AP High Court : కిలారికి షరతులతో ముందస్తు బెయిల్
ABN, Publish Date - Jan 01 , 2025 | 07:14 AM
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టడమే కాకుండా అసభ్యకర పోస్టులు పెట్టేలా అనుచరులను ప్రోత్సహించారనే ఆరోపణలపై నమోదైన కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు హైకోర్టు
మరో 8 మంది సహ నిందితులకూ మంజూరు
అమరావతి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టడమే కాకుండా అసభ్యకర పోస్టులు పెట్టేలా అనుచరులను ప్రోత్సహించారనే ఆరోపణలపై నమోదైన కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేలతో 2 పూచికత్తులు సమర్పించాలని పిటిషనర్‌ను ఆదేశించింది. చార్జిషీట్ దాఖలు చేసేవరకు వారంలో ఒకరోజు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూ ర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో 8మందికి ముందస్తు బెయిల్ ఇచ్చారు. వీరికి కూడా షరతులు వర్తిస్తాయని స్పష్టం చేశారు. తన కుమార్తెపై సోషల్ మీడియా లో అనుచిత పోస్టులు పెట్టడమే కాకుండా ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేసేలా అనుచరులను ప్రోత్సహించారంటూ పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సతీమణి జోతిర్మయి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కిలారు రోశయ్య, ఆయన అనుచరులపై పొన్నూ రు రూరల్ పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రోశ య్య పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున సీనియ ర్ న్యాయవాది ఓ.మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
వాట్సాప్ గ్రూపులోని సభ్యులు షేర్‌చేసిన పోస్టులకు అడ్మిన్ గా ఉన్న పిటిషనర్‌ను బాధ్యుడిని చేయడానికి వీల్లేదని, పిటిషనర్ ఎలాంటి అనుచిత పోస్టులు చేయలేదన్నారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, ఫొటోలను ఎవరు మార్ఫింగ్ చేశారో దర్యాప్తులో తేలుతుందని తెలిపారు. ఈ వ్యవహారంలో పూర్తి సమాచారం కోసం సామాజిక మాధ్యమాల సంస్థలకు లేఖలు రాశామని, పిటిషనర్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. ఫిర్యాదుదారు తరఫున న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ ప్రో త్సాహంతోనే అతని అనుచరులు ఫిర్యాదుదారు కుమార్తెపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని తెలిపారు.
Updated Date - Jan 01 , 2025 | 07:14 AM