమి ఆమె తల్లి సత్యనారాయణమ్మ పేరుతో ఉంది. ఇక్కడ పేర్ని నాని అత్త పేరుతో సత్య వేర్ హౌస్, పేర్ని జయసుధ పేరుతో జేఎస్ వేర్ హౌస్ గోదాములు నిర్మించారు. జయసుధ పేరుతో ఉన్న గోదామును పౌరసరఫరాల శాఖకు లీజుకు ఇచ్చారు. 2022లో గోదాముల నిర్మాణం పూర్తికాగా 2023 జనవరి 9న పౌరసరఫరాల శాఖతో లీజు ఒప్పందం చేసుకున్నారు. ఈ లీజు ఒప్పందంలో సాక్షిగా బేతపూడి మానస్ తేజ్, రావి ప్రత్యూష సంతకం చేశారు. 2023 జనవరి నుంచే మానస్ తేజ్ గోదాము మేనేజర్‌గా, ప్రత్యూష గోదాములో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. దానికి ఒప్పంద పత్రమే నిదర్శనం. కానీ బుధవారం నాటి పోలీసు విచారణలో పేర్ని జయసుధ తనకు ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆరు నెలల క్రితమే మానస్ తేజ్‌ను మేనేజర్‌గా నియమించామని చెప్పారు. అయితే మానస్ తేజ్ రెండేళ్లుగా మేనేజర్‌గా చేస్తున్నారంటూ పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దానికి లీజు అగ్రిమెంట్‌ను రుజువుగా చూపారు.
2023 అక్టోబరు నుంచి నగదు లావాదేవీలు
మానస్ తేజ్‌ను మేనేజర్‌గా నియమించిన తర్వాతే గోదాములో బియ్యం పక్కదారి పట్టాయని చెప్పి, ఈ అక్రమంలో తమకు ఏమీ సంబంధం లేదని పేర్ని కుటుంబం బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు సేకరించిన నగదు లావాదేవీల వివరాల్లో 2023 అక్టోబరు నుంచి 2024 నవంబరు వరకు మానస్ తేజ్ బ్యాంకు ఖాతాలో రూ. 22,39,980 జమ అయిందని గుర్తించారు. నెలకు రూ.10 వేలు జీతానికి పనిచేసే వ్యక్తి ఖాతాలో ఏడాది కాలంలో ఇంత పెద్ద మొత్తం జమ కావడం ఎలా సాధ్యమన్న విషయాన్ని పేర్ని కుటుంబం విస్మరించింది. తప్పును అతనిపై తోసివేసేందుకు ప్రయత్నిస్తోంది. మానస్ తేజ్ బ్యాంకు ఖాతాలో జమ అయిన డబ్బు.. బియ్యం విక్రయించడం ద్వారానే సమకూరిందని, దాన్ని అతను పేర్ని కుటుంబ సభ్యులకు అందజేశాడని పోలీసుల విచారణలో స్పష్టమైంది. పోలీసు విచారణలో తాము చెప్పినట్లు 6 నెలల క్రితం మేనేజర్‌గా నియమితుడైన వ్యక్తి ఏడాది కాలంగా బియ్యాన్ని ఎలా విక్రయిస్తున్నాడనే ప్రశ్నకు పేర్ని కుటుంబం సమాధానం ఇవ్వాల్సి ఉంది.
Updated Date - Jan 03 , 2025 | 05:48 AM