Anantapur : కులాంతర ప్రేమలపై కత్తి!
ABN, Publish Date - Mar 06 , 2025 | 03:37 AM
ఆడబిడ్డలు వేరే కులం అబ్బాయిలను ప్రేమించడమే నేరమైపోయింది! కులాంతర ప్రేమలను తండ్రులు జీర్ణించుకోలేక కన్నపేగులపైనే కత్తులు దూశారు.
గుంతకల్లులో పరువు హత్య
కూతురిని ఉరేసి చంపి.. పెట్రోలు పోసి నిప్పు
మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న వైనం
4 రోజుల క్రితం ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి
కుప్పంలో కూతురిపై కత్తితో దాడి
ప్రేమికులతోపాటు మధ్యవర్తులకూ గాయాలు
గుంతకల్లు టౌన్, కుప్పం, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ఆడబిడ్డలు వేరే కులం అబ్బాయిలను ప్రేమించడమే నేరమైపోయింది! కులాంతర ప్రేమలను తండ్రులు జీర్ణించుకోలేక కన్నపేగులపైనే కత్తులు దూశారు. గుంతకల్లులో ఓ తండ్రి ఏకంగా కూతురిని ఉరేసి చంపేసి, ఆపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. కుప్పంలో జరిగిన మరో ఘటనలో.. కూతురిపై తండ్రి కత్తితో విచక్షణారహితరంగా దాడిచేశాడు. ప్రేమికులతోపాటు మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వివరాలివీ.. అనంతపురం జిల్లా గుంతకల్లు తిలక్‌నగర్‌కు చెందిన రామాంజినేయులు టిఫిన్ సెంటర్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య, నలుగురు కూతుళ్లు ఉన్నారు. ముగ్గురు కూతుళ్లకు వివాహం జరిపించారు. చిన్న కూతురు భారతి(21) కర్నూలులో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్న ఓ యువకుడిని ప్రేమించింది. అతడిది వేరే కులం కావడంతో తల్లిదండ్రులు భారతిని మందలించారు. కానీ అతడినే పెళ్లి చేసుకుంటానని భారతి తేగేసి చెప్పింది. అదే జరిగితే తమ పరువు పోతుందని భావించిన రామాంజినేయులు, మార్చి ఒకటో తేదీన కూతురిని బైక్‌పై ఎక్కించుకుని గుంతకల్లు మండలం కసాపురానికి తీసుకువెళ్లాడు. గ్రామ శివారులోని తిక్కస్వామి దర్గా వద్ద పొలంలోకి తీసుకువెళ్లి చివరి ప్రయత్నంగా ఆ యువకుడిని మరచిపోవాలని నచ్చజెప్పినా, వినకపోవడంతో బలవంతంగా పట్టుకుని, చెట్టుకు ఉరి వేసి వెళ్లిపోయాడు. కొంత దూరం వెళ్లాక మళ్లీ తిరిగొచ్చి భారతి మృతిచెందినట్లు గుర్తించి, తన బైక్‌లో నుంచి పెట్రోల్ తీసి, కూతురి మృతదేహంపై చల్లి నిప్పంటించాడు. మంగళవారం రామాంజినేయులు గుంతకల్లు టూటౌన్ పోలీస్టేషన్‌కు వెళ్లి కూతురిని హత్య చేసిన విషయం చెప్పాడు. కసాపురం పోలీసులు బుధవారం రామాంజినేయులుతో కలిసి వెళ్లి దహనమైన మృతదేహాన్ని చూశారు. కుక్కలు పీక్కుతినడంతో మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం చేయించారు.
మధ్యవర్తుల సమక్షంలోనే..
చిత్తూరు జిల్లా కుప్పంలో కులాంతర వివాహం చేసుకున్న కూతురిపై బుధవారం ఆమె తండ్రే కత్తి దూశాడు. గుడుపల్లె మండలం అగరం కొత్తపల్లెకు చెందిన శివమూర్తి కూతురు కౌసల్య (21), అదే గ్రామానికి చెందిన చంద్రశేఖర్ (25) ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి ప్రేమను అంగీకరించలేదు. దీంతో వారిద్దరూ తమిళనాడు వెళ్లిపోయి ఈనెల 3న పెళ్లి చేసుకుని, గ్రామానికి తిరిగొచ్చారు. ఇరు కుటుంబాల మధ్య మధ్యవర్తిత్వం నెరపడానికి టీడీపీ నాయకుడు ఒకరు బాధ్యత తీసుకున్నారు. ఈ క్రమంలో బుధవారం ప్రేమ జంట కౌసల్య, చంద్రశేఖర్, వారి తండ్రులు శివమూర్తి, కోదండప్పలతోపాటు మధ్యవర్తులైన సీతారామప్ప, రమేశ్ కుప్పం చేరుకున్నారు. అక్కడ కూతురు కౌసల్యకు, తండ్రి శివమూర్తికి మధ్య మాటామాటా పెరిగింది. ఆగ్రహం పట్టలేకపోయిన శివమూర్తి కూతురిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో కౌసల్య, అడ్డొచ్చిన చంద్రశేఖర్, మధ్యవర్తులు రమేశ్, సీతారామప్ప కూడా గాయపడ్డారు. అనంతరం శివమూర్తి పారిపోయాడు. గాయపడిన వారిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు కుప్పం అర్బన్ సీఐ చెప్పారు.
Updated Date - Mar 06 , 2025 | 03:37 AM